breaking news
of dengue
-
డెంగీ జ్వరంతో వృద్ధుడు మృతి
నార్పల: డెంగీ జ్వరంతో మూడురోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నార్పల మండలం బి.పప్పూరుకు చెందిన దండువారిపల్లి బాలన్న (65) బుధవారం మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణంలోని 21వ వార్డు మారెమ్మగుడి సమీపంలో పది నెలల చిన్నారి ఎన్.జస్మిత్ డెంగీ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పేస్వామి, రాధ దంపతులకు మూడేళ్ల కుమారుడు, పది నెలల కుమార్తె జస్మిత్ ఉన్నారు. గత ఆదివారం జస్మిత్‌కు జ్వరం రావడంతో ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ స్థాయికి పడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా ఇదే నెల ఒకటో తేదీ తహసీల్దార్ రోడ్డులో అల్తాఫ్ కుమార్తె ఆయేషా(6) డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలావుండగా పట్టణంలోని అన్ని వార్డుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజూ ఆస్పత్రికి దాదాపు 500 దాకా రోగులు వస్తుండగా ఇందులో 50కిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. వారంరోజుల క్రితం కూడా ముగ్గురికి డెంగీ పాజిటివ్‌గా గుర్తించి అనంతపురంలో చికిత్సలు అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. -
బాలుడిని కాటేసిన డెంగీ
గుంతకల్లు : గుంతకల్లు కథలవీధిలో నివాసముంటున్న మంజుల, రంగన్న దంపతుల కుమారుడు ధీరజ్(7) డెంగీ లక్షణాలతో శనివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. స్థానికంగా గల ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదివే ధీరజ్ మూడ్రోజుల కిందట అనారోగ్యానికి గురి కాగా, గుంతకల్లులోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో చేర్పించారు. రెండ్రోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలుడికి డెంగీ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధరించారన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ తెల్లవారుజామున మరణించినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు.