ప్రచార హోరు
ఊపందుకున్న మున్సి‘పోల్స్’ ప్రచారం
ఇక మిగిలింది రెండు రోజులే
{పచారంలో వైఎస్సార్ సీపీ ముందంజ
మద్యం, డబ్బు పంపిణీలో టీడీపీ
కాంగ్రెస్ శ్రేణుల్లో నిస్తేజం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి మరో రెండు రోజుల్లో తెరపడనుండటంతో, అభ్యర్థులు ఓట్ల వేటలో తలమునకలై ఉన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చీరాల, మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. చీరాలలోని 33 వార్డులకు గాను 161 మంది, మార్కాపురంలో 30 వార్డులకు గాను 92 మంది, అద్దంకిలో 20 వార్డులకు గాను 68 మంది, కనిగిరిలోని 20 వార్డులకు 105 మంది, గిద్దలూరులో 20 వార్డులకు 88 మంది, చీమకుర్తిలోని 20 వార్డులకు 78 మంది మొత్తం 592 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తమ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. పార్టీ తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పర్యటించారు. పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరించారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రచారం చేపడుతున్నారు. ఆయన మంగళవారం మార్కాపురంలో ప్రచారం చేశారు.
టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులెవరూ ప్రచారానికి రాకపోవడంతో జిల్లాలోని నాయకులు మాత్రమే తూతూమంత్రంగా ప్రచారం చేస్తున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన డబ్బును పంచే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు ఓటర్లకు చీరలు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. కనీసం అన్ని వార్డుల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, పనబాక లక్ష్మి, జేడీశీలం తదితరులు బస్సుయాత్ర చేస్తూ సోమవారం ఒంగోలు వచ్చారు. అంతమంది కలిసొచ్చినా.. ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించారు. మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎటూ ప్రచారం చేయకుండా మౌనంగా ఉన్నారు.