breaking news
D. prabhakar rao
-
ఇక శ్రీశైలం పవర్‘ఫుల్’
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: మూడేళ్ల కింద ఘోర అగ్నిప్రమాదంలో కాలిపోయిన 900 (6*150) మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం.. ఎట్టకేలకు పూర్తి స్థాపిత సామర్థ్యాన్ని మళ్లీ అందిపుచ్చుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో లభ్యతగా ఉన్న జలాలతో శనివారం నాలుగో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించగా.. సాయంత్రం 5.07 గంటలకు 145 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకున్నట్టు తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్ జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో కేంద్రం సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ రవీంద్రకుమార్, సద్గుణ కుమార్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 900 మెగావాట్ల భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన అగ్నిప్రమాదంలో యూనిట్లన్నీ కాలిపోయాయి. నాలుగో యూనిట్ మినహా మిగిలిన యూనిట్లను గతంలోనే పునరుద్ధరించారు. నాలుగో యూనిట్‌కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పునరుద్ధరణలో జాప్యం జరిగింది. కేరళలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కొత్త ట్రాన్స్ఫార్మర్ను తయారు చేయించడానికి రెండేళ్లు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ను బిగించి నాలుగో యూనిట్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. అయితే, ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో ఓ భారీ గేటు విరిగి పడిపోవడంతోపాటు మరికొన్ని గేట్లు వరద ఉధృతికి దెబ్బతినడంతో అప్పట్లో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. సర్జ్‌పూల్ నీళ్లలో 75 మీటర్ల అడుగున ఉన్న గేటును బయటకు తీసే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అప్పట్లో ఉత్పత్తిని వాయిదా వేశారు. గత వేసవిలో జలాశయంలో నిల్వలు అడుగంటిపోయాక గేటును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం జూరాల నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. విచారణ నివేదిక ఏమైంది? 2020 ఆగస్టు 20న శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ఇంజనీర్లతో సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మూడేళ్లు గడిచినా విచారణ నివేదికను సమర్పించలేదు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్‌లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్‌రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ -
సాగర్ విద్యుత్ కేంద్రంలో రెండు టర్బైన్లు మునక
నాగార్జునసాగర్ : సాగర్ ఎడమకాల్వపై ఉన్న 60 మెగావాట్ల విద్యుద్యుత్పాదక కేంద్రంలోకి గురువారం సాయంత్రం ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది. దీంతో రెండు టర్బైన్లు మునిగాయి. ఒక టర్బైన్‌లో మరమ్మతులు జరుపుతున్న క్రమంలో పెన్‌స్టాక్ సీళ్లు లీకయి మరమ్మతులు చేసే టర్బైన్‌లోకి నీళ్లు వచ్చాయి. నీటిని తోడి టర్బైన్లకు సీల్ వేయడానికి గజ ఈతగాళ్లు ప్రయత్నించినా వీలు కాలేదు. రెండు యూనిట్లలోకి నీరు చేరడంతో అవి మునిగిపోయాయని జెన్కో అధికారులు చెప్పారు. కాగా, విద్యుత్ కేంద్రంలోకి చేరిన నీటిని తోడి..రెండు మూడు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు.