breaking news
dalip Singh Rana
-
'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా!
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్.. భారత్ రెజ్లర్ గ్రేట్ ఖలీ కన్నీటిపర్యంతం అయ్యాడు. అతను ఎందుకు ఏడ్చాడన్నది అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. విషయంలోకి వెళితే.. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీని.. ఫోటోగ్రాఫర్స్ ఫోటోలివ్వాలని అడిగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్న ఖలీ చిరునవ్వుతో వారి దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజిచ్చాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే అతని మొహంలో మార్పు కనిపించింది. అప్పటిదాకా సంతోషంగా కనిపించిన ఖలీ.. ఒక్కసారిగా దుఃఖంతో కుమిలిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఖలీ ఎందుకు ఎమోషనల్ అయ్యాడన్నది ఎవరికి అర్థం కాలేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా 19 సెకెన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటివరకు 40వేల మంది వీక్షించారు. భారత్ తరపున వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో పాల్గొని 'ది గ్రేట్ ఖలీ'గా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. 'గ్రేట్ ఖలీ' అసలు పేరు దలీప్ సింగ్ రాణా. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని ధీరైనా గ్రామంలో జన్మించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో లెజెండరీ.. హండర్ టేకర్‌ను ఓడించి ఖలీ అప్పట్లో సంచలనం సృష్టించాడు. కాగా ఒకసారి డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఖలీ.. 2021లో ''WWE HALL OF FAME''లో చోటు సంపాదించాడు. ఇక పలు బాలీవుడ్, హాలివుడ్ సినిమాల్లోనూ నటించిన ఖలీ అలియాస్ దలీప్ రాణా.. పంజాబ్ పోలీస్‌లో అసెస్టింట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఇటీవలే రాజకీయ అరంగేట్రం ఇచ్చిన ఖలీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. what made Khali Sir cry? pic.twitter.com/mrFKUTdM5A — Viral Bhayani (@viralbhayani77) August 12, 2022 చదవండి: Cheteshawar Pujara: తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్.. వెంటాడిన దురదృష్టం Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్?.. మూడు ముక్కల్లో సమాధానం -
రాజకీయ తీర్థం పుచ్చుకున్న ది గ్రేట్ ఖలీ
చండీగఢ్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ ఇప్పటినుంచే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ పంజాబ్ టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తోంది. పలువురు ప్రముఖులు, ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఆప్‌లో చేరుతారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ది గ్రేట్ ఖలీగా పేరొందిన దిలీప్‌సింగ్ రాణా ఆదివారం ఆప్ ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ రెజ్లింగ్ ఆటలో ప్రపంచస్థాయి ఆటగాడిగా కీర్తి సాధించారు. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. ఇటీవల ఉత్తరాఖండ్ హల్ద్వానీలో జరిగిన రెజ్లింగ్ షోలో ప్రత్యర్థులను చిత్తుచేసిన ఖలీ.. తన అభిమానులను అలరించాడు. -
ఆగస్టు 27న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న దలీప్ సింగ్ రాణా (ద గ్రేట్ కాళి) (రెజ్లర్), నేహా ధూపియా (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. ఈ సంవత్సరం సృజనాత్మక రంగంలో ఉన్న వారికి, రచనారంగం, టీవీ, మీడియా, సినీరంగంలోని వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ చదువు, విదే శీ ఉద్యోగం కోసం కంటున్న కలలు నెరవేరతాయి. డాక్టర్లు, ఫార్మశీ, దైవసంబంధమైన కార్యాలలో ఉన్న వారి కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది. సన్మానాలు జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిత్రుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించకుండా, తగాదాలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. ఈ రోజు పుట్టిన తేదీ 27 కాబట్టి కుజుని ప్రభావం వల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, సమాజం పట్ల అంకిత భావం వంటి మంచి లక్షణాలుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి. అలాగే అహంభావం, దూకుడు తగ్గించుకోవడం మంచిది. లక్కీనంబర్స్: 1,2,6,7, లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, గ్రే. సూచనలు: కేతుగ్రహజపం, సుబ్రహ్మణ్యాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, వికలాంగులకు సేవ చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
అంతా ఉత్తుత్తిదే!
అవన్నీ నిజం ఫైట్స్ కాదు డబ్ల్యూడబ్ల్యూఈ ఓ టీవీ సీరియల్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో కొత్తగా కేబుల్ ప్రసారాలు ప్రారంభమైన రోజులవి... స్పోర్ట్స్ చానల్లో వచ్చే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పిల్లల్ని కట్టిపడేసింది. బయట ఆటలకు కూడా పోకుండా టీవీలకు అతుక్కునేలా చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకరినొకరు భయంకరంగా రక్తం వచ్చేలా కొట్టుకునేవాళ్లు. దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేరు మార్చుకుని డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది. అప్పట్లో టీవీలకు అతుక్కుని దీనిని చూసిన వాళ్లు... ఇప్పుడు తమ పిల్లలు దీనిని చూస్తుంటే రిమోట్ ఇచ్చేస్తున్నారు. చూసే తరాలు మారినా వినోదం అలాగే ఉంది. అయితే ఇది నిజమైన యుద్ధం కాదని, కేవలం స్క్రిప్ట్ ప్రకారం సాగే ఓ సీరియల్ మాత్రమే అని తెలిసిన వాళ్లు తక్కువే. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ‘కుస్తీ’... భారతీయులకు పెద్దగా పరిచయం అక్కర్లేని క్రీడ. కండలు తిరిగిన వస్తాదులు పోటీపడుతుంటే ఆసక్తిగా చూసే వాళ్లకు కొదువే ఉండదు. అంతర్జాతీయంగా దీన్ని రెజ్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒలింపిక్స్‌లో కూడా క్రీడాంశమే. ఈ రెజ్లింగ్‌కు కాస్త గ్లామర్ జోడిస్తే అదే డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల రెజ్లర్లు డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొంటారు. ఈ రెజ్లింగ్‌ను అభిమానించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ఉన్నారు. అయితే ఇది అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఆ ఆటలోని ప్రత్యేకత. కండలు తిరిగిన రెజ్లర్లు ప్రత్యర్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టడమే ఈ రెజ్లింగ్. రకరకాల ఫీట్లు ఈ రెజ్లింగ్‌కు మరింత వన్నె తెచ్చిపెట్టాయి. రెజ్లింగ్‌ను టీవీల్లో చూసిన వాళ్లకు ఇలా కొట్టుకుంటే ఎవరైనా బతుకుతారా అనే సందేహం రాక మానదు.. అలా ఉంటాయి ఫీట్లు. స్టోరీ-స్క్రీన్‌ప్లే-డెరైక్షన్... ఒళ్లు గగుర్పొడిచే ఈ ఫీట్లు చేస్తే ఎవరైనా కచ్చితంగా ఆస్పత్రి పాలు కావాల్సిందే . కానీ ఈ రెజ్లర్లకు మాత్రం సాధారణంగా ఏమీ కాదు. ఇందుకు కారణం ఇదంతా డ్రామానే. ఒకడు కొడుతుంటాడు.. ఇంకొకడు చేష్టలుడిగిపోయి దెబ్బతింటుంటాడు... మనకు కనిపించేది అంతవరకే. కానీ అదంతా తూచ్. డబ్ల్యూడబ్ల్యూఈ అంతా నటన. రెజ్లింగ్‌ను వినోదాత్మకంగా చూపించడమే దీని పని. స్క్రిప్ట్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలా ఆడాలి.. ఎలా రక్తికట్టించాలి.. అన్నదే ఇందులో ప్రధానం. అయితే ఇదంతా నిజం అని భ్రమ కల్పించేలా ఫీట్లు ఉంటాయి. అవి అంతవరకే నిజం. నిజానికి ఈ రెజ్లింగ్ మ్యాచ్‌లు అచ్చం సినిమాల్లో కథలా, టీవీల్లో సీరియల్లా సాగుతాయి. కథనంతో మ్యాచ్‌లను రక్తికట్టిస్తారు.. ఎప్పుడూ ఒకేలా పోటీలు జరిగితే ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే శృంగార సంబంధాలు, ఒకడి లవర్‌ను మరొకడు ఎత్తుకెళ్లడం, ముక్కోణపు ప్రేమ కథలు, పెళ్లిళ్లు, ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకోవడం, జాతి వివక్ష, కిడ్నాప్‌లు... ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ చూస్తే ఇందులో ఎంత డ్రామా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.‘డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రిపుల్ హెచ్ స్టార్ రెజ్లర్.. అతనికో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. పేరు స్టెపనీ మెక్‌మహోన్. తోటి రెజ్లర్ (డానియల్ బ్రయాన్) ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఈవిషయాన్ని స్టెపనీ, ట్రిపుల్ హెచ్ దగ్గర మొర పెట్టుకుంటుంది. ఎందుకిలా చేశావంటూ అతను బ్రయాన్‌ను నిలదీస్తాడు. అయితే అనుచితంగా ప్రవర్తించిన బ్రయాన్‌ను చితక్కొడతాడని ఆమె అనుకుంటుంది. కానీ ట్రిపుల్ హెచ్ ఏమీ చేయకపోవడంతో స్టెపనీ, సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంది. వాళ్లొచ్చి అతని చేతికి బేడీలు వేస్తారు. నీవేమీ చేయలేకపోయావంటూ ట్రిపుల్హెచ్పై మండిపడుతుంది. దీంతో అతనికి ఎక్కడా లేని కోపం వస్తుంది. బేడీలతో ఉన్న బ్రయాన్‌ను ట్రిపుల్ హెచ్ చితక్కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెతో కూడా కొట్టిస్తాడు. మొత్తానికి తగినశాస్తి జరిగిందంటూ స్టెపనీ తెగ సంబరపడిపోతుంది. చివరికి బ్రయాన్‌ను మ్యాచ్‌లో ఓడించడంతో ఆ ఆనందంలో ట్రిపుల్ హెచ్‌ను ముద్దాడుతుంది. ఇలా ప్రతీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. సాధారణంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్ మ్యాచ్‌లు ఇలా జరగవు. ఉత్తుత్తి మ్యాచ్‌లు కాబట్టే ఇలా సీరియల్లా రక్తికట్టిస్తారు. సూపర్ టెక్నిక్స్... సాధారణంగా రెజ్లింగ్ క్రీడ యుక్తితో కూడుకున్నది. ప్రత్యర్థిని మట్టికరిపించాలంటే బలమొక్కటే సరిపోదు. యుక్తి కూడా ప్రధానం. దీంతో పాటు వేగం, చురుకుదనం రెజ్లింగ్‌లో విజేతను నిర్ణయిస్తాయి. బలంతో కొట్టలేని రెజ్లర్లు ప్రత్యర్థిని టెక్నిక్‌తో చిత్తు చేస్తారు. స్క్రిప్ట్ ప్రకారం పోటీలు జరిగినా...ప్రేక్షకులను ఆకట్టుకునేవి రెజ్లింగ్ టెక్నిక్లే. ఈ రెజ్లింగ్‌లో లెక్కలేనన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. ఇవే అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. డైవింగ్ బుల్డాగ్, డైవింగ్ హెడ్‌బట్, డైవింగ్ షోల్డర్ బ్లాక్, ఫ్లయింగ్ నెక్ బ్రేకర్, ఫ్లయింగ్ స్పైనంగ్ హీల్ కిక్, సూసైడ్ డైవ్, ప్లాంచా, రోప్ వాక్, సోమర్సాల్ట్, సూపర్ ప్లెక్స్, పవర్ బాంబ్స్, ఫ్రాగ్ స్ప్లాష్, సెన్టెన్ బాంబ్, సీటెడ్ సెన్టెన్ బై సైకిల్ కిక్, సూపర్ కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆటలో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు చాలా టెక్నిక్లే ఉన్నాయి. అయితే వీటిలో చాలా టెక్నిక్‌లు ప్రమాదకరమైనవి. అందుకే వీటిని ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోని ప్రమా దాలు జరుగుతాయి. రిస్క్‌తో కూడిన టెక్నిక్లను ప్రదర్శించడం ద్వారా రెజ్లర్లు ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి. మనోడూ ఉన్నాడు రాక్, అండర్టేకర్, ట్రిపుల్ హెచ్, కేన్, రికిషి, క్రిస్ బెనాయిట్, స్టోన్ కోల్డ్, రాండీ ఆర్టన్, జాన్ సెనా, క్రిస్ జెరికో...ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ జాబితాలో భారతదేశానికి చెందిన ఓ రెజ్లర్కూడా ఉన్నాడు. పేరు... దలిప్ సింగ్ రాణా అలియాస్ ది గ్రేట్ ఖలీ. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఖలీ ఎనిమిదేళ్లుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆకట్టుకుంటున్నాడు. ఏడు అడుగుల 1 అంగుళం పొడుగు ఉండే ఈ భారీకాయుడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నట్లు ఖలీ రెజ్లింగ్ పాపులారిటీతో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈలోకి అడుగుపెట్టే కంటే ముందే ద లాంగెస్ట్ యార్డ్ (2005లో)అనే హాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. గెట్ స్మార్ట్ (2008), మెక్ గ్రూబెర్ (2010)తో పాటు 2012లో ఓ ఫ్రెంచ్ సినిమాలో కూడా నటించాడు. 2010లో కుస్తీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది రామా ది సేవిలియర్లో వాలిగా నటించి మెప్పించాడు. ఖలీ బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు.. బుల్లితెరపైనా మెరిశాడు. కలర్స్ చానెల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి రన్నరప్‌గా నిలిచాడు. డబ్బే డబ్బు... ప్రస్తుతం ఇది వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూ ఈ)గా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే గతంలో దీన్ని క్యాపిటల్ రెజ్లింగ్ కార్పొరేషన్, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌గా పిలిచేవారు. అమెరికాలోని స్టాంఫోర్డ్ కేంద్రంగా డబ్ల్యూడబ్ల్యూఈ కార్యకలాపాలు సాగుతున్నాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో డబ్ల్యూడబ్ల్యూఈగా ట్రేడవుతోంది. 1952లో ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రమోషన్‌గా మొదలైన దీనికి జెస్ మెక్‌మహోన్, టూట్స్ మోండ్ సృష్టికర్తలు. అతికొద్ది మందితో మొదలైన ఈ రెజ్లింగ్.. ఇంతింతై అన్నట్లు 62 ఏళ్లుగా అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది. ఏడాదికి 320 హౌస్ షోలతో 150 దేశాల్లో రెజ్లింగ్ పోటీలు ప్రసారమవుతున్నాయి. 2013లో డబ్ల్యూడబ్ల్యూఈ రాబడి : రూ. 3955.98 కోట్లు మొత్తం మిగులు ఆదాయం : రూ. 828 కోట్లు లాభం : రూ. 594 కోట్లు ఆస్తుల విలువ : రూ. 20,232 కోట్లు ఈక్విటీ : రూ. 13,248 కోట్లు