breaking news
Credit Cooperative
-
సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) సమాఖ్య ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్‌ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్ ఈక్విటీ ఫండ్ (ఐఎంఈఎఫ్) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. (ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు) తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు. -
‘సొసైటీ’ లాభాల్లో కొనసాగుతుండటం విశేషం
♦ హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ ♦ సొసైటీకి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అభినందన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో బ్యాంకులు చేతులెత్తేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆరు దశాబ్దాలకు పైగా లాభాల బాటలో కొనసాగుతుండటం విశేషమని ఉభయ రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు. సమర్థమైన నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందని, ఇందుకు సొసైటీ కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ 65వ వార్షికోత్సవాలు శనివారం హైకోర్టు ప్రాంగణంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కోర్టుల్లో దాఖలవుతున్న కేసుల్లో ఎక్కువగా సహకార సంఘాలవే ఉంటున్నాయని అన్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అధికంగా సహకార సంఘాల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రస్తుతం సొసైటీ రూ.1.55 కోట్ల మేర లాభాల్లో ఉందని, ఇకపై సంఘం 12 శాతానికి రుణాలు అందజేస్తుందని జస్టిస్ చంద్రయ్య వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, సొసైటీ అధ్యక్షుడు జస్టిస్ జి. చంద్రయ్య, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.రామకృష్ణంరాజు, సొసైటీ ప్రతినిధులు రమేశ్‌కుమార్, భవానీ శంకర్, గోవర్ధన్, డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.