breaking news
debut book
-
జీవన సంగీతం
‘కోట్లు సంపాదించిన వారు కాదు విజేత. కోటి సమస్యలు చుట్టుముట్టినా... చిరుదీపం వెలిగించైనా సరే, ధైర్యంగా వెలుగు దారుల్లో నడిచేవారే విజేత’ అంటారు ఒక రచయిత. ఈ మాటలు సంగీత రాజేకు అక్షరాలా సరిపోతాయి. ఆమెకు సంబంధించిన విశిష్ఠత... రచయిత్రి, డిజిటల్ క్రియేటర్, పాడ్‌కాస్టర్ కావడం కాదు. తల్లి చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోక ముందే రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది. ‘నా జీవితానికి ఇక ఏం మిగిలింది!’ అనుకునే క్లిష్ట దశలో కూడా ఆమె పెదవులపై చిరునవ్వు చెరిగిపోలేదు. పూణేకు చెందిన సంగీత రాజే తొలి పుసక్తం ‘లైట్ బియాండ్ ది షాడోస్: ఏ ట్రూ స్టోరీ’ ఎంతోమంది రోగులకు «ధైర్యాన్ని ఇస్తోంది. స్వస్థత శక్తి సానుకూల దృక్పథంలోనే ఉందని గట్టిగా చెబుతోంది....తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం, శస్త్ర చికిత్సలు, సంవత్సరాల తరబడి నొప్పి... మరో వ్యక్తి అయితే... ‘ఈ జీవితం కంటే చావు నయం’ అనుకునేవారేమో. సంగీత రాజే మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు. జీవనకాంక్ష ఆగిపోలేదు. అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ఆశకు ఎప్పుడూ దగ్గరగానే ఉంది.బరువైన బాల్యం‘పదకొండు సంవత్సరాల వయసులో మా నాన్నను కోల్పోయాను. మేము బతకడం కోసం అమ్మ మా ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. చాలా చిన్న వయసులోనే జీవితం ఒక పోరాటంగా మారింది. బాల్యం అకస్మాత్తుగా బరువుగా మారింది. ఆర్థిక ఇబ్బందులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది సంగీత. పదిహేనేళ్ల వయసులోనే సంగీతకు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆమె అక్క చనిపోయింది. అక్క బిడ్డకు అమ్మలేని లోటును తీర్చడానికి సంగీత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆడిపాడే వయసు దుఃఖం, బాధ్యతలతో నిండిపోయింది. అయితే... మాతృత్వం అనేది సంగీత జీవితంలోకి కొంత సంతోషాన్ని తీసుకువచ్చింది. కానీ రెండు సంవత్సరాల తరువాత ఊహించని విషాదం చుట్టు ముట్టింది.అడుగడుగునా అనారోగ్య సమస్యలుఇరవై రెండు ఏళ్ల వయసులో సంగీత రాజేకు లూపస్ అనేప్రాణాంతకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. లూపస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలాలపైనే దాడి చేస్తుంది. ఇది అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది. సంవత్సరాల తరబడి జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, సూర్యరశ్మితో వచ్చే అలర్జీలు, తల తిరగడం...ఇలా ఎన్నో! అడుగడుగునా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కుటుంబ బాధ్యతలు మోస్తూనే రోజువారీ జీవితాన్ని కొనసాగించింది. 2019లో సంగీతకు మరో షాక్! ఆమెకు మెదడు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది.అరుదైన కేసు... అన్నారు!‘నేను జీవించడానికి ఏ ఆశ లేదని చాలామంది భావించారు. కాని నేను ధైర్యంగా నిలబడ్డాను. క్యాన్సర్ గురించి ఆలోచిస్తూ బాధ పడి, భయపడడం కంటే మధుర జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకునేదాన్ని. భయాన్ని కాదు జీవనోత్సాహాన్నే నా ప్రపంచానికి కేంద్రబిందువు చేసుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సంగీత.విధి ఆమెను పరీక్షించడం ఇంకా ఆపలేదు.అమ్మ చనిపోయిన దుఃఖం నుండి తేరుకోక ముందే... ఆరు నెలల తరువాత సంగీతకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘మీది అరుదైన కేసు అని వైద్యులు నాతో చెప్పారు. నా శరీరంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు క్యాన్సర్లు ఉన్నాయి. ఆ సమయంలో కుటుంబ బలమే నాకు అండగా నిలిచింది. ఆపరేషన్, కీమో థెరపీ సెషన్, రేడియేషన్ సైకిల్స్‌లో నా కుటుంబం నాకు ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సంగీత.స్వస్థపరిచే శక్తి మనసులోనే!రచనలు, రీల్స్, పాడ్‌కాస్ట్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమందితో తన జీవిత అనుభవాలను పంచుకుంటూ ధైర్యాన్ని ఇస్తోంది సంగీత. వారికి ఆమె ఇచ్చే సలహా...‘స్వస్థపరిచే శక్తి మన మనస్సులో, అంతర్గత బలంలోనే ఉంది. యస్...నేను తప్పనిసరిగా కోలుకుంటాను అని ఒకటికి రెండుసార్లు బలంగా అనుకోండి. మన ఆలోచనలు శక్తిమంతమైనవి. శరీరం అవి వింటుంది. అదే సమయంలో సానుకూలంగా స్పందిస్తుంది. చీకటి రోజుల్లో...నిజం చెప్పాలంటే అనారోగ్యం అనేది నన్ను పెద్దగా భయపెట్టలేదు. అయితే నన్ను బాగా భయపెట్టిన విషయం మాత్రం ఒకటి ఉంది. నాకు ఆపరేషన్ జరిగితే, కోమాలోకి వెళితే కుటుంబ సభ్యులకు దూరమవుతానేమో, వారికి భారం అవుతానేమో అనేదే ఆ భయం. ఈ ఆలోచన అనారోగ్యం కంటే చాలా భయపెట్టేది. ఏది ఎలా జరిగినా భయంతో జీవించకూడదని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ప్రతి సవాలును చిరునవ్వుతో ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాను. అత్యంత చీకటి రోజుల్లో కూడా నవ్వగలగడం అనేది నా జీవితానికి వెలుగు, బలం అయింది.– సంగీత రాజే -
నాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారు
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల తొలిపుస్తకానికి ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది(2017) నుంచి అన్ని స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మార్పు అనే కాన్సెప్ట్ తో నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ అనే బుక్ ను మూడు స్టోరీ లైన్లను ప్రతిబింబిస్తూ మార్కెట్లోకి రాబోతుంది. ఎలా విజయం సాధించాలి, లేదా నాదెళ్లకు ఓ జ్ఞాపకంలా ఈ బుక్ ను మార్కెట్లోకి రావడం లేదని, పూర్తిగా మార్పుకు సంబంధించే నాదెళ్ల ఈ బుక్ ను రచించినట్టు తెలుస్తోంది. నాదెళ్ల వ్యక్తిగత జీవిత ప్రయాణంలోని పరిణామాలు, సాంకేతిక సంస్థల మధ్య నేడు నెలకొంటున్న మార్పు, మన జీవనంలో ఇంటెలిజెన్స్ మిషన్స్ తీసుకొస్తున్న మార్పు లను నాదెళ్ల ఈ బుక్ వివరించబోతున్నారని పబ్లిషర్ హార్పెర్ బిజినెస్ చెప్పింది. సత్య నాదెళ్ల తొలి పుస్తకానికి హార్పెర్ కొల్లిన్స్ పబ్లిషర్ ప్రపంచ ఇంగ్లిష్ ప్రింటింగ్ హక్కులను దక్కించుకుంది. లెవిన్ గ్రీన్‌బెర్గ్ రోస్టన్ లిటరరీ ఏజెన్సీ జేమ్స్ లెవిన్ తో ఒప్పంద చర్చలు జరిగాయని హార్పెర్ బిజినెస్ ల వైస్ ప్రెసిడెంట్, ప్రచురణ కర్త హోల్లియిస్ హేమ్ బౌచ్ తెలిపారు. 2017లో దీన్ని పబ్లిష్ చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, ఆర్గనైజేషన్స్, సొసైటీల్లో ఎలా మార్పులు సంభవిస్తున్నాయో అన్వేషిస్తూ హిట్ రీఫ్రెష్ ను నాదెళ్ల రచించారు. న్యూ ఎనర్జీ, న్యూ ఐడియాలు, రిలవెన్స్ లను నిరంతర తపనగా హిట్ రీఫ్రెష్ బుక్ ద్వారా నాదెళ్ల మనకు తెలియజేయబోతున్నారు. ఈ బుక్ అంతా మార్పు అనే అంశంపైనే ఉంటుందని నాదెళ్ల పేర్కొన్నారు. ఈ బుక్ ను మైక్రోసాప్ట్ టీమ్ మెంబర్లకు, కస్టమర్లకు, పార్టనర్లను ఉద్దేశించి రచించానని, మార్పుకు సంబంధించిన స్టోరీలు కచ్చితంగా వీరికి ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్టు, వారి సొంత బాటలో నడవడానికి మార్గ నిర్దేశం చేస్తుందని తెలిపారు.


