breaking news
china minister wang yi
-
‘ఎన్ఎస్జీ’పై చైనాతో చర్చలు
భారత్, చైనా విదేశాంగ మంత్రుల భేటీలో నిర్ణయం * మసూద్ అంశంపై పునరాలోచించాలన్న భారత్ * జీ 20 సదస్సుపై ప్రధాని మోదీకి వివరించిన చైనా మంత్రి వాంగ్ * సానుకూల వాతావరణంలో చర్చలు: ప్రభుత్వ వర్గాలు న్యూఢిల్లీ: ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం, జైషే చీఫ్ మసూద్ అజహర్‌పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడంపై శనివారం చైనాకు భారత్ తన ఆందోళనను తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో భేటీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ అంశాలపై చర్చించారు. ఎన్ఎస్జీ(అణు సరఫరా దేశాల కూటమి) అంశంలో నిరాయుధీకరణ విభాగ అధికారులు త్వరలో భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వివిధ అంశాలపై విదేశాంగ కార్యదర్శల స్థాయిలో చర్చలకు యంత్రాంగం ఏర్పాటుపైనా అంగీకారానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌పై భారత్ తన ఆందోళన తెలిపింది. సరిహద్దు పరిస్థితులపై సమీక్ష.. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన వాంగ్ శనివారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం సుష్మతో 3 గంటల సేపు చర్చలు జరిపారు. భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై భేటీలో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చైనాకు ఎలాంటి సాంకేతిక అభ్యంతరాలున్నా వాటిపై చర్చించేందుకు సిద్ధమని సుష్మ చెప్పారు. ముంబై, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి మసూద్ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధాన్ని సాంకేతిక కారణాలు సాకుగా అడ్డుకోవడంపై పునరాలోచించాలని భారత్ కోరినట్లు సమాచారం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని చైనా ప్రకటించిన నేపథ్యంలో సాంకేతిక కారణాలపై సమీక్షించాలని భారత్ కోరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్షతో పాటు శాంతి, ప్రశాంతతను బలోపేతం దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సుష్మ, వాంగ్ నిర్ణయించారు. అంతకుముందు మోదీతో.. వాంగ్ భేటీ అయ్యారు. సెప్టెంబర్‌లో చైనాలో జరిగే జీ20 సదస్సు గురించి వివరించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అభినందనలు తెలపాలని ప్రధాని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో కొనసాగాయని, ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు, ఇటీవలి కొన్ని అంశాలపై కూడా చర్చించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులు విస్తరించాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో పాటు, మౌలిక సదుపాయల రంగంలో మరింత సహకారం అవసరముందని ఇరు దేశాలు నిర్ణయించాయి. బ్రెగ్జిట్ ప్రభావం, కొరియా ద్వీపకల్పంలో పరిస్థితి, ఐరాస భద్రతా మండలి, జీ20, తూర్పు ఆసియా, బ్రిక్స్ దేశాల సదస్సులపై సుష్మా, వాంగ్ల మధ్య చర్చలు సాగాయి. అయితే ఇరు నేతల మధ్య దక్షిణ చైనా సముద్రం అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లపై వాంగ్ పరిశీలన శుక్రవారమే గోవా చేరుకున్న వాంగ్ యీ బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సద స్సు జరిగే వేదికను పరిశీలించారు. స్థానిక అధికారులతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, గవర్నర్ మృదులా సిన్హాతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకానున్నారు. మోదీతో ప్రీతీ పటేల్ భేటీ బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రీతీ పటేల్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య శిక్షణతో పాటు వివిధ అంశాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రి స్థానం పొందినందుకు ప్రీతీ పటేల్‌కు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గతేడాది నవంబర్‌లో విజయవంతంగా సాగిన బ్రిటన్ పర్యటనను మోదీ గుర్తు చేసుకున్నారు. ‘అంతర్జాతీయ అభివృద్ధి విభాగం భవిష్యత్తు ప్రణాళికలపై ప్రధానికి పటేల్ వివరించారు’ అని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
మనసు గెలుచుకుంటారా?
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. శుక్రవారం రాత్రి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా కీలక అణు సరఫరా బృందం (ఎన్ఎస్ జీ) అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కూడా ఆయన కలిసి భేటీ అయ్యారు. అనంతరం చైనా అధికార బృందం భారత బృందంతో సమావేశమైంది. ఎన్ఎస్ జీలో స్థానం మిస్ కావడంతో.. చైనా సానుకూలతతోనే ఎన్ఎస్ జీలో స్థానం సంపాదిస్తామని పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా ఇంతకుముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాంగ్-సుష్మాల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చైనా, భారత్ లు పరస్పరం విభేదించుకుంటున్న అంశాలతో పాటు ఎన్ఎస్ జీ చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాంగ్ పర్యటన సందర్భంగా ఇండియాకు ఇంకా ఎన్ఎస్ జీ తలుపులు మూసుకుపోలేదని అక్కడి పత్రిక వ్యాఖ్యానించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఇండియా తమ ప్రతినిధిని ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని కూడా పత్రిక ఆక్షేపించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న నిర్మాణాలను విరమించుకోవాలని అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. తీర్పుతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిర్మాణాలను కొనసాగిస్తామని చైనా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.