breaking news
DACA Scheme Canceled
-
డీఏసీఏ పథకం దాదాపు ముగిసింది: ట్రంప్
వాషింగ్టన్: తల్లిదండ్రులతోపాటు చిన్నతనంలోనే అక్రమంగా అమెరికా వచ్చిన స్వాప్నికులు (డ్రీమర్స్)కు రక్షణ కల్పిస్తున్న డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) పథకం దాదాపు ముగిసిపోయిందనీ, ఇందుకు కారణం డెమొక్రాటిక్ పార్టీ సభ్యులేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిందించారు. ‘డీఏసీఏ పథకం దాదాపు ముగిసింది. ఈ పథకం డెమోక్రాట్లకు ఇష్టం లేదు. వారు కేవలం మాట్లాడతారు. సైన్యానికి అవసరమైన డబ్బును దూరం చేసేందుకే వారున్నారు’ అంటూ ట్రంప్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. డీఏసీఏను రద్దు చేసే నిర్ణయాన్ని అమెరికాలోని ఓ కోర్టు పక్కనబెట్టడంతో ప్రభుత్వం మళ్లీ డీఏసీఏ రెన్యువల్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో స్వాప్నికులు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. -
ట్రంప్ ఉత్తర్వులను కొట్టేయాలి
డీఏసీఏపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన 15 రాష్ట్రాలు వాషింగ్టన్: డీఏసీఏ (బాల్యంలో అక్రమంగా వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడుట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతోపాటు 15 రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి, అనుమతులు లేకుండా అక్కడ నివసిస్తున్న యువతను స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. వీరు అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు అనుమతులిస్తూ ఒబామా హయాంలో డీఏసీఏ కార్యక్రమాన్ని తీసుకురాగా ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదనీ, ఉత్తర్వులను కొట్టేయాలని రాష్ట్రాలు కోర్టును కోరాయి. మెక్సికన్లు, లాటిన్లు తదితరులపై వ్యక్తిగత ద్వేషంతోనే ట్రంప్ డీఏసీఏను రద్దు చేశారన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, మసాచుసెట్స్, కనటికట్, డెలావర్, హవాయ్, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిర్ణయం అమానవీయం.. ట్రంప్ నిర్ణయం అమానవీయమైనదనీ, అధ్యక్షుడికి వ్యతిరేకంగా తాము పోరాడతామని అమెరికా చట్ట సభల్లో సభ్యులైన భారత సంతతి నేతలు చెప్పారు. డీఏసీఏ పథకం రద్దు వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని సెనేటర్ కమాలా హ్యారిస్ అన్నారు. 8 లక్షల మంది స్వాప్నికుల భవిష్యత్తును ట్రంప్ నాశనం చేస్తున్నారని మరో నాయకురాలు ప్రమీలా జయపాల్ విమర్శించారు. స్వాప్నికుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ చర్యలు ప్రారంభించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ సభ్యులు రాజా క్రిష్ణమూర్తి, అమీ బెరా, రోహిత్ ఖన్నా తదితరులు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.