breaking news
Corporate-level medical services
-
‘టిమ్స్’కు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదలకు చేరువ చేసే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను సాధారణ మల్టీ స్పెషాలిటీ కేంద్రాలుగా కాకుండా, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో టిమ్స్‌కు ఒక ప్రధాన స్పెషాలిటీని కేటాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి అనుబంధంగా మరో కీలక విభాగాన్ని జోడించి మొత్తం ఆరు సూపర్ స్పెషాలిటీ సేవలను ఒక సమగ్ర వైద్య వ్యవస్థగా అందుబాటులోకి తేనుంది.నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి (అటానమస్) కలిగిన సంస్థలుగా ఈ టిమ్స్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతూ, అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.మల్టీ–ఆర్గాన్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిమారుతున్న జీవనశైలి, పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను దృష్టిలో పెట్టుకొని, ఒకే అవయవానికి పరిమితమైన వైద్య సేవల కంటే పరస్పరం సంబంధం ఉన్న అవయవాల చికిత్సలను ఒకేచోట అందించాలనే ఆలోచనతో ఈ ప్రణాళిక రూపొందుతోంది. గుండె, కిడ్నీ, మెదడు, మానసిక ఆరోగ్యం, జీర్ణకోశం, మూత్రపిండాల వ్యాధుల మధ్య ఉన్న అనుసంధానాన్ని పరిగణనలోకి తీసుకొని కొత్త స్పెషాలిటీ కాంబినేషన్లను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది.సనత్‌నగర్ టిమ్స్‌కు కార్డియో–రీనల్ సెంటర్సనత్నగర్ టిమ్స్‌ను కార్డియాలజీతోపాటు నెఫ్రాలజీకి ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. గుండె జబ్బులతో బాధపడే అనేక మందిలో కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో ఈ రెండు విభాగాల సేవలు ఒకేచోట అందితే రోగులు వేర్వేరు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అత్యాధునిక కార్డియాక్, డయాలసిస్ సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. అల్వాల్ టిమ్స్‌లో న్యూరో–మెంటల్ కేర్అల్వాల్ టిమ్స్‌ను న్యూరాలజీతోపాటు సైకియాట్రీ లేదా జెరియాట్రిక్స్ సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడే రోగులకు మానసిక, పునరావాస సేవలు కూడా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సమగ్ర న్యూరో కేర్ అందించేలా ప్రణాళిక రూపొందుతోంది.కొత్తపేట టిమ్స్‌లో గ్యాస్ట్రో–యూరో కాంబినేషన్కొత్తపేట టిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీతోపాటు యూరాలజీ సేవలను అందుబాటులోకి తేనున్నారు. జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్, మూత్రనాళ సమస్యలకు సంబంధించిన అత్యాధునిక చికిత్సలు ఒకే కేంద్రంలో లభించనున్నాయి.గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై తగ్గనున్న ఒత్తిడిఈ మూడు టిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లపై ఉన్న రోగుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాల నుంచి వచ్చే రిఫరల్ కేసులను ఆయా వ్యాధుల స్పెషాలిటీని బట్టి నేరుగా టిమ్స్‌లకు తరలించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రోగులకు వేగంగా చికిత్స అందడంతోపాటు పెద్ద ఆస్పత్రుల్లో రద్దీ కూడా తగ్గనుంది.మెడికల్ టూరిజంపై సర్కారు ఫోకస్హైదరాబాద్ను అంతర్జాతీయ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మెడికల్ టూరిజంపైనా దృష్టి సారించింది. మూడు టిమ్స్‌లలో విదేశీ రోగుల కోసం ఒక్కో ఆస్పత్రిలో 50 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆధునిక మౌలిక వసతులతో విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ హెల్త్ హబ్‌గా నిలబెట్టే వ్యూహానికి ప్రభుత్వం పదును పెడుతోంది. -
దేవా..‘దేశ్‌ముఖ్’ ఇలా..
- ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం మధ్య సమన్వయ లోపం - తగ్గిన రోగుల సంఖ్య - నష్టాల బాటలో దవాఖాన సాక్షి,సిటీబ్యూరో : అది పేదల అపర సంజీవని.. కార్పొరేట్‌కు దీటుగా, సర్కార్ దవాఖానాల్లో లభించని సేవలకు ప్రత్యామ్నాయంగా వైద్య సదుపాయం అందజేసిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఒకప్పటి ప్రాభవాన్ని కోల్పోతుంది. మొట్టమొదటిసారి హార్ట్ సర్జరీ చేసిన ఘనత ఆ ఆసుపత్రి సొంతం. నగరంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సుమారు 50 ఏళ్లుగా అతితక్కువ ఫీజులతో సేవలను అందజేస్తోంది. సామాజిక సేవ, ప్రజ లకు ఆరోగ్య సదుపాయం అందజేసే లక్ష్యంతో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఈ ఆసుపత్రి నగరంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలకు చేరువైంది. అలాంటి గత ఏడాదిన్నర కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఉద్యోగులు, యాజమాన్యానికి మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు ఆసుపత్రి వైభవాన్ని మసకబారుస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. రోజుకు 30,40 మంది ఇన్‌పేషెంట్లు కూడా ఆసుపత్రికి రావడం లేదు. అవుట్పేషెంట్ల సంఖ్య 200 నుంచి 100కు పడిపోయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఆసుపత్రిని నెట్టుకొస్తున్నామని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘర్షణకు ముగింపు లేదా.. ఆసుపత్రిలో శాంతియుత వాతావరణం నెలకొని బాగా అభివృద్ధి చెందితే ఒప్పందం మేరకు ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తామని యాజమాన్యం చె బుతోంది. ‘‘ఒకప్పుడు నెలకు రూ.కోటీ 20 లక్షలకు పైగా ఆదాయం లభించేది. ఇప్పుడు రూ.90 లక్షలు మాత్రమే వస్తోంది. ఆసుపత్రి నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలకు ఇది చాలడం లేదు.’’ అని ఆసుపత్రి నిర్వహణా అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహకరిస్తే నష్టాల నుంచి గట్టెక్కగలమని పేర్కొన్నారు. మరోవైపు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తే ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా యాజమాన్యానికి, ఉద్యోగులకు నడుమ నెలకొన్న ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆసుపత్రి కార్యదర్శి పై కొందరు ఉద్యోగులు దాడికి యత్నించారంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ సమస్యలపైనే ఆయనను నిలదీసినట్లు ఉద్యోగుల వాదన. ఈ ఉదంతం ఇరువురి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాలు ఆసుపత్రికి వచ్చే రోగులపై ప్రభావం చూపుతున్నాయి.


