breaking news
Commissioner Rakesh Maria
-
ప్రేమికులకు శుభవార్త..
ప్రేమికులకు శుభవార్త. నాలుగు మాటలతో మొదలై కప్పు కాఫీ దాకా.. అటుపై పార్కుల్లో చక్కర్ల నుంచి షాపింగ్ మాల్లో చిలిపి సరదాల వరకు.. ఆఖరికి హోటల్ లేదా లాడ్జ్ గదుల్లో తీవ్రమైన ముచ్చట్లదాకా ఎలాంటి బెరుకు లేకుండా పార్ట్నర్తో హాయిగా గడపొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. ఆమాటకొస్తే పోలీసులు కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. నమ్మకం కుదరకుంటే ఓ సారి ముంబై వెళ్లిరండి. వయసుతో నిమిత్తం లేకుండా జంటగా కనపడే ఎవ్వరి జోలికీ వెళ్లకూడదని, వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ ఏమీ అనొద్దని ఇటీవలే ముంబై పోలీసులను కమిషనర్ రాకేశ్ మారియా ఆదేశించారు . మోరల్ పోలీసింగ్ పేరుతో ఇకపై సిబ్బంది ఎవ్వరూ ప్రేమజంటల్ని వేధించొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ఉత్తర్వులు అమలయ్యేలా ఆయా స్టేషన్ల ఇన్చార్జిలకు సూచనలిచ్చారు. ఉన్నట్టుండి పోలీసులకు ప్రేమికులపై ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఏమంటారా.. ఈ నెల మొదటివారంలో ముంబై లంకప్రాంతాలైన అక్సా, మాధ్, దానాపానిల్లోని హోటళ్లు, పార్కులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మొత్తం 64 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో అత్యధికులు ప్రేమపక్షులే కావడం విశేషం. కౌన్సెలింగ్ పేరుతో ఆ ప్రేమ జంటలకు హితబోధ చేసిన పోలీసులు.. చివరికి వారి తల్లిదండ్రులను పిలిపించి తీవ్రస్థాయిలో హెచ్చరించి పంపారు. అలా ఇంటికెళ్లినవారిలో.. ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పరిధిదాటి ప్రవర్తించనప్పటికీ పోలీసుల తీరుతో తల్లిదండ్రుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని, అప్పటి నుంచి పేరెంట్స్ తనతో మాట్లాడటంలేదని, విపరీతమైన మానసిక వ్యధకు గురయ్యానని సూసైడ్ నోట్లో రాసింది. 'మిడ్ డే' పత్రిక ఈ వార్తను వెలుగులోకి తెచ్చింది. అంతే.. నగరం ఒక్కసారిగా భగ్గుమంది. మోరల్ పోలీసింగ్‌ను నిరసిస్తూ యువత ఐక్యమైంది. ఈ నేపథ్యంలోనే పౌరుల స్వేచ్ఛకు భంగం కల్గించేలా వ్యవహరించొద్దంటూ ముంబై కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. -
ఊపిరి పీల్చుకున్న ముంబై
♦ యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ♦ అంతా సవ్యంగా జరగడంతో వీడిన ఉత్కంఠ ♦ ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర పోలీసు శాఖ సాక్షి, ముంబై : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు మొదలుకుని అంత్యక్రియల వరకు అన్నీ ప్రశాంతంగా జరగడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధి నిర్వహించిన వేలాది మంది పోలీసులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రహదారులు, కీలక రైల్వే స్టేషన్ల వద్ద అదనపు పోలీసులను మోహరించారు. వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, పోలీసులకు ఆదేశాలిచ్చేందుకు రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్, నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపారు. వీరికి తోడుగా అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు దేవేన్ భారతి, అతుల్‌చంద్ర కులకర్ణి, ఐదుగురు అప్పర్ పోలీసు కమిషనర్లు, 12 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్లు రాత్రంతా మేలుకుని పరిస్థితులు పర్యవేక్షించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం యాకూబ్ అంత్యక్రియలు ప్రశాంతంగా పూర్తికావడంతో ఇటు పోలీసులు, అటు రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడు ప్రథమ స్థానంలోనే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ప్రథమస్థానంలో ఉంటుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా ముందుగా ముంబైనే అప్రమత్తం చేస్తారు. గతంలో అనేక మత ఘర్షణలు, బాంబు పేలుళ్ల సంఘటనలను 1.50 కోట్ల మంది ముంబైకర్లు కళ్లతో చూశారు. ఇలాంటి వాతావరణంలోనే నాటకీయ పరిణామాల మధ్య జరిగిన యాకూబ్ ఉరి, ఆ తరువాత భారీ జనసందోహం మధ్య జరిగిన అంత్యక్రియలతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఆందోళన చెందారు. రోడ్లపై కాకుండా మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద పోలీసులు డేగ కళ్లతో పహారాకాశారు. శాంతి, భద్రతలకు భంగం వాటిళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా నేరచరిత్ర ఉన్న 750 మందిని అదుపులోకి తీసుకున్నారు. యాకూబ్ నివాసముండే బిస్మిల్లా మంజిల్ భవనం వద్ద ఏకంగా 800 మంది సాయుధ పోలీసులను మోహరించారు. వీరంతా విశ్రాంతి, భోజనం లేకుండానే గురువారం అర్ధరాత్రి వరకు విధుల్లో ఉన్నారు.