breaking news
CIRT
-
దివాలా బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. -
త్వరలో నగరానికి కొత్త బస్సులు
న్యూఢిల్లీ: ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో కొత్త బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) త్వరలో ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ (ఐఏఎంసీ)తో ఓ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘1,380 సెమీ లో-ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలనుంచి టెండర్లను ఆహ్వానించాం. టాటా మోటార్స్ సంస్థ ఇందుకు ఆసక్తి చూపించింది. బిడ్ పత్రాన్ని పుణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టు (సీఐఆర్టీ) సంస్థకు పంపాం. సాంకేతిక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థను కోరాం’ అని అన్నారు. కాగా 1,380 సెమీఫ్లోర్ శీతలేతర బస్సులు, 345 లో-ఫ్లోర్ శీతల బస్సుల కొనుగోలు కోసం డీటీసీ గతంలో టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎల్లో బస్సుల (స్టాండర్డ్) స్థానంలో ఈ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఔటర్ ఢిల్లీతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు వీటిని వినియోగించనుంది. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ఈసారి బస్సులను కొనుగోలు ప్రక్రియ ఆగదని డీటీసీ అధికారులు ధీమాతో ఉన్నారు. ‘సెమీ లోఫ్లోర్ బస్సులు గ్రామీణ ప్రాంతాలతోపాటు ఔటర్ ఢిల్లీవాసులకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల్లో రహదారులు సరిగా ఉండవు. సెమీ లో-ఫ్లోర్ బస్సులు నగర ప్రయాణికులతోపాటు గ్రామీణ, ఔటర్ ఢిల్లీవాసుల అవసరాలను తీర్చగలుగుతాయి’అని మిన్హాస్ పేర్కొన్నారు. డీటీసీ అధికారులు అందించిన వివరాల ప్రకారం మొత్తం 600 లోఫ్లోర్ బస్సులను దశలవారీగా సేవలనుంచి తప్పించనున్నారు. మరో 1,275 లోఫ్లోర్ బస్సుల నిర్వహణ కాలపరిమితి ముగిసింది. వాటి స్థానంలో కొత్త సెమీలోఫ్లోర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి డీటీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరం. డీటీసీ, ఢిల్లీ ఇంటిగ్రే టెడ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టం (డీఐఎంటీఎస్) సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు నగరవ్యాప్తంగా చెరో 5,500 బస్సులను నడపాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దాదాపు 4,937 బస్సులను డీటీసీ నగరవ్యాప్తంగా నడుపుతోంది. ఇక డీఐఎంటీఎస్ వద్ద కేవలం 1,157 బస్సులే ఉన్నాయి.