breaking news
computer bills
-
దోచేద్దాం!
కంప్యూటర్ బిల్లులకు మంగళం పెలైట్ ప్రాజెక్టు పేరిట కాలక్షేపం మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వత్తాసు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. అమలు చేస్తున్న విధానాలకు పొంతనలేకుండా పోతోంది. ‘పచ్చ’బాబులకు ఇబ్బంది కలిగితే చాలు చట్టాలనే మార్చేయడం అలవాటైపోయింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మద్యం వ్యాపారమే. మొదట్లో మద్యం విక్రయాలకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ విధానానికి మంగళంపాడేందుకు సిద్ధమైంది. పెలైట్ ప్రాజెక్టుపేరుతో కాలయాపన చేస్తూ మందుబాబులను గుల్లచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చిత్తూరు (అర్బన్): జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు మేలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల పాటు పాలసీకి ప్రతీ దుకాణంలో తప్పనిసరిగా మద్యం బాటిళ్లు విక్రయించేప్పుడు కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని గెజిట్‌లో పేర్కొంది. షరతులకు అంగీకరించే జిల్లాలో 341 మద్యం దుకాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు. కల్తీని నివారించాలని.. కర్ణాటక నుంచి అక్రమ మద్యం నివారించడం, కల్తీ మద్యాన్ని పసిగట్టడం సులభతరమవుతుంది. ప్రతి మద్యం బాటిల్‌పై కంప్యూటరైజ్డ్ హోలోగ్రామ్ స్టిక్కర్లు వేసి, దానికి బార్ కోడింగ్ నెంబరు సైతం కేటాయిస్తారు. వీటిని దుకాణాల్లో డీకోడింగ్ చేసి ఆ మద్యం ఎక్కడ తయారయ్యింది..? ఎప్పుడు దుకాణంలోకి వచ్చింది..? ఎప్పుడు అమ్ముతున్నారు..? ఎంతకు విక్రయిస్తున్నారే వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఆన్లైన్లో లింకుచేస్తారు. అక్కడి సర్వర్ ఆధారంగా జిల్లాలోని మద్యం బాటిళ్ల పంపిణీ గోడౌన్లకు, దుకాణాలకు, డెప్యూటీ కమిషనర్ కార్యాలయాల కు ఆన్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ప్రతి దుకాణం లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ‘కార్వే’ అనే సం స్థతో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రతి నెలా దుకాణం నుంచి రూ.5 వేల అద్దె తీసుకోవడం.. లేనిపక్షంలో ఒకే సారి రూ.90 వేలు చెల్లించి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించా రు. ఈ విధానం జూలై 15 నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. ఇలా కాలక్షేపం జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో 90 శాతం వ్యాపారులు టీడీపీ నాయకులే. రాష్ట్రంలో సైతం మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న తమ సానుభూతి పరులను కాపాడడానికి ఉత్తర్వులను తీసుకొచ్చారు. జిల్లాలో 341 దుకాణాలకు గానూ పెలైట్ ప్రాజెక్టు కింద కేవలం చిత్తూరులో 2, తిరుపతిలో 1 చోట కంప్యూటర్ బిల్లులను ఏర్పాటు చేయడానికి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో ఈ మూడు చోట్లా కంప్యూటర్ బిల్లులు విజయవంతంగా నడిస్తే జిల్లా మొత్తం అమలు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఆన్లైన్ ఏర్పాటు చేయకపోవడం, జిల్లాలో సైతం మద్యం బాటిళ్ల పంపిణీ గోదాముల్లో ఈ విధానం అమల్లోకి రాలేదు. ఈ మూడు దుకాణాల్లో కూడా వచ్చే ఏడాది నుంచి కంప్యూటరైజ్డ్ విధానం అమలుకానుంది. నకిలీ మద్యం, కర్ణాటక మద్యం దిగుమతి చేసుకుని ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వమే పచ్చజెండా ఊపినట్లయ్యింది. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
‘బెల్టు’ ఊడేదెలా?
మెదక్: కొత్త సీసాలో పాత సారా అన్నట్లుంది నూతన మద్యం విధానం. కొద్ది పాటి మార్పులు తప్పిస్తే మిగతా పాలసీ అంతా పాతదే. బెల్టు షాపులు అరికట్టేందుకు ఎలాంటి విరుగుడు ప్రకటించక పోవడంతో.. ఊరూర ఆరు క్వార్టర్లు.. మూడు బీర్లు అన్న చందంగా మద్యం పొంగి పొర్లే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి బాటిల్‌కు తప్పనిసరి కంప్యూటరు బిల్లు ఇవ్వాలన్న నిబంధన అక్రమ వ్యాపారులకు మింగుడు పడని నిర్ణయం. మద్యం సీసాపై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్ కోడ్ ముద్రణ లిక్కర్ మాఫియా పాలిట పిడుగు పాటులా మారింది. 2014-15 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. వచ్చే నెల నుంచి పాలసీ అమలవుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలోని 175 మద్యం దుకాణాల కోసం సిండికేటు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మెదక్, సంగారెడ్డిలలో రెండు ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం175 మద్యం దుకాణాలు ఉండగా 2012లో 148 షాపులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. దీంతో 27 దుకాణాలు ఖాళీగానే మిగిలి పోయాయి.అప్పట్లో గత ప్రభుత్వం 2012 జూన్‌లో మద్యం దుకాణాలకు టెండ ర్లు ఆహ్వానించింది. 2013 జూన్‌లో తిరిగి పాత దుకాణాల లెసైన్సులను యేడాది కాలం పాటు పొడిగించింది. పిడుగు పాటులా మారిన ప్రివిలేజ్ ట్యాక్స్ 2012లో రూపొందించిన ఎక్సైజ్ విధానంలో ప్రవేశ పెట్టిన ప్రివిలేజ్ ఫీజు విధానం మద్యం వ్యాపారుల పాలిట పిడుగుపాటులా మారింది. దీని ప్రకారం ఒక వైన్‌షాప్ లెసైన్స్ ఫీజుకు 6 రేట్ల కన్నా అధికంగా మద్యం విక్రయాలు జరిపితే, మిగతా మద్యం అమ్మకాలపై 15.01 శాతం మేర ప్రివిలేజ్ ట్యాక్స్‌గా వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ఫలితంగా మద్యం వ్యాపారులకు ఆశించిన లాభాలు రాలేదు. దీంతో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు 2013లో ప్రివిలేజ్ ట్యాక్స్ పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లెసైన్స్ ఫీజుకు 7 రేట్ల కన్నా అధికంగా అమ్మకాలు జరిపితే ప్రివిలేజ్ ట్యాక్స్‌ను 14.01 శాతంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి కొత్త విధానంలో ప్రివిలేజ్ టాక్స్‌ను మరింత తగ్గించి 13.06 శాతంగా నిర్ణయించారు. దీంతో వ్యాపారులు కొంత మేర ముందుకు రావచ్చునని, మిగులు షాపులకు కూడా టెండర్లు పడవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. బెల్టు షాపుల మూసివేత ఒట్టిదేనా? బెల్టుషాపుల మూసివేతకు పకడ్బందీ ప్రణాళిక ప్రకటించకపోవడంతో పల్లెల్లో మద్యం పొంగిపొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బెల్టుషాపులను కానరాకుండా చేయాలంటే మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలనే అవకాశాన్ని పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ అధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిపితే బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం విక్రయించే అవకాశం ఉండదని భావించినట్లు సమాచారం. తద్వారా బెల్టు షాపులను పూర్తిగా మూసివేయ వచ్చని భావించారు. కాని పాత విధానం ప్రకారమే వైన్ షాపులను లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించడంతో మహిళలు, మద్య నిషేధ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులన్నీ మూసివేశామని అధికారులు చెబుతున్నా.. అవి యథావిధిగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు 10 వేలలోపు జనాభా ఉంటే రూ.32.50 లక్షలు, 10వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉంటే రూ.34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల లోపు జనాభా ఉంటే రూ.42 లక్షలు,3 లక్షల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉంటే రూ.68 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.90 లక్షల ఫీజును నిర్ధారించారు. కాకుంటే ప్రతి మద్యం సీసాకు తప్పకుండా కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని, అక్రమ మద్యం విక్రయించకుండా ప్రతి బాటిల్‌పై హోలోగ్రాంతో పాటు 2డీ బార్‌కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యేడు కోటా భర్తీ అయ్యేనా..! ప్రివలేజ్ ట్యాక్స్ ఫలితంగా జిల్లాకు కేటాయించిన వైన్ షాపులు పూర్తి స్థాయిలో టెండర్‌కు నోచుకోలేదు. మెదక్, సంగారెడ్డి రెండు యూనిట్లు ఉండగా 175 వైన్‌షాపులు కేటాయించారు. సంగారెడ్డి పరిధిలో 99 వైన్ షాపులుండగా 81 దుకాణాలు, మెదక్ పరిధిలో 76 షాపులకు 67కు మాత్రమే టెండర్లు దాఖల య్యాయి. మొత్తం 27 దుకాణాలు టెండర్‌కు నోచుకోలేదు. ఈసారి కూడా ప్రివిలేజ్ ట్యాక్స్ మార్పు కేవలం 0.5 శాతం మాత్రమే తగ్గించినందున పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజు పరంగా రూ.79,87లక్షల 20వేల ఆదాయం వచ్చింది.