breaking news
dasaradhi krishnamacharyulu
-
కృష్ణవేణమ్మ ప్రేమ ఒడిలో...
తుంగభద్ర ఒక నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒకటైపోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులనూ, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలూ తలలూపుతూ తన్మయత్వంతో వినేవి. ఈ ప్రాంతాన్ని ఒక కన్నడరాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. భద్ర- తుంగడు మ్రోగించే మురళి విన్నది. గోపాలకృష్ణ వద్దకు రాధ వెళ్లినట్లు, భద్ర... తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడివిలో కదంబవృక్షం క్రింద పట్టుకున్నారు. ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు. భద్ర కరిగినీరై, నదియై ప్రవహించింది. తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు. అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్లిపోయారు. రాజు గుండె పగిలి చచ్చాడు. మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్ళి ఒకచోట తుంగ, భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ ఒడిలో చేరిపోయారు. - డా. దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి... -
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ
* గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నోట దాశరథి కవిత * రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుకుందాం.. సాక్షి, హైదరాబాద్: ‘‘నా తెలంగాణ తల్లి కంజాత వల్లి, నా తెలంగాణ కోటి పుణ్యాల జాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని సగర్వంగా ప్రకటించాడు మహాకవి. ఆ కవీశ్వరుని మాటలను సగర్వంగా స్మరించుకుంటూ.. ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..’’.. 66వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభమిది.. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సైనిక వందనాన్ని స్వీకరించిన అనంతరం దాశరథి కృష్ణమాచార్యుల పలుకులను స్మరిస్తూ గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడం ద్వారా బంగారు తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల పేదరికానికి, వెనుకబాటుతనానికి రాజకీయ అవినీతే ప్రధాన కారణమని... అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు ప్రజల ను చైతన్యం చేయడం ద్వారా అవినీతి నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసింహన్ చెప్పారు. రాష్ట్రంలో గణనీయ అభివృద్ధిదిశగా వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి... తద్వారా ఆహార భద్రత, ఉపాధి అవకాశాల సృష్టి, మెరుగైన ఆదాయ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడ్డ జిల్లాలు బీఆర్జీఎఫ్ కింద గుర్తించబడ్డాయని, ఈ జిల్లాల పురోగతికి కృషి చేసి... అభివృద్ధి ఫలాలను అణగారిన వర్గాలకు సమంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టులను ఈ ఏడాదిలోగా పూర్తిచేసి 2,97,550 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు 70 టీఎంసీల నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో పాములపర్తి, తడకపల్లి రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా గజ్వేల్‌కు తాగునీరు, సాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నాం. * ‘మిషన్ కాకతీయ’ కింద చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నాం. మన ఊరు-మన చెరువు కింద ఐదేళ్లలో రూ. 22,599 కోట్లతో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. * రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దేశంలోనే అత్యున్నతమైన నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ఫార్మా, ఐటీ, మైనింగ్, టెక్స్టైల్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఐకీ, కొకాకోలా, చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, ప్రొక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. * ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వంగా పనిచేస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం. విద్యుత్ ఉద్యోగులకు 27.5 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. పీఆర్సీ అమలుకు కృషి చేస్తున్నాం. * హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే 4జీ, వైఫై, స్కైవేలు, 24 గంటల పాటూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. * రూ. 25 వేల కోట్లతో పది జిల్లాల్లో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేలా 1.26 లక్షల కిలోమీటర్ల పైపులతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. 20 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను వచ్చే మూడేళ్లలో సాధించేం దుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. * తెలంగాణ హరితహారంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఒక్కో నియోజకవర్గం లో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటిస్తాం. * మహిళల భద్రత, బాలికా సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల్లో మూడోవంతు కోటా అమలు చేస్తున్నాం. ప్రతి విభాగంలో మహిళా ఫిర్యాదుల విభాగం, టోల్‌ఫ్రీ నంబర్, ‘షీ’ ఆటోలు, ‘షీ’ పోలీస్ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారాన్ని కొత్త సంవత్సర కానుకగా అందిస్తున్నాం. * గత ఆగస్టు 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను, పెన్షన్లు, రేషన్‌కార్డులను సక్రమంగా అందించే ఏర్పాటు చేసింది. అలరించిన వేడుకలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఏపీలోని విజయవాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, త్రివిధ దళాలకు చెందిన అధికారులను పరిచయం చేశారు. తర్వాత త్రివిధ దళాలతో పాటు కేంద్ర, రాష్ట్ర పోలీస్ దళాలు, ఎన్సీసీ, స్కౌట్స్ నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఆయా దళాలు నిర్వహించిన కవాతు అలరించింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి. లక్ష్మారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టి.పద్మారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.