breaking news
Cricket Association of Telangana
-
టీఎన్‌సీఏ లీగ్‌కు ‘క్యాట్’ ఆటగాళ్లు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సీఏ) నిర్వహించే లీగ్ టోర్నమెంట్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్)కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు శ్రావణ్ కుమార్, రోహన్ కుమార్‌లు ఎంపికయ్యారు. టీఎన్‌సీఏ లీగ్ సభ్యులు బాలాజీ, శివకుమార్, సంతోష్ గోపీలు బుధవారం నగరంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 35 మంది కుర్రాళ్లు పాల్గొనగా రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రావణ్, రోహన్‌లను టీఎన్‌సీఏ వర్గాలు ఎంపిక చేశాయి. దేశంలో ఇతర రాష్ట్రానికి చెందిన అసోసియేషన్ నేరుగా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేయడం ఇదే మొదటిసారని క్యాట్ సెక్రటరీ సునీల్‌బాబు తెలిపారు. తమ ఆటగాళ్లు తమిళనాడు లీగ్‌కు ఎంపికవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బుధవారం క్యాట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డివిజన్–4 లీగ్స్‌కు వీరిద్దరు ఎంపికయ్యారని, ఈ నెల 24 నుంచి చెన్నైలో జరిగే టీఎన్‌సీఏ లీగ్ ఆడతారని చెప్పారు. వీరికి వచ్చే ఏడాది నుంచి రూ. లక్ష పారితోషికం లభించనుందని సునీల్ చెప్పారు. త్వరలో తమిళనాడుకు చెందిన 30 క్లబ్‌లు క్యాట్ ఆటగాళ్లను సెలెక్ట్ చేసేందుకు నగరానికి రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎల్ డైరెక్టర్ పదం పారక్ పాల్గొన్నారు. -
బీసీసీఐ గుర్తింపు సాధిస్తాం
వచ్చే నెలలో భారీ టోర్నీ క్యాట్ కొత్త అధ్యక్షుడు దానం నాగేందర్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామీణ క్రికెటర్లను గుర్తించి, తీర్చి దిద్దేందుకే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు దానం నాగేందర్ తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంనుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. 2012లో ఏర్పాటైన క్యాట్ బుధవారం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. పలువురు రాజకీయ నాయకులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు టి.ప్రకాశ్ మాట్లాడుతూ... హెచ్‌సీఏ గతంలో అజహర్లాంటి ఆటగాడిని కూడా చిన్న చూపు చూసిందని, అయినా అపార ప్రతిభ వల్లే అతను జట్టులో కొనసాగాడని గుర్తు చేశారు. ఎవరికీ పోటీ కాదు: సునీల్‌బాబు క్యాట్ కార్యదర్శి సునీల్ బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకే తాము కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. హెచ్‌సీఏ అవినీతిమయంగా మారిపోయిందని, ప్రతిభ గల వారికి అవకాశం లభించడం లేదని చెప్పారు. బీసీసీఐ గుర్తింపు కోసం తాము ఇచ్చిన దరఖాస్తు వారి పరిశీలనలో ఉందని, త్వరలోనే క్యాట్‌కు గుర్తింపు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఏర్పాటైన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు కూడా తాము పోటీ కాదని, రాష్ట్రంలో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఎన్ని సంఘాలు వచ్చినా వారితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మరో ఉపాధ్యక్షుడు పి. కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి ఆదిత్య రెడ్డి, ఎం. అనిల్‌కుమార్ యాదవ్, తుంగా పవన్ తదితరులు పాల్గొన్నారు. క్యాట్ కొత్త కమిటీ సలహా సంఘం సభ్యులలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్, రామచంద్రమూర్తి కూడా ఉన్నారు.