ఆశ్రిత లక్షణం | Disasters can significantly impact individuals on end of the world | Sakshi
Sakshi News home page

ఆశ్రిత లక్షణం

Jul 7 2025 12:39 AM | Updated on Jul 7 2025 12:39 AM

Disasters can significantly impact individuals on end of the world

మంచిమాట

తమకు జీవితాన్ని ప్రసాదించి, తాము చేసే పనికి ఎంతోకొంత సొమ్మును పారితోషికంగా ఇచ్చి రక్షించే యజమానిని ఆశ్రితులు సైతం రక్షించడం పరమ విధి. అసలు ఆశ్రితులు అంటే ఎవరు? బాధల్లో ఉన్నప్పుడు గానీ, మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ‘‘నేనున్నాను’’ అని చెంత నిలిచి ఆదరించేవాడు మిత్రుడు, ఆ రకంగా విపత్తులో మేలు పొందినవాడు ఆశ్రితుడు. పెద్ద అర్థంలో తీసుకుంటే, జగతిలోని జీవులందరూ ఆశ్రితులే..!! అందరినీ రక్షించేది ఆ పరంధాముడే..!!

ఈ విశాల విశ్వంలో ఏదో ఒక అవసరాన్ని తీర్చుకునేందుకు మనం మరొకరి మీద ఆధారపడక తప్పదు. ఆ విధంగా ఆపత్కాలంలో మనను ఆదుకున్నవాళ్ళను వదిలి వేయకుండా, వీలున్నంతగా సహాయం చేయగలగడమే ఉత్తమ ఆశ్రిత లక్షణం. ఇక, ప్రస్తుత ప్రపంచంలో విభిన్న రకాలవ్యాపకాల్లో, ఉద్యోగాల్లో తమ విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఆశ్రితుల కోవలోకే వస్తారు.

 తమ సంస్థ ఒక్కొక్కసారి అభివృద్ధిలో ఉన్నతస్థానంలో నిలువవచ్చు, మరొకసారి ఊహించని ఇబ్బందుల్లో కూరుకుపోవచ్చు. అయితే, సంస్థ ఉత్థానంలో ఏ విధంగా ఉద్యోగులు ఆనందించి, తమ వ్యక్తిగత ప్రగతికి బాటలు వేసుకున్నారో, ఆ సంస్థ కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు, సంస్థను వీడకుండా, తమ వంతు సహకారాన్ని అందించాలి. 

తాము సంస్థకు వెన్నెముకగా ఉన్నామని, ఏ ఇబ్బందినైనా దాటడంలో తాము అహరహం కృషి చేస్తామని యాజమాన్యానికి భరోసా యివ్వాలి. ఎక్కడ తమకు ఎక్కువ జీతం, సదుపాయాలు ఉంటాయో, అక్కడికి తక్షణమే మారిపోయే ప్రస్తుత తరానికి చెందిన యువతీ యువకులు ఈ మాటలు వింటే నవ్విపోతారు. వారి దృష్టిలో ఈ విధంగా నడుచుకోవడం దాదాపుగా అసాధ్యం. 

కానీ, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో తోడుగా నిలిచి, ఉత్తేజాన్ని అందించే ఈ ఉత్తమ లక్షణం సంస్థకు భవితను చూపడంలో అత్యంత అవసరం. ఏ సంస్థ మనుగడకైనా నమ్మకస్తులైన ఉద్యోగులు చాలా అవసరం. వారి అంకితభావం, సంస్థ తమ సొంతం అన్న బలీయమైన అనుబంధం వల్లనే ఆ సంస్థ లేక వ్యవస్థ నాలుగు కాలాలపాటు పచ్చగా నిలబడుతుంది. శతాబ్దాలుగా వ్యాపార వ్యవహారాలను అచ్చెరువొందేలా నిర్వహిస్తూ, చెదరని నమ్మకానికి నమూనాగా నిలిచిన అగ్రగామి సంస్థల రహస్యం ఆ సంస్థను ఆశ్రయించి ఉండడమే గాక, సర్వకాల సర్వావస్థల్లో తమ సహకారాన్ని అందించే ఉద్యోగులే..!!

ఇక, రామాయణ కథలోనూ అత్యంత విశ్వసనీయులైన ఆశ్రితులు మనకు తారసపడతారు. ముందుగా చెప్పుకోవలసింది సుగ్రీవుడు. అన్నయైన వాలిపట్ల భయంతో కొండల్లో తలదాచుకున్న సుగ్రీవుడు, శ్రీరాముని శరణు వేడి, రఘువీరుని పరాక్రమంతో వాలి నిహతుడు కాగా, తాను కిష్కింధకు రాజయ్యాడు. సీతాన్వేషణ ఘట్టంలో నలుచెరగులకు వానరులను పంపి, శ్రీరామునికి ప్రీతిని కలిగించాడు. అదే విధంగా చెప్పుకోవలసిన మరొక అద్భుత పాత్ర విభీషణునిది. అన్న ధర్మవిహితమైన తన మాటలను పెడచెవిని పెట్టడంతో రాముని శరణు వేడాడు. 

రావణుని తమ్ముడైన విభీషణునికి శరణాగతిని ప్రసాదించి, ఆశ్రయమిచ్చాడు. రాముని నీడలో ఆశ్రితుడైన విభీషణుడు రామునికి యుద్ధ సమయంలో లంకలోని రాక్షసుల బలాబలాలను, బలహీనతలను తెలియజేసి, దుష్ట సంహారానికి బాటలు వేశాడు. ఆఖరికి అయోధ్య త్వరగా చేరాలన్న రాముని ఆతృతను గమనించి, శ్రీరాముని తన పుష్పక విమానంలో సాగనంపి, తన శుభ లక్షణాలను లోకాలన్నిటికీ ఘనంగా తెలియజేశాడు. అధునాతన యుగంలోనూ ఆశ్రితులు ఈ విధంగా తమకు ఆశ్రయమిచ్చిన వారికి సహకరిస్తే,  సంస్థలు ఇతోధికంగా వృద్ధి చెందుతాయని, దేశ పురోగతికి బంగరు బాటలు  ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.

పచ్చటి కోరిక
భారతీయ పురాతన కాలానికి చెందిన ఒక కథను ఈ సందర్భంలో పరికించడం సమంజసం. కాశీదేశంలో ఒక వేటగాడు విషపూరితమైన బాణాన్ని లేడిపై ప్రయోగించగా అది పచ్చటి ఫలవృక్షానికి తాకింది. దాని ప్రభావం వల్ల ఆ చెట్టు కొద్ది కాలానికి పూర్తిగా ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో కొంతకాలంగా ఒక చిలుక నివసిస్తూ ఉండేది. ఎండిపోయినా, ఆ చెట్టును వీడిపోకుండా చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివాసం ఉండసాగింది. ఒకానొక సందర్భంలో దేవరాజైన ఇంద్రుడు ఆ చిలుకతో సంభాషిస్తూ, ‘‘ఓ చిలుకా.. ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. 

ఈ చెట్టు తొర్రలో ఉండడంవల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, పచ్చగా ఉన్న మరొక చెట్టును ఆశ్రయించి, నీవు ఆనందంగా గడుపు’’ అని సలహా యిచ్చాడు. ఇంద్రుని మాటలకు ప్రత్యుత్తరమిస్తూ, ఆ చిలుక ‘‘చెట్టు పండినపుడు ఉండడం, ఎండినపుడు విడిచిపోవటం కృతఘ్నత కదా.. ఈ చెట్టు ఎండిపోయినా, నేను ఇక్కడే ఉంటాను..’’ అంది. దేవేంద్రుడు ఆ చిలుక మాటలకు ఎంతగానో సంతోషించాడు. చిలుకను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చిలుక ‘‘స్వామీ..! ఈ చెట్టుకు పూర్వ వైభవాన్ని అనుగ్రహించు’’ అని కోరింది. ఆ చిలుక కోరిన విధంగానే దేవేంద్రుడు ఆ చెట్టు మళ్ళీ పచ్చగా ఉండేలా కటాక్షించాడు. ఆ విధంగా ఆశ్రితురాలైన ఆ చిలుక వల్ల ఆ చెట్టుకు మేలు జరిగి, పునర్వైభవాన్ని పొందింది. ఆశ్రితుల లక్షణం ఇంత చక్కగా ఉంటే, యజమాని లేక సంస్థకు ఎంతో మేలు జరుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

– తత్వ ప్రవచన సుధాకర
వెంకట్‌ గరికపాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement