breaking news
Closing schools
-
తగ్గిన మూసివేత స్కూళ్ల సంఖ్య !
– 262 నుంచి 185కు కుదింపు – ముగింపు దశకు రేషనలైజేషన్ – కమిటీ ఆమోదం పొందగానే నేడో రేపో అధికారిక ప్రకటన అనంతపురం ఎడ్యుకేషన్ : రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ముగింపు దశకు చేరుకుంది. ఈ ప్రభావంతో జిల్లాలో మూతపడనున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో జారీ చేసిన జీఓ మేరకు జిల్లాలో సుమారు 262 స్కూళ్లు మూతపడే జాబితాలో ఉండేవి. నిబంధనలు సవరిస్తూ ఇటీవల మళ్లీ జీఓ జారీ చేయడంతో మూతపడే స్కూళ్ల సంఖ్య 185కు తగ్గింది. అయితే దీన్ని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా కమిటీ ద్వారా ఆమోదం పొందగానే నేడో, రేపో మూతపడనున్న స్కూళ్ల జాబితాను ప్రకటించనున్నారు. ‘0’ విద్యార్థుల సంఖ్య స్కూళ్లు 108 జిల్లాలో 108 స్కూళ్లు ‘0’ విద్యార్థుల సంఖ్య కారణంగా మూతపడనున్నాయి. ఇందులో సుమారు 40 ప్రాథమిక పాఠశాలలు , 68 ప్రాథమికోన్నత పాఠశాలలు. 20 మందిలోపు విద్యార్థులున్న మరో 25 ప్రాథమిక పాఠశాలలను మూసివేయనున్నారు. అలాగే 20 మందిలోపు విద్యార్థులుండి కిలోమీటరు పరిధిలో పాఠశాల లేకపోతే అలాంటి ప్రాథమిక స్కూళ్లను కొనసాగించనున్నారు. అలాగే 68 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకానున్నాయి. వాస్తవానికి 150 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకావాల్సి ఉంది. గతంలో 6,7 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు, 6,7,8 తరగతుల్లో 40 మంది విద్యార్థులున్న పాఠశాలలకు మంగళం పాడాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూపీ స్కూళ్లు మూతపడుతుండటంతో ఉపాధ్యాయ సంçఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం 6, 7 తరగతుల్లో 20 మందిలోపు విద్యార్థులు, 6, 7, 8 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను ఎత్తివేసేలా జీఓ జారీ చేశారు. దీంతో జిల్లాలో 52 స్కూళ్లు మూతపడే జాబితా నుంచి బయటపడ్డాయి. 3 కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేకపోతే కొనసాగించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలలకు సంబంధించి 50 మందిలోపు విద్యార్థులున్న 4 పాఠశాలలు మూతపడనున్నాయి. 58 సక్సెస్ స్కూళ్లపై హేతుబద్ధీకరణ ప్రభావం పడింది. 50 మందిలోపు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులున్న 58 స్కూళ్లు తెలుగు మీడియం పాఠశాలలకు విలీనం కానున్నాయి. ఆయా స్కూళ్లలో ఎస్ఎంసీ తీర్మానాల ద్వారా మీడియం బదిలీ చేశారు. అయితే వీటిలో నాలుగు స్కూళ్ల నుంచి తీర్మానాలు అందలేదు. ఆ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు కొనసాగించే వీలు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
స్కూళ్ల మూసివేతను అడ్డుకుంటాం
ఉచిత నిర్బంధ విద్య ఏమైందని ప్రశ్న హైదరాబాద్: పేదలకు ఉచితవిద్యను అందకుండా స్కూళ్ల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకుంటామని బీజేపీ శాసనసభ పక్షనాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో 4500 స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల 15వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం ఉంటుందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతీ మండలంలో ఒక రెసిడెన్షియల్ను ఏర్పాటుచేసి కేజీ టు పీజీదాకా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉచిత నిర్బంధ విద్యను అందించకపోగా ఉన్న స్కూళ్లను మూసేయడం దారుణమని లక్ష్మణ్ విమర్శించారు. లంబాడీ తాండాలు, గిరిజన గూడాలు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న పేదలకు విద్యను అందకుండా చేసే కుట్ర దీనిలో దాగి ఉందని విమర్శించారు. ఉచిత నిర్బంధ విద్య, బదిలీలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు రూల్స్ వంటివాటిపై అఖిలపక్ష సమావేశం, శాసనసభాపక్షాలతో సమావేశం నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేవిధంగా రోజుకో కొత్త హామీతో ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని హైదరాబాద్లో పేదలకు గృహ నిరాణం గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే కొందరికే పదవులు, అధికారం కాదన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగక ముందే కళ్లు తెరవాలని లక్ష్మణ్ సూచించారు.