breaking news
custamarcare centre
-
యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?!
పూర్ణ (పేరుమార్చడమైనది) తన స్నేహితురాలికి మొబైల్ వాలెట్ యాప్ (ఫోన్ పే) ద్వారా రూ.2,800 చెల్లించింది. కానీ, అవి ఆ స్నేహితురాలి ఖాతాలో జమకాలేదు. దీంతో ఆ యాప్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ గూగుల్‌లో వెతికి, ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. వివరాలు అడిగాడు. ‘మీ మొబైల్లో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల’ని సూచించాడు. పూర్ణ అలాగే డౌన్లోడ్ చేసుకుంది. అతను చెప్పిన విధంగా తన బ్యాంక్ ఖాతా వివరాలను అందులో నమోదు చేసింది. ఆ వివరాలను నమోదయిన వెంటనే, కస్టమర్ కేర్ అతను ఐదు సార్లు పూర్ణ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ ఖాతాకు రూ.4,72,000ను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ వెంటనే ఫోన్ కట్ అయ్యింది. అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా బ్యాంక్ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అవి చూశాక కానీ, తను మోసపోయానని పూర్ణకు తెలియలేదు. వెంటనే పూర్ణ పోలీసులను ఆశ్రయించింది. మరో మోసం.. వింధ్యకి ఎల్ఐసీ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ పాలసీలకు సంబంధించిన క్లెయిమ్‌లు కంపెనీల పేరుతో ఉన్నాయి మేడమ్, కొత్త రూల్స్ వచ్చాయి. మీ పేరు మీద త్వరగా మార్చుకోవాలి’ అని చెప్పాడు. పెండింగ్‌లో ఉన్న ఎల్ఐసీలు, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాలసీల గురించి వివరాలు ఇచ్చింది వింధ్య. ‘మేడమ్, అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలంటే అందుకు ఛార్జెస్ పరంగా కొంత మొత్తం చెల్లించాలి’ అన్నాడు. అతను చెప్పిన విధంగా వింధ్య తన బ్యాంకు ఖాతా నుంచి ఐదువేలు ట్రాన్స్ఫర్ చేయగానే ఆమె అకౌంట్ నుంచి దఫదఫాలుగా రూ.5.5 లక్షలు డెబిట్ అయ్యాయి. తను మోసపోయినట్టుగా గుర్తించి, పోలీసులను ఆశ్రయించింది. అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం గూగుల్, యాహూ, బింగ్, డక్ డక్ గో వంటి సెర్చి ఇంజిన్లలో కస్టమర్ కేర్ నెంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్ల కోసం శోధించడం మనందరికీ అలవాటు. ఈ అలవాటుకు మూల్యం చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ మోసగాడో ఉంచిన నకిలీ టోల్‌ఫ్రీ/ కస్టమర్ కేర్ నంబర్ల ఉచ్చులో చిక్కుకోవచ్చు. ఆ సదరు వ్యక్తి బాధితులను ఆకర్షించడానికి, మీ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించడానికి పొంచి ఉంటాడు. బెంగళూరులో ఒక మహిళ తన ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఫుడ్ అగ్రిగేటర్ యాప్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయాలని, గూగుల్ ఇంజిన్‌లో సెర్చ్‌చేసి, ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకుంది. యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?! సాధారణంగా మోసగాళ్లు యూపీఐ ఆధారిత యాప్‌లకు సంబంధించి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను ప్రముఖ వెబ్సైట్లలో ప్రదర్శిస్తారు. మనం సదరు కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ నకిలీ నంబర్ వస్తుంది. మోసగాళ్లు వినియోగదారుల నుండి వారి వ్యక్తిగత ఖాతా వివరాలన్నీ రాబట్టిన తర్వాత ఓటీపీ లేదా పిన్ సమాచారంతో పాటు పూర్తి వివరాలను తెలిపే గూగుల్ ఫామ్‌ను వాడమని చెబుతారు. సంభాషణ మధ్యలోనే ఓటీపీ/పిన్ నెంబర్ల సమాచారం తీసుకుంటారు. అందుకని, గూగుల్, బింగ్ లేదా యాహూ సెర్చ్‌లో వచ్చే నంబర్‌కు ఫోన్ చేయవద్దు. మీ వ్యక్తిగత వివరాలను ఫోన్లో ఎవరికీ షేర్ చేయవద్దు. అధికారిక వెబ్సైట్ల నంబర్లు మాత్రమే! మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల నెంబర్, సివివి, ఓటీపీ లేదా యుపిఐ.. వంటివి ఏ బ్యాంకులు, ప్రముఖ కంపెనీలూ అడగవు. క్రెడిట్ కార్డు, రసీదు, కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఉంచిన కస్టమర్ సర్వీస్ నంబర్‌కు మాత్రమే ఫోన్ చేయాలి. యాప్ లేదా వెబ్సైట్లో ఉంచిన ఇ–మెయిల్ లేదా మెసెంజర్ ద్వారా కూడా మీరు జరిపిన లావాదేవీల గురించి సంప్రదించవచ్చు. ఎందుకంటే, యూపీఐ ఆధారిత యాప్‌లలో కస్టమర్ కేర్ నంబర్ ఉండకపోవచ్చు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీ కస్టమర్ కేర్ నకిలీ నంబర్లతో మోసం చేసేవారు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనం ప్రతీది గూగుల్‌లో శోధించడం, ఆ నకిలీ నెంబర్లకు ఫోన్ చేయడం మానుకోవాలి. అధికారిక వెబ్సైట్లను లాగిన్ అయ్యి అందులో నంబర్లు తీసుకొని, ఫోన్ చేయాలి. మోసం జరిగిందని గ్రహించాక అరగంట, గంట వ్యవధిలో 155260 నెంబర్‌కి లేదా www.cybercrime.gov.in లో లాగిన్ అయి ఫిర్యాదు చేసినా పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంది. -
గూగుల్ పే కస్టమర్ కేర్ పేరిట మోసం
సాక్షి, గుంటూరు : గూగుల్ పే కస్టమర్ కేర్ పేరిట వ్యక్తి నుంచి నగదు కాజేసిన ఘటనపై కేసు నమోదయ్యింది. పట్టణ చెంచుపేటకు చెందిన కె. శ్రీనివాస్ గూగుల్ పే ద్వారా రూ.4,230 బిల్లును మంగళవారం రాత్రి చెల్లించాడు. బ్యాంకు ఖాతాలో నగదు డిడక్ట్ అయినా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని రావడంతో బుధవారం ఉదయం గూగుల్ పే కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఫోన్‌కు సమాధానం రాలేదు. కొద్దిసేపటికే 8144185193 నంబర్ నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. తాను గూగుల్‌పే కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పాడు. తన ఐడీ నంబర్ అంటూ ఒక నంబర్ తెలిపాడు. ఖాతాలో డిడక్ట్ అయిన నిధులను తిరిగి జమ చేసేందుకు, తమ నుంచి వచ్చే ఎస్ఎంఎస్ను మరో నంబరుకు ఫార్వార్డ్ చేయమని చెప్పడంతో శ్రీనివాస్ అలాగే చేశాడు. కొద్ది సేపటికే ఐదు విడతల్లో తన బ్యాంకు ఖాతాలోని రూ.99,995 నగదు మాయమయ్యిందని, బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని అక్కడి అధికారులను సంప్రదించగా తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు శ్రీనివాసు తెలిపాడు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. -
కస్టమర్ కేర్ సెంటర్ సేవలు మరింత విస్తృతం
సీతమ్మధార (విశాఖ) : విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఈపీడీసీఎల్ ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సెంటర్ సేవలను మరింత విస్తృతం చేసినట్లు సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్ తెలిపారు. లో– ఓలే్టజ్, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, కింది స్థాయి కార్యాలయంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కస్టమర్ కేర్ సెంటర్లోని 1912 నెంబర్‌కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చునని పేర్కొన్నారు. కార్పొరేట్ కార్యాలయంలోని ఏటీసీ భవనంలో కస్టమర్ కేర్ సెంటర్లో సోమవారం సంస్థ డైరెక్టర్లతో సీఎండీ సమావేశమయ్యారు. కస్టమర్ కేర్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేసేందుకు వచ్చే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ కేర్ సెంటర్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక ఏడీఈని పూర్తిస్థాయిలో నియమించినట్లు పేర్కొన్నారు. నమోదైన ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టి.వి.ఎస్.చంద్రశేఖర్, ఆపరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.