
హైదరాబాద్: కాహో-సాక్సాన్‌తో కలిసి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో “విపత్తులను సమర్థంగా నిర్వహించడానికి సంసిద్ధత” అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్యాట్రన్ డాక్టర్ హరికుమార్ రెడ్డి, ఆర్గనైజింగ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎంవీఎన్ సురేష్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు రోగుల భద్రత విషయంలోను, పూర్తి సమన్వయంతో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలోను వైద్య నిపుణులు, విద్యార్థులు తగిన విజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందడంపై ఈ వర్క్‌షాప్ ప్రధానంగా దృష్టిసారించింది. మంగళూరు, కోయంబత్తూరు, బెంగళూరు లాంటి నగరాల నుంచి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు హాజరై, పలు సెషన్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వర్క్‌షాప్ ప్యాట్రన్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ, “విపత్తు సంసిద్ధత అనేది వైద్యరంగంలో ఉన్నవారికి ఆప్షన్ కాదు.. అత్యవసరం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అన్నింటికీ సిద్ధంగా ఉండే సంస్కృతిని పెంపొందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ వృత్తి నిపుణులు, భావి నాయకులు ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు అందరూ సమన్వయంతో సమర్థంగా, శరవేగంగా స్పందించడానికి తగిన నైపుణ్యాలు పొందుతారు” అని చెప్పారు.
ఎమర్జెన్సీ విభాగాలు, అంబులెన్సు సర్వీసుల ప్రాధాన్యాన్ని ప్రధాన వక్త, జీవీకే ఈఎంఆర్ఐ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమణారావు నొక్కిచెప్పారు. అలాగే విపత్తు సంసిద్ధతకు మాక్ డ్రిల్స్ కూడా బాగా ఉపయోగపడతాయన్నారు. సిద్ధంగా ఉండడం, వేగంగా స్పందించడంపై హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక దళాధికారి టి. వెంకన్న మాట్లాడారు. సంక్షోభానికి సంబంధించిన కమ్యూనికేషన్లలో మీడియా పాత్ర గురించి సీనియర్ జర్నలిస్టు యాండ్రపు రాజశేఖర్ వివరించారు.
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్ వి.హర్షిణి, డాక్టర్ ప్రవీణ్ చంద్ర, డాక్టర్ కౌశిక్ తదితరులు చెక్‌లిస్టులు, వాస్తవ పరిస్థితులు, గోల్డెన్ అవర్ ప్రాధాన్యం గురించి తమ ఆలోచనలు పంచుకున్నారు.
ఏఐహెచ్ఏ ప్రిన్సిపాల్, శాక్సాన్ ఆర్గనైజింగ్ ఛైర్‌పర్సన్ డాక్టర్ విజయ రుద్రరాజు, ఏజే ఆస్పత్రి మెడికల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, కాహో ఎస్ఈసీ ఛైర్‌పర్సన్ డాక్టర్ అనిత మర్ల మాట్లాడుతూ, వైద్యరంగంలో తలెత్తే సవాళ్ల విషయంలో విద్యార్థులు ప్రాక్టికల్ విజ్ఞానాన్ని పొందడానికి ఇలాంటి అమూల్యమైన విషయాలు తెలియజేయడం ఎంతో ముదావహమని ప్రశంసించారు.
ముందస్తు ప్రణాళికలు, బృందంగా పనిచేయడం, నిర్మాణాత్మక ప్రోటోకాల్స్ అనుసరించడం ద్వారా వైద్యరంగంలో విపత్తు స్పందనను బలోపేతం చేసుకోవాలన్న బలమైన సందేశాన్ని ఈ వర్క్‌షాప్ అందించింది.