breaking news
Criminalisation of politics
-
కళంకిత నేతలు పోటీ చేయకుండా అడ్డుకోలేం
-
కళంకిత నేతలు పోటీ చేయకుండా అడ్డుకోలేం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : క్రిమినల్ నేరారోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులను వారిపై అభియోగాల నమోదు దశలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. ప్రస్తుత ప్రజాప్రాతినిథ్యం చట్టం కింద ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో వారు దోషులుగా తేలితేనే పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తున్నారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కళంకిత చట్టసభ సభ్యులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే నిర్ణయాన్ని పార్లమెంట్‌కే వదిలివేస్తున్నట్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన సమయంలోనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలను అనర్హులుగా ప్రకటించే పరిస్థితిలో తాము లేమని తీర్పును చదువుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. క్రిమినల్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జాతి ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ ఓ నిర్ణయం తీసుకోవాలని, దేశం ఈ నిర్ణయం కోసం వేచిచూస్తోందని అన్నారు. నేరచరిత్ర కలిగిన నేతలు ప్రజా జీవితంలోకి ప్రవేశించి, చట్టాల రూపకల్పనలో భాగం కాకుండా పార్లమెంట్ ఓ చట్టాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు. ఇలాంటి చట్టం తీసుకురవావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కళంకిత నేతలు తమ కేసుల వివరాలను ఈసీకి సమర్పించాలని, రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్స్‌లో విస్తృతం ప్రచారం కల్పించాలని అన్నారు. కాగా సుప్రీం బెంచ్‌లో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కార్, డీవై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. శాసనవ్యవస్థ పరిధిలోకి వెళ్లే ఉద్దేశం తమకు లేదని, అభ్యర్థి గుణగణాలు, నేపథ్యాన్ని తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సర్వోన్నత న్యాయస్ధానం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, అయితే వారు పార్టీ గుర్తు, టికెట్‌పై పోటీ చేయరాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కాగా అనర్హథకు సంబంధించి ప్రజాప్రాతినిథ్య చట్టం ఉన్నందున న్యాయవ్యవస్థ శాసన వ్యవస్థ పరిధిలోకి సర్వోన్నత న్యాయస్ధానం ప్రవేశించరాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. -
విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి: థరూర్
డెహ్రడూన్: నేరమయ రాజకీయాలు అంతంకావాలంటే నాగరిక, విద్యాధిక సమాజం చొరవ చూపాలని కేంద్ర మంత్రి శశి థరూర్ పిలుపునిచ్చారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. ఇటువంటి వారు ప్రజలకు ప్రాతినిథ్యం వహించినప్పుడే రాజకీయాలు బాగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక డూన్ పాఠశాల విద్యార్థులతో థరూర్ ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసు ఉందని ఆయన తెలిపారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మంచివారు రాజకీయాల్లోకి రావాలన్నారు.