అధ్యక్షుడిపై అసమ్మతి
ట్రంప్‌పై అమెరికా సమాజం ముప్పేట పోరాటం
♦ శరణార్థులు, ఏడు దేశాల పౌరులపై నిషేధం పట్ల ఆగ్రహం
♦ ఆ ఉత్తర్వు రద్దు చేయాలంటూ పలు రాష్ట్రాల కేసులు
♦ నిషేధ ఉత్తర్వుపై స్టే ఇచ్చిన సియాటిల్ కోర్టు
♦ దీంతో తాత్కాలికంగా ఉత్తర్వులను సస్పెండ్ చేసిన అధికారులు
♦ అధ్యక్షుడికి అధికార యంత్రాంగం ‘సహాయ నిరాకరణ’
♦ ట్రంప్ సర్కారు నిర్ణయాలు, విధానాలు మీడియాకు లీక్
♦ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి కార్పొరేట్ దిగ్గజాలు
♦ అధ్యక్షుడికి బహిరంగ లేఖలు.. న్యాయ పోరాటానికి నిధులు
♦ నిరసనలతో సీఈవోలపై ఒత్తిడి పెంచుతున్న ఉద్యోగులు
♦ ట్రంప్ వాణిజ్య సలహా బోర్డుకు ఉబర్ సీఈవో రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనంపై ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శరణార్థులు, ప్రధానంగా ముస్లిం జనాభా గల ఏడు దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం పట్ల సర్వత్రా ఆందోళన వెల్లువెత్తుతోంది. ప్రజలు ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రధాన నగరాల్లో, విమానాశ్రయాల వద్ద నిరసనలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది. అటు కార్పొరేట్ దిగ్గజాలు సైతం ట్రంప్ నిర్ణయాలను ఎదుర్కొనేందుకు ఏకతాటిపైకి వస్తున్నాయి. అధ్యక్షుడికి నిరసన లేఖలు పంపించడంతో పాటు వివాదాస్పద నిర్ణయాలపై న్యాయ పోరాటానికి నిధులు అందిస్తున్నాయి.
మరోవైపు అమెరికాలోని పౌర హక్కుల సంఘాలతో పాటు పలు రాష్ట్రాలు కూడా అధ్యక్షుడి ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. తద్వారా నిషేధ ఉత్తర్వు అమలుపై స్టేలు కూడా వచ్చాయి. దీంతో నిషేధ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఫెడరల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రంప్ విధానాలపై అమెరికా సమాఖ్య ప్రభుత్వ యంత్రాంగంలోనూ అసమ్మతి పెరుగుతోంది. ఉద్యోగులు, అధికారులు సహాయ నిరాకరణ దిశగా సిద్ధమవుతున్నారు. మొత్తమ్మీద అధ్యక్ష పదవి చేపట్టిన రెండు వారాల్లోనే దుందుడుకు నిర్ణయాలతో అలజడి రేపుతున్న ట్రంప్‌పై అమెరికా సమాజం ముప్పేట పోరాటం చేస్తోంది. ఈ అంశంపై ఈ వారం ఫోకస్..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పదవి చేపట్టిన రెండు వారాలు తిరగకముందే ట్రంప్ తీరుపై అమెరికా సమాజంలో అసమ్మతి రేకెత్తింది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, జారీ చేస్తున్న ఉత్తర్వులు.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా శత్రు, మిత్ర దేశాలనే కాదు, అమెరికాలోని సాధారణ ప్రజలను, కార్పొరేట్ దిగ్గజాలనూ కలవరపెడుతున్నాయి. బయటి దేశాలకు మించి అమెరికా సమాజంలోనే అధికంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. ముఖ్యంగా అమెరికాలోకి శరణార్థుల ప్రవేశాన్ని 120 రోజుల పాటు నిషేధిస్తూ.. ఇరాన్, ఇరాక్, లిబియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలోకి ప్రవేశించకుండా జనవరి 27న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు ఆగ్రహం పెల్లుబకటానికి కారణమైంది.
శరణార్థులకు అండగా స్టార్‌బక్స్
అమెరికాలో అతి పెద్ద చైన్ కాఫీ షాపుల సంస్థ అయిన స్టార్‌బక్స్.. వచ్చే ఐదేళ్లలో పది వేల మంది శరణార్థులకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. వలసలపై ట్రంప్ నిషేధ ఉత్తర్వును స్టార్‌బక్స్ సీఈవో హోవార్డ్ ష్కుల్జ్ తప్పుబట్టారు. నిషేధ ఉత్తర్వును సవాల్ చేస్తూ సియాటిల్‌లో దాఖలైన కేసుకు మైక్రోసాఫ్ట్, ఎక్స్పీడియా సంస్థలతో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మద్దతు తెలిపారు.
యాజమాన్యాలపై ఉద్యోగుల ఒత్తిడి
ట్రంప్ తీరుకు నిరసనగా ఉద్యోగుల ప్రదర్శనలు, ఫేస్బుక్ మెసేజీలు, ట్వీట్లు, విధుల బహిష్కరణలతో బడా కంపెనీల యాజమాన్యాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఐబీఎం సీఈవో జిన్నీ రోమెటీ, ఒరాకిల్ సీఈవో సఫ్రా కాట్జ్ తదితరులు ట్రంప్ బృందంలో భాగస్వాములు కావడంతో.. ఆయా సంస్థల ఉద్యోగులు కొందరు వారిని వ్యతిరేకిస్తూ రాజీనామాలు కూడా చేశారు.
మార్చి 14న భారీ ప్రదర్శన
‘టెక్ స్టాండ్స్ అప్ టు ట్రంప్ (ట్రంప్‌కు వ్యతిరేకంగా టెక్ నిలబడుతోంది)’ అనే పేరుతో సిలికాన్ వ్యాలీలో ఉద్యమం మొదలైంది. మార్చి 14వ తేదీన టెక్ సంస్థల ఉద్యోగులు విధులను బహిష్కరించి పాలో ఆల్టో సిటీ హాల్ వద్ద ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. దానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే 1,100 మందికి పైగా నిర్ధారించారు. ఇంకా వేలాది మంది ప్రజలు నిరసనలు తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నారు.
కార్పొరేట్లు గరం.. గరం..
వాణిజ్య రంగంలో పోటాపోటీగా తలపడే సిలికాన్ వ్యాలీ కార్పొరేట్ దిగ్గజాలు ఇప్పుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తున్నాయి. ట్రంప్ ఉత్తర్వులు తమ ప్రాథమిక విలువలకు వ్యతిరేకమని, వాణిజ్యానికి నష్టమంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విటర్, నెట్‌ఫ్లిక్స్, స్టార్‌బక్స్, గోల్డ్‌మన్, మోర్గన్ స్టాన్లీ, ఎయిర్‌బీఎన్‌బీ తదితర బడా కంపెనీలు, వాటి సీఈవోలు ట్రంప్ ఉత్తర్వును తప్పుపడుతున్నారు. సర్కారు చర్యలను వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా లేఖ రాయనున్నారు. సిలికాన్ వ్యాలీలోని బడా సంస్థలతో కూడిన ఇంటర్నెట్ అసోసియేషన్ ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తోంది.
ఉబర్ సీఈవో రాంరాం
ట్రంప్ వాణిజ్య సలహా బోర్డులో సభ్యుడిగా నియమితుడైన ఉబర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కలానిక్.. ఆ సంస్థ ఉద్యోగులు, వినియోగదారుల నిరసనల కారణంగా ఆ బోర్డు నుంచి వైదొలిగారు. ‘దేశాన్ని సురక్షితంగా ఉంచాలి.. అదే సందర్భంలో దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్న అసలైన శక్తులపై దృష్టిపెట్టాలి..’ అంటూ ఫేస్బుక్ సీఈవో జుకర్‌బెర్గ్ వ్యాఖ్యానించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ట్రంప్ ఉత్తర్వులపై మండిపడ్డారు. ట్రంప్ తీరుకు నిరసనగా సుందర్ పిచాయ్ సహా గూగుల్ ఉద్యోగులు 2,000 మంది వరకూ గత సోమవారం విధులను బహిష్కరించారు.
న్యాయ పోరాటానికి ట్విటర్ విరాళం
శరణార్థులు, వలసదారుల నిషేధంపై పోరాటానికి ట్విటర్ సీఈవో జాక్ డోర్సే, ఆ సంస్థ ఉద్యోగులు 15.9 లక్షల డాలర్లు విరాళం ప్రకటించారు. మొదట 925 మంది ట్వీటర్ ఉద్యోగులు 5.30 లక్షల డాలర్లు సేకరించగా.. సీఈవో డోర్సే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమిద్ కొర్దెస్తానీలు ఆ మొత్తాన్ని 15.9 లక్షల డాలర్లకు పెంచారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టులోనూ, వెలుపలా పోరాడుతున్న ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ)’ సంస్థకు ఈ సాయం అందుతుంది. ఇక మైక్రోసాఫ్ట్ సంస్థ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. యాపిల్, నెట్ ఫ్లిక్స్, టెస్లా, ఉబర్ సంస్థలు కూడా ఇదే బాట పట్టాయి.
న్యాయ పోరాటాలు
ఏడు ప్రధాన ముస్లిం దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ విధించిన నిషేధం మీద అమెరికా వ్యాప్తంగా న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. ప్రభావిత వ్యక్తులు, సంస్థలతో పాటు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ) న్యాయ పోరాటం కోసం ఇప్పటికే 2.4 కోట్ల డాల ర్ల (రూ.161 కోట్లు) విరాళాలు సేకరించి కేసులు వేసింది. న్యూ యార్క్, కాలిఫోర్నియా, మసాచుసెట్స్, వర్జీనియాల్లోని సమాఖ్య కోర్టులు ఇప్పటికే.. ట్రంప్ నిషేధ ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చాయి. చెల్లుబాటయ్యే వీసా గలవారు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడం, లేదా విమానాశ్రయాల నుంచే తిప్పి పంపించడాన్ని నిలుపుదల చేశాయి. ఈ ఉత్తర్వులను ట్రంప్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో అధ్యక్షుడికి, న్యాయశాఖకు మధ్య ఘర్షణ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
వాషింగ్టన్ స్టేట్: సియాటిల్‌లో వాషింగ్టన్, మిన్నెసొటా రా>ష్ట్రాలు వేసిన పిటిషన్ స్వీకరించిన సమాఖ్య న్యాయమూర్తి జేమ్స్ రాబర్ట్.. ట్రంప్ విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. సమాఖ్య ప్రభుత్వంలోని మూడు సమాన శాఖల్లో కోర్టు ఒకటని, తమ రాజ్యాంగ పాత్రను నిర్వర్తించడానికి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి ఉత్తర్వు వివక్ష పూరితమైనదంటూ వాషింగ్టన్ అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ తొలుత ఈ కేసు వేయగా.. అందులో మిన్నెసొటా రాష్ట్రం కూడా చేరింది. సియాటిల్ జడ్జి ఆదేశాలు వెలువడిన వెంటనే.. నిషేధ ఉత్తర్వు కారణంగా నిలిపివేసిన వారందరినీ ప్రయాణానికి అనుమతించాల్సిందిగా అమెరికా అధికారులు విమానయాన సంస్థలకు సమాచారమిచ్చారు. ఇదే సమయంలో అధ్యక్ష భవనం ద్వారా న్యాయ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ.. సియాటిల్ న్యాయమూర్తి ఆదేశాలను నిలిపేయాల్సిందిగా కోరుతూ అప్పీలు దాఖలు చేస్తామని పేర్కొంది.
మసాచుసెట్స్: ట్రంప్ నిషేధ ఉత్తర్వును కొద్దిరోజుల పాటు నిలిపివేస్తూ బోస్టన్ (మసాచుసెట్స్ రాష్ట్రం) సమాఖ్య న్యాయమూర్తి నథానియేల్ గోర్టాన్ జనవరి 29న ఆదేశాలు జారీచేశారు. ఆదివారంతో ముగియనున్న ఈ స్టేను పొడిగించేందుకు సదరు న్యాయమూర్తి శుక్రవారం తిరస్కరించారు. కానీ సియాటిల్‌లోని సమాఖ్య న్యాయమూర్తి శుక్రవారం ఇచ్చిన ఆదేశాల ఫలితంగా అమెరికావ్యాప్తంగా నిషేధంపై స్టే కొనసాగుతోంది.
వర్జీనియా: ట్రంప్ ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్లో వర్జీనియా రాష్ట్రం కూడా చేరేందుకు ఆ రాష్ట్రంలోని సమాఖ్య న్యాయమూర్తి లియోనీ బ్రింకేమా అనుమతించారు. ట్రంప్ ఉత్తర్వు అమల్లోకి వచ్చాక లక్షకు పైగా వీసాలను ఉపసంహరించారని వర్జీనియా కేసులో ప్రభుత్వ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. అయితే ఉపసంహరించిన వీసాల సంఖ్య సుమారు 60 వేలు మాత్రమేనని అమెరికా విదేశాంగ శాఖ ఆ తర్వాత వెల్లడించింది
హవాయి: ట్రంప్ ఉత్తర్వు కుటుంబాలను విడదీస్తోందని, పౌరులు ప్రయాణించకుండా చేస్తోందని హవాయి రాష్ట్ర అటార్నీ జనరల్ డగ్ చిన్ కేసు వేశారు. హవాయి ఎంతగానో శ్రమించి పరిరక్షించిన విలువలను అధ్యక్షుడి ఉత్తర్వు నీరుగారుస్తోందని వాదించారు. పర్యాటక రంగం ప్రధానంగా గల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మిచిగన్: అధ్యక్షుడి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనదని మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో.. అరబ్–అమెరికన్ పౌర హక్కుల లీగ్ కేసు వేసింది. దీంతో న్యాయబద్ధమైన శాశ్వత పౌరులకు ఆ ఉత్తర్వు వర్తించకుండా న్యాయమూర్తి విక్టోరియా రాబర్ట్స్ ఆదేశాలు జారీ చేశారు.
కాలిఫోర్నియా: ట్రంప్ ఉత్తర్వును సవాల్ చేస్తూ కాలిఫోర్నియా వర్సిటీ విద్యార్థులు ముగ్గురు గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో కేసు వేశారు. ఆ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థులను ఇక్కట్ల పాలు చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వ యంత్రాంగంలో వ్యతిరేకత
అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై ప్రజాందోళనలు, సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతుండడంతో పాటు... ట్రంప్ సర్కారుకు తలనొప్పులు తెచ్చిపెట్టగల మరో నిరసన బయటకు కనిపించకుండా బలపడుతోంది. అమెరికా సమాఖ్య పాలనా వ్యవస్థలోని అధికారులు, ఉద్యోగుల్లో ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ట్రంప్ సర్కారు ఎజెండాను, నిర్ణయాలను అమలు చేయాల్సిన ఈ యంత్రాంగం.. ‘పరోక్ష సహాయనిరాకరణ’ను ఆయుధంగా ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. పాలనా వ్యవహారాలు స్తంభించిపోతాయేమో, ఉద్యోగులు ‘తమ పని’ చేయడానికి బాహాటంగా తిరస్కరిస్తారేమో అన్న స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
కార్యాచరణ కోసం సదస్సు
ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న సివిల్ సర్వెంట్లు ఉమ్మడిగా ఒక వేదికను ఏర్పాటు చేయడంపై గత వారంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. వచ్చే వారం ఒక సదస్సు నిర్వహించాలని నిర్ణయించగా.. దానికి హాజరవడానికి 180 మంది ఉద్యోగులు సంతకాలు చేశారు. ఆ సదస్సులో సమాఖ్య ఉద్యోగుల హక్కుల గురించి, తమ సహాయనిరాకరణను ఏ విధంగా ప్రకటించవచ్చనే దానిపై నిపుణులు సలహాలు ఇస్తారు.
మీడియాకు లీకులు, అమలులో జాప్యం
న్యాయ శాఖలో కొందరు ఉద్యోగులు తమ పని వేగాన్ని తగ్గించడం ద్వారా ట్రంప్ సర్కారుకు సహాయ నిరాకరణ చేయాలని ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ బృంద సభ్యుడు ఒకరు వెల్లడించారు. ‘ఉద్యోగులు సమయాన్ని ఉపయోగించుకోనున్నారు. వార్తా సంస్థలకు లీకులు ఇవ్వడం, అంతర్గతంగా ఫిర్యాదులు చేయడం వంటి చర్యల ద్వారా.. ఆమోదయోగ్యంగా భావించని ఉత్తర్వులను అడ్డుకునేందుకు, తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తాం’ అని వివరించారు.
లక్ష వీసాలు రద్దు?
కేవలం వారం రోజుల్లో అమెరికా దాదాపు లక్ష వీసాలను రద్దు చేసేసింది. అధ్యక్షుడు ఏడు ముస్లిం దేశాల వలసదారులపై నిషేధాజ్ఞలు విధించిన తరువాత చాలా వేగంగా ఈ పరిణామం జరిగిందని వలసదారుల హక్కుల న్యాయవాదులు ఆరోపిస్తూంటే.. రద్దయిన వీసాలు 60 వేలేనంటూ ప్రభుత్వ వర్గాలు తమ చర్యను సమర్థించుకుంటున్నాయి. అయితే కోర్టుల ఆదేశాల మేరకు ఆ వీసాలను పునరుద్ధరిస్తామని ప్రకటించాయి.
సంఘటితమవుతున్న ఉద్యోగులు
ఒబామా హయాంలో రాజకీయ నియామకాలతో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు కొందరు సంఘటితమై.. ట్రంప్ చర్యలను నిలువరించేందుకు ఏం చేయాలనేదానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. ట్రంప్, ఆయన అనుచరులు చేపట్టదలచుకున్న చర్యలు, ప్రయత్నాలను కొందరు ఉద్యోగులు గుట్టుగా సామాజిక మాధ్యమాల్లో లీక్ చేస్తున్నారు. మరికొందరు బాహాటంగానే ఆ చర్యలకు అడ్డుపడుతున్నారు. ‘‘మీరు విధానం ప్రకారం నడుచుకోవాలి.. లేదంటే బయటకెళ్లవచ్చు.’’ అంటూ అధ్యక్ష భవనం ఇటీవల విదేశాంగ శాఖలోని అసమ్మతిదారులను హెచ్చరించటాన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతోంది.
విదేశాంగ శాఖలో అధికం
శరణార్థులపై ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించడంలో విదేశాంగ శాఖ కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ శాఖలో అధికారికంగానే అసమ్మతి తెలిపే వెసులుబాటుంది. ఉద్యోగులు నిర్భయంగా తమ అసమ్మతి తెలియజేయవచ్చు. గతంలో విదేశాంగ మంత్రులు ఈ అసమ్మతిని పరిగణనలోకి తీసుకుని విధానాలను మార్చిన ఉదంతాలూ ఉన్నాయి. తాజాగా శరణార్థులపై ట్రంప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ఉద్యోగులు లేఖలు పంపారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ గురువారం ఉద్యోగులతో సమావేశమయ్యా రు. సొంత రాజకీయ విశ్వాసాలతో సంబంధం లే కుండా ఒక బృందంలా పనిచేయాలని సూచించారు.
కొన్నింటిపై వెనక్కి తగ్గిన సర్కారు..
అమెరికా యువత ఆరోగ్య ప్రణాళికలు స్వీకరించాల్సిందిగా ప్రో త్సహిస్తూ ఇచ్చే వాణిజ్య ప్రకటనలు, ఇతర ప్రచార కార్యక్రమాలను నిలిపే యాలంటూ అధ్యక్ష భవనం గత వారంలో ఉత్తర్వు జారీ చేసినపుడు.. ఆరో గ్య, మానవ సేవల శాఖ ఉద్యోగులు వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ సర్కారు ఆ ఉత్తర్వును 24 గంటల్లోనే సవరించింది. భూతాపం బూటకమంటూ సంబంధిత సంస్థల మూసివేతకు ఆదేశాలిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ సంస్థ వంటి ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు.
ఎక్కడివారు అక్కడే..
ఒకరు కాదు.. ఇద్దరుకాదు.. ఏకంగా 109 మంది! చట్టపరంగా అమెరికా పౌరులైనప్పటికీ.. చెల్లుబాటయ్యే వీసాలు ఉన్నప్పటికీ తమ వాళ్లను కలుసుకోలేని దుస్థితి. అంతా ట్రంప్ ఉత్తర్వుల మహిమ. గత వారాంతంలో అమెరికాలోని వేర్వేరు విమానాశ్రయాల్లో భద్రతాధికారులు 109 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు ఇరాక్ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం కోసం పనిచేసిన వారైతే.. ఇంకొకరు ఏళ్లుగా అమెరికాలోనే స్థిర నివాసమేర్పరచుకుని అవసరార్థం మరో దేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు. ఇలా ఎందరెందరి కథలో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
హమీద్ దార్వీష్
ఇరాక్‌లో అమెరికా రక్షణ దళాల తరఫున దుబాసీగా పనిచేసిన దార్వీష్కు 2007–08లో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక వీసా మంజూరు చేసింది. ఇరాక్‌లో ప్రాణాలకు ముప్పున్న నేపథ్యంలో దార్వీష్ కొన్నేళ్లు గా న్యూయార్క్‌లోనే భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. గత శనివారం ఆయన ఇరాక్ నుంచి న్యూయార్క్ వస్తుండగా అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను మాత్రం వదిలేశారు. కొన్ని గంటల నిర్బంధం తరువాత దార్వీష్ను వదిలిపెట్టారు.
మజ్దక్ టూక్టాబోనీ, అర్ఘవాన్ లౌఘలం..
యూనివర్సిటీ ఆప్ మసాచుసెట్స్ అధ్యాపకులీ దంపతులు. ఇద్దరూ ఇరానీయులు. జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అమెరికా గ్రీన్‌కార్డులు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారికి బోస్టన్‌లో ట్రంప్ నిర్ణయం తాలూకు షాక్ తగిలింది. విమానాశ్రయంలో దిగగానే.. భద్రతాధికారులు వారిని అమెరికాలో అడుగుపెట్టే వీల్లేదని చెప్పేశారు. అదుపులోకి తీసుకుని, విచారణ పేరుతో గంటలకొద్దీ వేధించారని న్యాయవాదులు ఆరోపించారు. రెండు రోజుల తరువాతగానీ వారు ఇళ్లకు చేరుకోలేకపోయారు.
తారీఖ్, అమ్మార్ అజీజ్
ట్రంప్ నిర్ణయం వెలువడేందుకు కొన్ని నిమిషాల ముందు తారీఖ్, అమ్మార్ అజీజ్‌లు ఇథియోపియా నుంచి వాషింగ్టన్ బయలుదేరారు. మిషిగన్‌లోని ఫ్లింట్ ప్రాంతంలో ఉన్న తండ్రిని కలుసుకోవాలన్నది వారి ప్రణాళిక. అయితే విమానాశ్రయంలో అడుగుపెట్టడమే తడవు.. ఈ ఇద్దరు యెమనీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల తరువాత విమానం ఎక్కించి ఇథియోపియాకు తిప్పి పంపారు.
భారతీయ అమెరికన్లలో ఆందోళన
ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. విమానాశ్రయాల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుంటుండటం, విచారణలు జరుగుతుం డటం దీనికి కారణం. న్యూయార్క్‌లోని ఓ న్యాయవాద సంస్థ కూడా భారతీయ అమెరికన్లు మరో ఆరు నెలలపాటు ప్రయాణాలు మానుకోవాలన్న సూచనలతో పరిస్థితి దారుణంగా మారింది. వాషింగ్టన్ డాలస్ విమానాశ్రయంలో భారత సంతతికి చెందిన ఓ అమెరికన్ పౌరుడిని డ్రెస్ విప్పించి తనిఖీ చేశారన్న వార్తలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఇరాన్లో జరిగిన మానవ హక్కుల సదస్సుకు హాజరైన కారణంగా.. నార్వే మాజీ ప్రధానిని సైతం ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అథారిటీ అధికారులు గంట సేపు నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి.