అసౌకర్యాల నడుమ సీఆర్టీల శిక్షణ
శ్రీకాకుళం : జిల్లాలోని ఐదు చోట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సీఆర్టీలకు శనివారం అసౌకర్యాల నడుమ శిక్షణ ప్రారంభమైంది. రోజుకు సుమారు 12 గంటలపాటు ఇస్తున్న శిక్షణలో సీఆర్టీలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. కేజీబీవీల్లోని విద్యార్థులకు ఫర్నిచర్ సౌకర్యం ఉంది. వీటిని సీఆర్టీలకు ఉపయోగించాలని జిల్లా ఆర్వీఎం అధికారులు నిర్ణయించారు. అయితే రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన రిసోర్సుపర్సన్లు ఫర్నిచర్ వినియోగించవద్దని చెప్పడంతో తివాచీలు పరిచి నేలపైనే కూర్చండబెట్టి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల గర్భిణులు, ఇటీవల ప్రసూతి అయిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొందరు కేజీబీవీల ఎస్ఓలు అవగాహన లోపంతో ప్రసూతి సెలవులో ఉన్న సీఆర్టీలను సైతం శిక్షణకు రప్పించడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కేంద్రంలోనూ 100 నుంచి 150 మంది వరకు శిక్షణలో పాల్గొంటున్నారు. వీరిలో 10 మంది వరకు గర్భిణులున్నారు. వీరిలో నెలలు నిండిన గర్భిణీలే ఎక్కువమంది. పొందూరులో జరుగుతున్న శిక్షణకు పది రోజుల క్రితం ప్రసవించిన సీఆర్టీ హాజరయ్యారు. ఈమెకు సిజేరియన్ శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ సీఆర్టీ ప్రసూతి సెలవులో ఉండటం గమనార్హం. ఇటువంటి వారిని సైతం నేలపైనే కూర్చండబెడుతున్నారు.
ఇదిలా ఉంటే శిక్షణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతిలో కూడా సీఆర్టీలకు ఇబ్బందులున్నాయి. ఒక్కో గదిలో 30 నుంచి 40 మందికి పడకకు ఏర్పాటు చేశారు. ఇంతమంది ఒకే గదిలో పడుకోవడం కష్టమే. అలాగే చంటి పిల్లలతో వచ్చినవారు వీరి మధ్యలో పడుకోలేక, బయటకు వెళ్లే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆర్వీఎం పీఓ రామచంద్రారెడ్డి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గర్భిణులను, ప్రసూతి అయిన వారిని సాయంత్రం వేళల్లో ఇళ్లకు వెళ్లిపోయేలా రాష్ట్ర అధికారులు శనివారం సాయంత్రం జారీ చేసిన ఆదేశాల్లో అవకాశం కల్పించారన్నారు.