breaking news
delivery in train
-
రైలుబండిలో ప్రసవం
అనకాపల్లి టౌన్: సికింద్రాబాద్–విశాఖ దురంతో రైల్లో పండంటి ఆడ శిశువుకు ఓ తల్లి జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి.సత్యవతి.. భర్త సత్యనారాయణతో కలిసి బీ–6 ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కారు. మంగళవారం వేకువజామున రైలు రాజమండ్రి స్టేషన్ దాటుతుండగా సత్యవతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సత్యనారాయణ టికెట్ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అనకాపల్లిలో రైలు ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇంతలో నొప్పులు మరింత పెరిగాయి. దీంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న హౌస్‌సర్జన్ స్వాతిరెడ్డి అదే బోగీలో ప్రయాణిస్తున్న మహిళల సాయంతో సుఖప్రసవం చేశారు. ఈలోగా రైలు అనకాపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంది. 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. -
అప్పటికే రక్తస్రావం మొదలైంది.. అందుకే
న్యూఢిల్లీ: ప్రసవ వేదనతో బాధ పడుతున్న హీరోయిన్ అక్కకి డెలివరీ చేస్తాడు హీరో. వీడియో కాల్లో డాక్టర్ సూచనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వస్తువుల సాయంతో బిడ్డను బయటకు తీసి ‘అమ్మ’లా ఆమెకు అండగా నిలుస్తాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఈ దృశ్యం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనే సంపర్క్ క్రాంతి కోవిడ్-19 స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. దివ్యాంగుడైన సునీల్ ప్రజాపతి(30) ఢిల్లీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు శనివారం స్వస్థలం మధ్యప్రదేశ్‌కు బయల్దేరాడు. జబల్పూర్- మధ్యప్రదేశ్ రైలులో ప్రయాణం చేస్తున్న అతడికి రాత్రి ఓ మహిళ బిగ్గరగా ఏడ్వటం వినిపించింది. దీంతో వెంటనే బీ3 కోచ్‌లోకి పరిగెత్తుకువెళ్లి చూశాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఎలాగైలా కాపాడాలనుకున్నాడు. ఆస్పత్రి తీసుకువెళ్లేంత సమయం లేదు.. పైగా ఆమెకు సాయం చేసేందుకు బోగీలో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సుపీరియర్ డాక్టర్ సుపర్ణ సేన్‌కు సునీల్ ఫోన్ చేశాడు. వీడియోకాల్‌లో డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ మహిళకు ప్రసవం చేశాడు. శాల్(శాల్వ)కు ఉన్న దారాలు, ఓ ప్యాసింజర్ షేవింగ్ కిట్‌లో ఉన్న కొత్త బ్లేడ్ తీసుకుని ఆమెకు డెలివరీ చేశాడు. అనంతరం మథుర స్టేషన్లో రైలు ఆగగానే ఆర్పీఎఫ్ సిబ్బంది తల్లీబిడ్డను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించిన సునీల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.(చదవండి: 20 నెలల చిన్నారి.. ఐదుగురికి కొత్త జీవితం) అప్పటికే రక్తస్రావం మొదలైంది.. ఈ విషయం గురించి ‘సూపర్ హీరో’ సునీల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైలు ఫరీదాబాద్ దాటిన తర్వాత భోజనం చేసేందుకు నేను బాక్స్ తెరిచాను. అప్పుడు ఓ మహిళ బాధతో కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లాను. ఆమెకు తోడుగా తన చిన్నారి కూతురు, సోదరుడు మాత్రమే ఉన్నారు. వాళ్లు దోమోకు వెళ్తున్నారట. తను పేరు కిరణ్ అని, జనవరి 20న ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు ఆమెతో ఉన్నవాళ్లు చెప్పారు. అయితే ప్రయాణం కారణంగానే ఆమెకు నొప్పులు వచ్చాయని తొలుత భావించా. అందుకే ఒకవేళ ఏదైనా సాయం కావాలంటే నన్ను పిలవమని చెప్పి వచ్చేశాను. కానీ ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే మళ్లీ అక్కడికి వెళ్లి, మా డాక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించాలనుకున్నాం. కానీ అప్పటికే ఆమెకు రక్తస్రావం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్ సుపర్ణ సేన్‌కు వీడియోకాల్ చేశాను. ఆమె చెప్పినట్లుగానే డెలివరీ చేసేందుకు ప్రయత్నించాను. అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రసవం జరిగింది. కానీ ఆ సమయంలో నా మనసు భయం, ఉత్సుకత వంటి మిశ్రమ భావనలతో నిండిపోయింది. అంతా మంచే జరిగినందుకు ఇప్పుడు సంతోషంగాఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సునీల్ ప్రదర్శించిన ధైర్యం గురించి డాక్టర్ సేన్ చెబుతూ.. ‘‘అతడికి హ్యాట్సాఫ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇలాంటి డెలివరీని నేనెప్పుడూ చూడలేదు. దివ్యాంగుడైన తను పని పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటాడు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటాడు’’ అని ప్రశంసించారు. అదే విధంగా కిరణ్ స్పందిస్తూ.. ‘‘నాకు ఇలా ప్రసవం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే మూడుసార్లు గర్భస్రావం అయ్యింది. అలాంటిది ఇప్పుడు నా బిడ్డను నేను చూసుకోగలిగాను. నాకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. -
రైలులో పుట్టాడు.. బంపర్ ఆఫర్ కొట్టాడు..!
పారిస్ : రైలులో జన్మించిన ఓ శిశువుకు ఫ్రెంచ్ రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకు రైలులో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. అసలేం జరిగిందంటే... సోమవారం రైలులో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసవించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న రైల్వే సిబ్బంది.. సెంట్రల్ ప్యారిస్‌లోని ఔబర్ స్టేషన్లో రైలును ఆపి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో.. బిజీగా ఉండే సెంట్రల్ ప్యారిస్ రైల్వే మార్గంలో 45 నిమిషాల పాటు రైళ్లు నిలిచిపోయాయని రైల్వే అధికారి తెలిపారు. అయితే ప్రసవ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో 15 మంది రైల్వే సిబ్బంది ఆ మహిళకు సాయంగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని... రైలులో జన్మించిన ఈ బుడతడికి తమ వంతు కానుకగా 25 ఏళ్ల పాటు రైలులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్టీఏపీ (ప్యారిస్ ప్రజా రవాణా వ్యవస్థ) ప్రకటించింది. -
మామూలు వాళ్ల కంటే హిజ్రాలే నయం!!
మామూలు వారికంటే తామే నయమని చాటుకున్నారు కొంతమంది హిజ్రాలు. పురిటినొప్పులతో తోటి మహిళ బాధపడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా మిగిలిన మహిళలు వదిలేస్తే.. హిజ్రాలు మాత్రం పెద్దరికం వహించి ఆమెను ఆదుకుని.. పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండో జనరల్ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆమె నరకాన్ని అనుభవించింది. తోటి ప్రయాణికులు గుడ్లప్పగించి చూశారే తప్ప.. ఏ ఒక్కరూ సహాయం అందించడానికి ముందుకు రాలేదు. అదే సమయానికి ఆ రైల్లో కొంతమంది హిజ్రాలు భిక్షాటన చేసుకుంటున్నారు. మహిళ పడుతున్న బాధను చూసి.. వెంటనే భిక్షాటన వదిలిపెట్టి అంతా ఒక్కటయ్యారు. తామే అడ్డుగా నిలబడి, ఆమెకు పురుడు పోశారు. బొడ్డు కోసి బిడ్డకు ప్రాణం పోశారు. అంతటితో ఆగలేదు... అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి పంపించారు. తమలోనూ మానవత్వం ఉందని, అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగలమని చాటుకున్నారు.