భీమిలి వివాహిత కేసు.. బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రి వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరు బృందాలు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. దాకమర్రి పంచాయతీ శివారు 26వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫార్చ్యూన్ హిల్స్ వుడా లేఅవుట్లో నిన్న(శుక్రవారం) ఉదయం సగం కాలిన మహిళ మృతదేహాన్ని భీమిలి పోలీసులు గుర్తించారు.ఆ మహిళను హంతకులు గొంతు కోసి తరువాత పెట్రోల్‌తో దహనం చేసినట్టు గుర్తించారు. మెడలో కాలిన నల్లపూసల గొలుసు ఉండటంతో మృతురాలు వివాహితగా గుర్తించారు. ఆరు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. మృతురాలు వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్‌తో అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.క్రాంతి కుమార్‌కు ఇద్దరు భార్యలు ఉండగా, అతడు రెండో భార్యతో మృతురాలి ఇంటి పక్కన ఉండేవాడు. క్రాంతికుమార్, మృతురాలికి మధ్య స్నేహం కుదిరింది. అతనికి వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడటంతో రెండో భార్యకు, వెంకటలక్ష్మికి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో రెండో భార్యను వేరే బ్లాక్‌కు మార్చాడు. అయినా వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయంలో మొదటి భార్య, రెండో భార్యతో తరచు గొడవలు జరుగుతున్నాయి. మరో వైపు వెంకటలక్ష్మి.. తనతోనే ఎక్కువసేపు గడపాలని తనతోనే ఉండాలంటూ క్రాంతికుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఎలాగైన వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని.. ప్లాన్ చేశాడు. వెంకటలక్ష్మిని బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఐస్‌క్రీమ్ తిన్నారు. అనంతరం బైక్‌లో పెట్రోల్ కొట్టించి.. బాటిల్లో కూడా కొట్టించాడు. ఇంటి వద్ద పెట్రోల్ దొంగలు ఉన్నారని.. అందుకే బాటిల్లో పెట్రోల్ కొట్టించానంటూ వెంకటలక్ష్మితో చెప్పాడు.శారీరకంగా కలుద్దామని చెప్పి దాకమర్రి లేవట్‌కి తీసుకెళ్లి వెంకటలక్ష్మిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. తరువాత ఆమె ఒంటిపై ఉన్న నగలు తీసుకుని.. తరువాత పెట్రోల్ పోసి తగలుపెట్టాడు. కేసు విచారణలో మొదట వెంకటలక్ష్మిని గుర్తించాము. తర్వాత కాంత్రితో వెళ్తున్నట్లు తన తల్లి చెప్పిందని కొడుకు పోలీసులకు చెప్పారు. ఆ కోణంలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.