breaking news
cuddapah city
-
‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి
కడప: కేజ్రీవాల్ స్థాపించిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీతో తాము కలిసి పని చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు తెలిపారు. కడప వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్‌సత్తా పార్టీ బరిలోకి దిగుతోందన్నారు. ఈ నెల 11వ తేదీన వివరాలు వెల్లడవుతాయన్నారు. లోక్‌సత్తా పార్టీ మొద టి నుంచి సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మద్యం, యువతకు విద్య, తాగునీటి సమస్యపై దృష్టి సారించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ నేతలతో కలిసి జనవరి 11 తేదిన సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయేతర ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇరుపార్టీలు కలిసి పనిచేసే అవకాశంపై చర్చించనున్నారు. -
అతడు.. బా(ద్)షా!
కడప: మాసిన దుస్తులు, అరిగిన చెప్పులు.. తలపై టోపీ, వెంటొక స్కూటీ.. చుట్టూ సమోసా బ్యాగులు. అతడు.. సగటు మనిషి, సమోసా వ్యాపారి. వడలిన దేహం, వదలని దరిద్రం.. ఆకలి పేగులు, చాచిన చేతులు.. చుట్టూ జాలి లేని సమాజం. వారు.. అయినవారు లేని అనాథలు, దిక్కులేని పక్షులు. అతడు.. వారి కోసం రోజూ వస్తాడు. సమోసాలతో పాటు వారి ఆశలను మోసుకొస్తాడు. అతడు.. సయ్యద్‌బాషా. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన చిరువ్యాపారి. మూడేళ్లుగా సమోసాలు తయారు చేసి పలు షాపులకు అమ్ముకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలు తిరిగి సరుకు ఇస్తుంటాడు. తద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆనందంగా బతుకుతున్నాడు. రెండేళ్ల క్రితం.. ఓసారి పూర్తిస్థాయిలో సమోసాలు అయిపోలేదు. మరుసటి రోజుకు అవి చెడిపోతాయి. ఆకలి విలువ తెలిసినవాడు కనుక వాటిని వృధా చేయలేదు. అన్నార్తులకు ఇచ్చాడు. ఆబగా అందుకుని తిన్న వారి కళ్లలో కొత్త వెలుగు కన్పించింది. ఆ వెలుగులో బాషా ఆత్మసంతృప్తి వెతుక్కున్నాడు. వ్యాపారంలో వచ్చే లాభం కంటే.. తోటి మనుషులకు చేసే సాయమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కడపలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే వృద్ధులకు ప్రతిరోజు రాత్రి 200 సమోసాలను ఇస్తూ వస్తున్నాడు. పేదవారికి సాయం చేయడానికి పెద్దమనుషులే కానక్కర్లేదని నిరూపిస్తున్నాడు. మానవత్వముంటే చాలునని చాటుతున్నాడు. పిడికెడు మెతుకులకు తపస్సు చేసే వారి కోసం తమస్సులో సైతం తపిస్తున్నాడు. అందుకే అతడు.. మనసున్న బాద్షా!