breaking news
the Department of Education
-
గుర్తింపులేని ప్రైవేటు బడులు 165
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా ప్రైవేటు విద్య పరుగెడుతోంది. విద్యార్థులనుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు మంగళం పాడుతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా కొనసాగుతున్న పాఠశాలలు కొన్నైతే.. అసలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా మరికొన్ని పాఠశాలలు బాహాటంగా నడుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలో చదివిన విద్యార్థి ధ్రువపత్రాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోరు.అయినా జిల్లాలో గుర్తింపులేని పలు పాఠశాలలు ప్రచారంతో విద్యార్థులను దారిమళ్లిస్తున్నాయి. ఈ క్రమంలో జి ల్లాలో 165పాఠశాలలు ప్రభుత్వ గుర్తిం పు లేకుండా కొనసాగుతున్నాయని విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో అధికారులు వెంటనే వాటిపై చర్యలు మొదలుపెట్టారు. కొనసాగిస్తే కేసులే.. జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు.. ప్రాథమిక చర్యల్లో భాగంగా నోటీ సులు జారీ చేశారు. గతవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన మం డల విద్యాశాఖ అధికారులు గుర్తింపులేకుండా కొనసాగుతున్న స్కూళ్ల జాబి తాను తేల్చి జిల్లా విద్యాశాఖకు సమర్పించారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు తమ పరిధిలోకి వచ్చే ఆయా స్కూళ్లకు ఎంఈఓలు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ గుర్తింపు వచ్చేవరకు పిల్లలను చేర్చుకోవద్దని, బడికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులను ధిక్కరించి పాఠశాలలను కొనసాగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వాటిని సీజ్ చేయనున్నట్లు తేల్చిచెప్పారు. అనుమతిలేని పాఠశాలలు 165 గుర్తించగా.. ఇందులో నగర శివారు మండలాలైన ఘట్కేసర్, హయత్నగర్, సరూర్నగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, బాలానగర్లలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆకస్మిక తనిఖీలు.. ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేసేందుకు సమాయత్తమవుతోంది. అనుమతిలేని బడులు నడుస్తున్నట్టు గుర్తిస్తే సీజ్ చేసి, అందులోని పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ మండలస్థాయి అధికారులను ఆదేశించింది. ఇప్పటికే గుర్తింపులేని పాఠశాలల వివరాలను అన్ని మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచా రు. పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయంలో సంప్రదిస్తే ఇబ్బందులుండవని జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
అడ్మిషన్లకు కొత్త విధానం
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ అడ్మిషన్ల కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒకే వయస్సు (యూనిఫాం) చిన్నారులకు మాత్రమే సంబంధిత తరగతిలో అడ్మిషన్లు ఇవ్వడానికి విద్యాశాఖ డెరైక్టరేట్ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోర్డుల్లో ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. విద్యాశాఖ కమిషనర్ చోకలింగం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో పాఠశాలకు ఒక్కో తరహా వయోపరిమితిని విధించడం వల్ల విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం వర్తించే 25 శాతం కోటాను అమలు చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. చోకలింగంతోపాటు మరికొంత మంది ప్రాఠశాలల ప్రతినిధులు సోమవారం ఉదయం ఈ విషయమై చర్చించారు. అయితే ఇప్పటి నుంచి అన్ని పాఠశాలలూ ఏజ్ లిమిట్ (వయోపరిమితి)ని పాటించాలని నిర్ణయించారు. రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో అభ్యర్థి ఎంచుకున్న పాఠశాలలో అతడు/ఆమె తరగతికి వయోపరిమితి సరిపోతేనే దరఖాస్తు ఫారం స్వీకరిస్తామని చోకలింగం అన్నారు. అయితే ఇది ఈ సమస్యను పరిష్కరించేందుకు కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్డుల్లో ఏకీకృత విధానం పాటించడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తాము అన్ని పాఠశాలల ప్రతినిధులను సంప్రదించి ఈ విషయమై చర్చిస్తామని, తదనంతరం అమలును తనిఖీ చేస్తామన్నారు. నర్సరీ, జూనియర్ కిండర్గార్టెన్ (కేజీ), సీనియర్ కేజీ తరగతుల కోసం ఖచ్చితమైన వయోపరిమితిని విధిస్తామని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలలూ ఈ విధానాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని చోకలింగం పేర్కొన్నారు.