breaking news
D 2 H
-
ఎవ్వరిదీ పైసా ఉంచుకోను...క్షమించండి!
ముంబై: ఎస్సెల్ గ్రూప్ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఎట్టకేలకు పెదవి విప్పారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. దీన్నుంచి బైటపడే క్రమంలో కీలకమైన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్)లో వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని శక్తులు పడనివ్వడం లేదని ఆరోపించారు. ఇన్ఫ్రా పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, వీడియోకాన్‌కి చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు కూడా కలిసి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం రుణదాతలకు రాసిన బహిరంగ లేఖలో సుభాష్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు. తొందరపడితే మీకే నష్టం.. రుణదాతలకు క్షమాపణ చెప్పిన సుభాష్ చంద్ర .. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలని కోరారు. అలా కాకుండా తొందరపాటుతనంతో వ్యవహరిస్తే.. రెండు వర్గాలూ నష్టపోక తప్పదని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తం అప్పు ఎంత ఉన్నది, ఎగవేతలేమైనా జరిగాయా లాంటి అంశాలు ఆయన ప్రస్తావించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం అనంతరం రుణాల రోలోవర్ కష్టంగా మారిందని, అయితే డిసెంబర్ దాకా చెల్లింపులన్నీ సక్రమంగానే జరపగలిగామని పేర్కొన్నారు. ‘నా ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ఆశించినట్లుగా పనిచేయలేకపోయాయని నేను భావిస్తున్నాను. ఇందుకుగాను క్షమాపణలు చెబుతున్నాను. ఎవ్వరిదీ ఒక్క పైసా రుణం కూడా ఉంచుకోబోను. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయితే అన్ని రుణాలను తీర్చేయగలుగుతాము. అప్పటిదాకా ఓర్పు వహించండి. కానీ ఆందోళనతో, అరాచకంగా స్పందిస్తే దాని వల్ల మీరూ, మేమూ నష్టపోవాల్సి వస్తుంది‘ అని చంద్ర పేర్కొన్నారు. తప్పులు జరిగాయి.. గతేడాది జూన్ నుంచి సమస్యలు వెన్నాడుతున్నాయని, రుణదాతలు.. షేర్హోల్డర్లకు గుర్తుతెలియని శక్తులు లేఖలు రాస్తూ గందరగోళపరుస్తున్నాయని సుభాష్ చంద్ర చెప్పారు. తన వంతుగా కొన్ని తప్పులు కూడా జరిగాయని ఆయన తెలిపారు. ఎస్సెల్ ఇన్ఫ్రా కారణగా రూ. 4,000–5,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే 2016 నవంబర్‌లో వీడియోకాన్ డీ2హెచ్ వ్యాపారం కొనుగోలుతో బోలెడంత నష్టపోయామని చెప్పారు. ఇక కుటుంబ వ్యాపార విభజన సమయంలో గ్రూప్ కంపెనీల రుణభారమంతా తమపైనే వేసుకోవడం మరో పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. షేర్లు ఢమాల్... డీమోనిటైజేషన్ తర్వాత భారీ డిపాజిట్లు చేయడంపై ఎస్ఎఫ్ఐవో విచారణ ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో ఎస్సెల్ గ్రూప్ సంస్థల పేర్లున్నాయని వార్తలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. డిష్ టీవీ 33%, జీలెర్న్ 19%, ఎస్సెల్ ప్యాక్ 12% క్షీణించాయి. జీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 14,000 కోట్లు పడిపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ 26% క్షీణించి రూ. 319కి పడిపోయింది. -
వీడి యోకాన్ డీ2హెచ్‌తో షెమారూ జట్టు
హైదరాబాద్: షెమారూ ఎంటర్టైన్మెంట్ సంస్థ యాడ్స్‌లేని నిరంతర భక్తి ప్రసారాలను అందించే ‘డీ2హెచ్ దర్శన్’ చానల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం వీడియోకాన్ డీ2హెచ్‌తో జతకట్టింది. డీ2హెచ్ దర్శన్‌లో టెంపుల్ టూరిజం, శ్లోకాలు, వేదాలు, భజనాలు, కథలు, పవిత్ర గ్రంథాలు, పండుగలు తదితర వాటికి సంబంధించిన విషయాలు ప్రసారం అవుతాయని, దీని వల్ల వినియోగదారులు హిందూ ధర్మం గురించి లోతుగా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్కో రోజు ఒక్కో దేవునికి ప్రీతిపాత్రమైందని.. ఆ రోజు ఆ దేవుడికి సంబంధించిన విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని, అలాగే పండుగ రోజుల్లో ఆ పండుగ విశిష్టతలను వివరిస్తామని పేర్కొంది. ఈ చానల్ ను వినియోగదారులు నెలకు రూ.30ల ప్రీమియం చెల్లించి వీడియోకాన్ డీ2హెచ్లో 481 నెంబర్లో చూడొచ్చని తెలిపింది.