breaking news
Credit Guarantee Fund
-
లఘు, చిన్న పరిశ్రమలకు కేంద్రం బూస్ట్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) ద్వారా ఇచ్చే క్రెడిట్ గ్యారెంటీలను వచ్చే రెండేళ్లలో మరో రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదనపు కార్యదర్శి, డెవెలప్మెంట్ కమిషనర్ (లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు) రజ్నీష్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, 22 సంవత్సరాల్లో క్రెడిట్ గ్యారెంటీలు రూ.2.6 లక్షల కోట్లు. అయితే గడచిన రెండేళ్లలో ఈ విలువ రూ. 4 లక్షల కోట్లకు పెరిగింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యమని ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. లఘు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంస్థాగత రుణలను భారీగా అందించడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌ను సంబంధిత మంత్రిత్వశాఖ అలాగే సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. -
త్వరలో స్టార్టప్ ఫండ్‌కు గ్రీన్ సిగ్నల్
వచ్చే నెలాఖర్లో క్యాబినెట్ ఆమోదానికి అవకాశం న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన రూ. 2,000 కోట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ వచ్చే నెలాఖర్లోగా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. పూచీకత్తు లేకుండా స్టార్టప్ సంస్థలు రుణాలు పొందేందుకు ఈ ఫండ్ తోడ్పడగలదని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. నిధి ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ గత వారం ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. మూడేళ్ల వ్యవధిలో ఈ ఫండ్ కింద రూ. 2,000 కోట్ల రుణ వితరణ చేయనున్నారు. ఒకో స్టార్టప్‌నకు గరిష్టంగా రూ.5 కోట్లు లభిస్తాయని, సుమారు 7,500 స్టార్టప్ సంస్థలకు ప్రయోజనం చేకూరగలదని అభిషేక్ తెలిపారు. అదనంగా మరో రూ. 15,000 కోట్ల ఫండింగ్‌కు ఇది తోడ్పడగలదని చెప్పారు. 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన తర్వాత నుంచి వివిధ స్టార్టప్‌లకు రూ. 960 కోట్లు వితరణ చేసినట్లు తెలిపారు. సార్క్ స్టార్టప్‌ల సమావేశం... వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ సంస్థలు పరస్పరం సహకరించుకునేందుకు వేదిక కల్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణాసియా ప్రాంత దేశాల కూటమి (సార్క్)లోని స్టార్టప్ సంస్థల సదస్సు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. దీనికి స్టార్టప్స్ నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. వచ్చే కొద్ది నెలల్లో అభిప్రాయాలు అందితే.. డిసెంబర్లోనే స్టార్టప్ సదస్సు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.