breaking news
Childrens photos
-
పిల్లల ఫొటోల్ని షేర్ చేయకండి
గువాహటి: సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం చిన్నారుల ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై అస్సాం పోలీసులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన చిన్నారుల చిత్రా లను వాడుకున్నారు. ‘పిల్లలు సోషల్ మీడియా ట్రోఫీలు కాదు, నెటిజన్ల దృష్టిలో పడేందుకు చిన్నారుల గోప్యతతో వ్యాపారం చేయకండి, మీ చిన్నారుల కథ చెప్పే అవకాశం వారికే ఇవ్వండి, లైక్స్ పాతబడిపోతాయి కానీ, డిజిటల్ మరకలు శాశ్వతం’వంటి సందేశాలను జత చేశారు. ఇటీవలి కాలంలో ఫ్యామిలీ వ్లాగర్లు ప్రచారం కోసం చిన్నారులను కూడా వాడుకోవడం ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తామో తెలియని చిన్నారులను ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ఎన్నో విధాలుగా నష్టం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లల చిత్రాలను షేర్ చేయడం హానికరం కాదని తల్లిదండ్రులు మొదట్లో భావించవచ్చు. కానీ, పిల్లలను గురించి అవసరం లేకున్నా ఎక్కువ మందికి తెలియడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్య పిల్లల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతోపాటు, వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అస్సాం పోలీసుల ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది అద్భుతం, నేటి తల్లిదండ్రులకు ఇలాంటి సందేశాలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన సైబర్ నేరగాళ్ల కృత్రిమ మేధ చిత్రాలను ట్వీట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. -
పిల్లల ఫొటోలు పెడితే జైలుకు!
ప్యారిస్: ‘క్యూట్’గా ఉందనో... ‘స్వీటీ’ సూపరనో పిల్లల్ని చూసి మురిసి... ఆ సంబరాన్ని ‘సామాజిక మాధ్యమంలో’ అందరితో పంచుకొందామనుకొంటే ఇక కుదరదు! లెక్కకు మించిన ‘లైక్’లు... ‘లవ్లీ’ కామెంట్ల మాటెలా ఉన్నా... పిల్లల ఫొటోలను పోస్టు చేస్తే వారి తల్లిదండ్రులు ఊచలు లెక్కించక తప్పదు! నమ్మలేకపోతున్నా... ఇది నిజం. మైనర్ల అనుమతి లేకుండా వారి ఫొటోలు, వివరాలు షేర్ చేస్తే తల్లిదండ్రులకు ఏడాది జైలు, రూ.35 లక్షల జరిమానా విధిస్తారు. భయపడకండి. ఇది భారత్‌లో కాదు... ఫ్రాన్స్‌లో! సోషల్ మీడియాలో యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తూ బ్రిటన్ వంటి దేశాలు అడుగులేస్తుంటే... చిన్నారులకు భద్రత కల్పించేలా ఫ్రాన్స్ ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. దీని ప్రకారం తమ అనుమతి లేకుండా తల్లిదండ్రులు ఫొటోలు, వివరాలు పోస్టు చేస్తే... అప్పటికప్పుడే కాకపోయినా జీవితంలో ఎప్పుడైనా వారిపై కేసు వేయవచ్చు. మిచిగాన్ విశ్వవిద్యాలయం సోషల్ మీడియా చైతన్యంపై జరిపిన అధ్యయనం ప్రకారం 51 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల అనుమతి లేకుండా వారి ఫొటోలు పోస్టు చేస్తున్నారు.