breaking news
C.V. Anand
-
ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం: డీజీపీ సి.వి. ఆనంద్
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ, వీఐపీ బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణ స్పెషల్ బెటాలియన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని వివిధ పరిపాలనా, సాంకేతిక, సంక్షేమ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.సమావేశానికి ముందు డీజీపీ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలు, పరిపాలనా సెక్షన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, కార్యాలయ నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన ప్రజెంటేషన్‌ను పరిశీలించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.బెటాలియన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస క్వార్టర్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) బెటాలియన్లు నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సివిల్ పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో కీలక ఆపరేషన్లలో విశేష సేవలు అందించాయని గుర్తు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేక బలగాలను అనుసంధానం చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసిందన్నారు.తాను నిజామాబాద్, వరంగల్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాల ఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రత్యేక బలగాల సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లపై తరచూ నక్సల్స్ దాడులు జరిగేవని, అలాంటి పరిస్థితుల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి నక్సల్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని ప్రశంసించారు.రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఈ బెటాలియన్లు ఎన్నికల సమయంలో భారీ బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన ఉత్సవాలు, మతపరమైన వేడుకలు, ప్రజాసమావేశాలు, వీఐపీ భద్రత, విపత్తు నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు.ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల సమయంలో తెలంగాణ స్పెషల్ బెటాలియన్ సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో అంకితభావంతో పనిచేశారని అభినందించారు.బెటాలియన్ల కమాండెంట్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, పరిపాలనలో క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథం కూడా ఉండాలని సూచించారు. సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, పిల్లల విద్య, వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలని చెప్పారు.దూర ప్రాంతాల్లో నెలల తరబడి విధులు నిర్వహించే సిబ్బందికి కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో అధికారులు వారికి అవసరమైన మానసిక బలం అందించాలని సూచించారు.విధుల్లో పారదర్శకతడ్యూటీల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు, వీఐపీ విధులు, ఇతర ప్రత్యేక డ్యూటీలను కూడా నిష్పాక్షికంగా కేటాయించాలని ఆదేశించారు.గతంలో 18 నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడూ ఆ సమస్య తీరిందన్నారు. ప్రతి బెటాలియన్ పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, సమగ్ర రివ్యూ నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.మిత్ర కౌన్సెలింగ్ కేంద్రాలుపోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ, "మిత్ర" కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించాలని సూచించారు. విధుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులతో బాధపడుతున్న సిబ్బందిని గుర్తించి వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఇతర వ్యసనాల బారిన పోలీసు సిబ్బంది ఎవరూ పడకుండా అధికారులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాంటి అలవాట్లకు గురైన వారిని శిక్షించడం కంటే ముందుగా గుర్తించి, కౌన్సెలింగ్, వైద్య సహాయం ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.పోలీసు సిబ్బందిలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధికారులు, సహచరులు ముందుగానే గుర్తించి తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రతి కమాండెంట్ తన పరిధిలోని సిబ్బందితో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు.శిక్షణకు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆధునిక పోలీసింగ్‌కు అనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ వినియోగం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం, మానసిక దృఢత్వంపై నిరంతర శిక్షణ అందించాలని సూచించారు.తెలంగాణ స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర పోలీసు వ్యవస్థకు వెన్నెముక వంటివని పేర్కొన్న డీజీపీ, భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
అపరిశుభ్రతను చూసి ఆగిన కేసీఆర్ కారు
హైదరాబాద్: నాగోలులో ప్రైవేట్ పార్టీకి వెళ్లి వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రోడ్డు పక్కన ఉన్న అపరిశుభ్రతను చూసి కారు ఆపి కిందికి దిగారు. అనంతరం స్థానిక మహిళతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసక్తికరమైన సంఘటన ఆదివారం ఎల్బీనగర్ సమీపంలోని నాగోల్‌లో జరిగింది. కాగా, సీఎంతో మాట్లాడిన విజయలక్ష్మి అనే మహిళ ఈ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పింది. దీంతో స్పందించిన సీఎం పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్‌ను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో నాగోల్‌లోని మమతానగర్ కాలనీకి చేరుకున్న సీపీ సీవీ. ఆనంద్ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. (నాగోలు) -
కిరాయిదారులపై నిఘా
అద్దెకుండే వారి వివరాలతో డేటాబేస్ ముష్కరుల ఆగడాలకు చెక్ చెప్పేందుకే ఠాణాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం ప్రణాళికలు సిద్ధం చేసిన సైబరాబాద్ సీపీ సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరి... ఉత్తరాది నుంచి వచ్చిన ముగ్గురు ముష్కరులు హబ్సిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌ల్లో మకాం పెట్టారు... లుంబినీపార్క్, గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లో బాంబులు పేల్చి 59 మందిని బలి తీసుకున్నారు... ముంబై మోడల్ని ఈవెంట్ పేరుతో తీసుకువచ్చిన దండుగులు నిజాంపేట్‌లోని ఇంట్లో బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకున్న సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ టెనెంట్స్ వాచ్ (అద్దెకుండే వారిపై నిఘా) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవీ విధి విధానాలు... ‘టెనెంట్స్ వాచ్ ఫామ్’ దరఖాస్తుల్ని ముద్రించి అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇంటి యజమానులంతా వీటిని తీసుకోవాలి. తమ ఇంట్లో అద్దెకుండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి, వారి గుర్తింపు పత్రాలతో పాటు ఫొటోలనూ జత చేసి పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఈ అంశాన్ని మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచారం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క స్థానిక ఇన్స్పెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తన పరిధిలో టెనెంట్స్ వాచ్ అమలును తనిఖీ చేయాలి. కేవలం వివరాలు సేకరించి వదిలిపెట్టకుండా ఫొటోలతో సహా టెనెంట్స్ డేటాబేస్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అద్దెకున్న వారి వివరాలన్నీ సెంట్రల్ సర్వర్‌లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, దీన్ని పోలీసు విభాగం వినియోగించే ఇంట్రానెట్‌కు కనెక్ట్ చేస్తారు. శివార్లలో కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు ఐటీ హబ్‌లోనూ టెనెంట్స్ వాచ్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన ఇంటి యజమానులపై చర్యలకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ టెనెంట్స్‌వాచ్ అమలుతో ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయడంతో పాటు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దర్యాప్తు తేలికవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఠాణాల వారీగా వివరాల సేకరణ... నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ నిఘా వర్గాల నుంచి తరచు హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. మరోపక్క ఇతర ప్రాంతా లు, రాష్ట్రాల నుంచి వస్తున్న దృష్టి మరల్చి చోరీలు చేసే ముఠాలు, దోపిడీ దొంగలకూ అద్దె ఇళ్లే అడ్డాలు గా మారుతున్నాయి. ఇలా వస్తున్న ముష్కరులకు షెల్టర్ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే సైబరాబాద్ పోలీసులు ఈ టెనెంట్స్ వాచ్‌ను అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 41 శాంతి భద్రతల ఠా ణాలకు ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. టెనెం ట్స్ వాచ్‌కు సంబంధించిన విధి విధానాలను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రూపకల్పన చేస్తున్నారు. డిజైన్ సిద్ధం చేశాం.... ముష్కరమూకలతో పాటు అసాంఘికశక్తులకు చెక్ చెప్పే చర్యల్లో భాగంగా టెనెంట్స్ వాచ్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి న విధి విధానాల డిజైన్‌ను పూర్తి చేశాం. ప్రస్తుతం దీనికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. పూర్తిస్థాయి స్వరూపం వచ్చాక ఠాణా ల వారీగా త్వరలోనే అమలు చేస్తాం. అద్దెకుండే వారి వివరాల సేకరణను తప్పనిసరి చేస్తాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
ఆర్టీసీపై విశ్వాసాన్ని కాపాడుకుంటాం: ఖాన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్న ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్(ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్న ప్రాంతం)లో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో కొత్తగా 40 ఆర్టీసీ బస్సులను సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్‌తో కలిసి ఎ.కె.ఖాన్ మంగళవారం ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన బస్సులను సద్వినియోగం చేసుకుంటే మరో 200 నుంచి 300 బస్సులను నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాగా, ఐటీకారిడార్‌లో భద్రతపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశామని సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. ప్రైవేటు వాహనాలకు బార్కోడ్, ప్రత్యేక స్టిక్కర్లు, ఆటోలు, క్యాబ్‌లలో లోపల డ్రైవర్, యజమాని వివరాలు ఉంచేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ చౌహన్, ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్ జి.వి.రమణారావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర, ప్రమాదకర సమయాల్లో ఎలా తప్పించుకోవాలో తెలియజేసే విధానాన్ని ఏసీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఖాన్ తెలిపారు. ఆర్టీసీ ఏసీ, వోల్వో తదితర బస్సుల్లో భద్రతను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఇక్కడ వర్క్‌షాపును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ.. ఏసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా కమిషనర్ అనంతరాము పేర్కొన్నారు.


