breaking news
Children are under stress
-
Parenting Tips: మీ మైండ్‌లో ఆంక్షల బుక్ ఉందా?!
పిల్లలు నేను చెప్పిందే వినాలి. నేను గీచిన గీత ఎట్టిపరిస్థితుల్లో దాటడానికి వీల్లేదు. అప్పుడే పిల్లలు పద్ధతిగా పెరుగుతారు. అదే క్రమశిక్షణ అంటే.. అని మీరు భావిస్తున్నారా?! అయితే, ఈ తరహా పెద్దల ప్రవర్తన పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డంకి అవుతుందని మనస్తత్త్వ నిపుణులూ, పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్ని అతిగా రూల్ చేసే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అంటున్నారు ఎడిన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు. యుకెలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రతి రెండేళ్లకు ఒకసారి పుట్టిననాటి నుండి 17 సంవత్సరాల వయసు పిల్లల డేటాను సేకరిస్తుంది. ఈ సేకరణలో భాగంగా పిల్లల తల్లిదండ్రుల పెంపకంపైన దృష్టి పెడుతుంది. ఈ రెండేళ్లలో పిల్లలపై అరవడం, కొట్టడం, తిట్టడం, అతిగా రూల్స్ పెట్టే తల్లిదండ్రుల మానసిక స్థితిని అధ్యయనం చేశారు. ఇంట్లో అతిగా ఆంక్షల్లో ఉన్న పిల్లలు బయట చాలా విరుద్ధ ప్రవర్తనతో మెలుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు సామాజికపరంగా, భావోద్వేగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ గమనించారు. ఈ పరిశోధన చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్‌లో ప్రచురించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో భావోద్వేగ ప్రవర్తనల్లో చోటు చేసుకున్న విపరీత మార్పులకు వారి తల్లిదండ్రులు పాటించే కఠినమైన పద్ధతులే కారణం అని గమనించారు. కొట్టడం, అరవడం, తాము చెప్పిందే వినాలనే పంతం గల తల్లిదండ్రుల వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపైనా హానికరమైన ప్రభావాలను చూపుతాయని తెలుసుకున్నారు. ప్రసూతి సమయంలో, కుటుంబ సమస్యల్లోని ఒత్తిడి వల్ల కూడా తల్లుల్లో పిల్లలపై ‘విసుగు’కు కారణం అవ్వచ్చని రాశారు. మూడు రకాల పెంపకం ‘పిల్లల విపరీత ప్రవర్తన మనకు హైపర్యాక్టివిటీగా అనిపిస్తుంది. అయితే, కొన్ని లక్షణాలు పుట్టుకతో వచ్చినా కొన్నింటిపై ఇంటి వాతావరణమే ప్రభావం చూపుతుంది’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ గీతా చల్ల. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేసే తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి వారు కొంచెం మొండితనంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు అతిగా ఆంక్షలు పెడతారు. వీరి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నా, బయటకు వచ్చినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కొందరు తల్లిదండ్రులు పెంపకంలో సమతుల్యత పాటిస్తారు. స్వేచ్ఛ ఇస్తారు, కానీ పరిధులు నిర్ణయిస్తారు. రూల్ బుక్ పేరెంటింగ్ ‘నేను చెప్పిందే వినాలి’ అనే నైజం గల తల్లితండ్రులు స్టేట్మెంట్స్ ఎక్కువ వాడతారు. పిల్లలనుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీని వల్ల తాము ఆశించినది పిల్లల నుంచి రాకపోతే అతిగా అరవడం, కొట్టడం, తిట్టడం చేస్తారు. వీళ్లకు మైండ్‌లో ఒక రూల్ బుక్ ఉంటుంది. నా పిల్లలు ఇలాగే ఉండాలి అని తీర్మానిస్తారు. వీరి పిల్లలకు స్వేచ్ఛ అనేది ఉండదు. తల్లిదండ్రులకన్నా పిల్లలు బలహీనంగా ఉంటారు కాబట్టి, తమ కన్నా బలహీనులను ఈ పిల్లలు హింసిస్తారు. ఈ ప్రవర్తన వల్ల భవిష్యత్తు లో సమాజానికీ హాని జరిగే అవకాశాలుంటాయి. జంతువుల పెంపకమూ మనకు పాఠాలే! డేగలా మారాలి.. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో డేగ (గ్రద్ద) ను చూసి నేర్చుకోవాలి అంటారు నిపుణులు. గద్ద ఒక ఎత్తైన ప్రదేశంలో ముళ్లు, గడ్డితో కలిపి ఒక గూడు అల్లుతుంది. గుడ్లు పొదిగి, పిల్లలయ్యాక ఒక దశలో వాటిని కిందకు తోసేస్తుంది. ఎగిరేవి ఎగురుతాయి. ఎగరకుండా పడిపోయే పిల్లని తండ్రి గద్ద పట్టుకొని మళ్లీ గూడు వద్దకు తీసుకువస్తుంది. ఇది గమనించిన తల్లి గద్ద గడ్డిని తీసేస్తుంది. తండ్రి గద్ద బిడ్డను ముళ్ల మీద ఉంచుతుంది. అవి గుచ్చుకోవడంతో త్వరగా ఎగరాలి, లేకపోతే ఇంకా ముళ్లు గుచ్చుకుంటాయనే ఆలోచనతో పిల్ల పక్షి ఎగురుతుంది. అంటే, పిల్లలకు మంచీ చెడూ రెండూ నేర్పించుకుంటూ పోతుంది. ప్రతి తల్లీదండ్రి తమ పిల్లల పెంపకంలో ఇదేవిధంగా శ్రద్ధ తీసుకోవాలి. సైకిల్ నేర్పించేట్టుగా ఉండాలి పేరెంటింగ్ అంటే. పడిపోతున్నప్పుడు పట్టుకొని, మిగతా సమయంలో వదలాలి. అప్పుడే స్వతంత్రంగా ఎదుగుతారు. పులిలా..ఆంక్షల నియమాలా? అమ్మానాన్న అంటే పులిని చూసి భయపడినట్టు ఉండాలనుకోకూడదు. దీనివల్లనే ‘ఏం చేస్తే ఏం దండనో’ అని ఏ పనీ సరిగ్గా చేయకపోగా పెద్దలకు తెలియకుండా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. కంగారూ.. అతి జాగ్రత్త పుట్టినా తన కడుపు సంచిలోనే ఉంచి పెంచుతుంది కంగారూ. ఇలాగే అతి జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రుల వల్ల పిల్లలు సొంతంగా ఏదీ ఆలోచించలేరు. పెద్దలు చెప్పిందే వేదం అనుకుంటారు. ఆస్ట్రిచ్ స్వభావం ఈ పక్షి తల మట్టిలోనే పెట్టి ఊరుకుంటుంది పిల్లలను అస్సలు పట్టించుకోదు. తనకేమీ పట్టనట్టుగా ఉండే ఈ స్వభావం వల్ల పిల్లల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది. పులిలా ఎవరికీ భయపడకుండా బతకాలి అనే స్వభావాన్ని తమ ఆంక్షలతో పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అతి జాగ్రత్తను, నిర్లక్ష్యాన్నీ చూపకూడదు. ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో, ఎలా ఎగరాలో నేర్పించే తల్లిదండ్రులు వల్ల పిల్లలు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. సమాజ బాధ్యతలో తామూ పాల్గొంటారు గెలవాలి.. గెలిపించాలి.. తమ మాటే నెగ్గాలి అనే ప్రవర్తన లేకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే పిల్లలు విజయావకాశాలను అందుకుంటారు. పిల్లలు గెలవాలి – అలాగే పేరెంట్స్ గెలవాలి. అంటే, ఉదాహరణకు.. పిల్లవాడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాలి. హోమ్‌వర్క్ పూర్తి చేసి వెళ్లు అని చెప్పచ్చు. దీని వల్ల పేరెంట్ గెలుస్తారు, పిల్లవాడూ గెలుస్తాడు. దీనిని విన్ విన్ అప్రోచ్ అంటారు. ∙స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ, దానికీ ఒక హద్దు ఉండాలి. ఉదాహరణకు.. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లచ్చు, కానీ, రాత్రి చెప్పిన టైమ్ లోపల ఇంటికి వచ్చేయాలి. ∙నిర్ణయాలలో పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పార్టీ, హోటల్, వేసుకునే దుస్తులు.. . ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో పిల్లల అభిరుచులకూ ప్రాధాన్యత ఇవ్వాలి. ∙అవసరాన్ని బట్టి లైఫ్‌స్కిల్స్ నేర్పించాలి. ∙పిల్లల నుంచి ఆశించేవి ఉంటాయి. కానీ, అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. గెలిస్తే ఆనందం. గెలవకపోయినా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇవ్వడం లాంటివి. ఎమోషన్స్‌కి ప్రాముఖ్యం ఇవ్వాలి. బ్యాలెన్స్డ్గా ఉండే తల్లిదండ్రుల మైండ్ పిల్లలకు ఎప్పుడూ తెరిచిన తలుపులా ఉంటుంది. చర్చలకు మంచి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది. నిబంధనలు విధించే తల్లిదండ్రుల్లో పైన చెప్పినవేవీ ఉండవు. వీళ్ల మైండ్‌లో క్లోజ్ డోర్ ఉంటుంది. దీంతో పిల్లలు పేరెంట్స్‌తో ఏదీ పంచుకోరు. కేవలం యాంత్రికమైన షేరింగ్ ఉంటుంది. వాస్తవ విరుద్ధంగా ఉంటారు. ఇది ఎప్పుడూ అనర్థాలకు దారితీస్తుంది. – గీతా చల్లా, సైకాలజిస్ట్ -
మనసెరిగి... మలచాలి
పిల్లల మనసు మట్టిముద్ద వంటిది.. దానిపై ఏది పడినా అది చెరగని ముద్రనే వేస్తుంది అని చెబుతారు మానసిక విశ్లేషకులు. బాల్యంలో వారు చూసిన సంఘటనలు, లేత మనసుపై పడిన గుర్తులు జీవితకాలం ప్రభావం చూపుతాయి. వారికి తీపి జ్ఞాపకాలను మిగల్చడంతో పాటు సమస్యలను అధిగమించే నేర్పు అలవరచడం పెద్దల చేతుల్లోనే ఉంది. చిన్నారులను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా మూడు. మొదటిది కుటుంబం, రెండోది పాఠశాల కాగా మూడోది సమాజం. అయితే తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లలను నడిపించే మార్గదర్శి లేకపోవడం, వారి ఆసక్తిని గురువులు గుర్తించకపోవడం, సమాజంలో విలువలు కనుమరుగవడం వంటి ఎన్నో అంశాలు పిల్లల్లో మానసిక సంఘర్షణకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇమడలేక.. వ్యవస్థలో మనలేక.. బాల్యం గాడి తప్పుతోంది. వీటిని చక్కదిద్ది, చిన్నారులను సక్రమ మార్గంలో నడిపించాలి. లోపాలను గుర్తించి బంగరు బాల్యాన్ని, ఆశావహ భవిష్యత్తును అందించాల్సిన గురుతర బాధ్యత అందరిదీ.. – ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు) కుటుంబం పిల్లలు ఒత్తిడికి లోనవడానికి కుటుంబ పరిస్థితులు కూడా కారణం. వాటిలో ప్రధానంగా.. ⇒ఇంట్లో ఒకే బిడ్డ ఉండడంతో బాగా గారాబం చేయడం ⇒చిన్నకుటుంబాలు కావడంతో తల్లితండ్రులు ఉద్యోగస్తులు కావడం ⇒పిల్లల సమస్యలు, బాధలు తెలుసుకునే తీరిక వీరికి లేకపోవడం ⇒వారికి సాంత్వన అందించే తల్లితండ్రుల ప్రేమ అందకపోడవం ⇒ పిల్లలను ఇతరుల ముందు నిందించడం, దండించడం ⇒ శారీరక, మానసిన సమస్యలను అధిగమించే విధానాలు తెలియకపోవడం ⇒తగిన మాగదర్శకత్వం అందించే వారు లేకపోవడం ⇒ తల్లిదండ్రులు తమ ఇష్టాలను, ఆకాంక్షలను పిల్లలపై రుద్దడం అధిగమించడం.. ఇలా.. ⇒తల్లిదండ్రులు నిత్యం తప్పని సరిగా పిల్లలతో కొంత సమయం గడపాలి ⇒వారి సామర్ధ్యం, ఇష్టాలను తెలుసుకుని ప్రోత్సహించాలి ⇒లోపాలను వేలెత్తి చూపేకన్నా సరిదిద్దే ప్రయత్నం చేయాలి ⇒ సమస్యలు గుర్తించి అధిగమించే విధంగా ప్రోత్సహించాలి ⇒విద్యాసంబంధ, శారీరక, మానసిక సమస్యలను అడిగి తెలుసుకోవాలి ⇒ మానసిక సమస్యలు, ప్రత్యేక సమస్యలు ఉన్నపుడు నిపుణులను కలవాలి ⇒అవసరాలకు మించి డబ్బు ఇవ్వరాదు సమాజం... ప్రతిబింబం ⇒వ్యక్తిని సంస్కరించే సమాజంలో విలువలు కనుమరుగవడం ⇒ నేరాలు, దాడులు పెరిగిపోవడం ⇒ ప్రసార మాధ్యమాలలో నేర సంబంధ వార్తల నిడివి పెరగడం ⇒సకారాత్మక ధోరణిలో సమాజం ప్రతిబింబించకపోవడం ⇒ సినిమాలు, ఇతర సంఘటనలకు చిన్నారులు ప్రభావితం కావడం ⇒ సమాజంలోని వ్యక్తుల అనుచిత ప్రవర్తనలు ⇒ సమాజ పరిస్థితులకు ఇమడలేకపోవడం ఇలా ఉండాలి... ⇒సమాజంలో విలువలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ⇒ వ్యక్తిత్వ వికాస సంబంధ వ్యాసాలు, కార్యక్రమాలు ప్రసారం చేయాలి ⇒ నిపుణులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ జరపాలి ⇒ చిన్నారులను సమస్యలకు గురి చేసే పరిసరాలకు దూరంగా ఉంచాలి ⇒ సమాజంపై అవగాహన కల్పించాలి గతిని మార్చే పాఠశాల ⇒విద్యార్థుల మనసుపై ప్రభావం చూపే మరో ముఖ్య అంశం పాఠశాల. అక్కడి వాతావరణం ఇలా ఉండకూడదు. ⇒ఇతర విద్యార్థులతో పోల్చి చూపడం, నిందించడం ⇒మంచి మార్కులు సాధించాలని ఒత్తిడి తీసుకురావడం ⇒కేవలం విద్యకు, మార్కులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం ⇒ విద్యార్థుల మనసెరిగి బోధించే విధానం కనుమరుగవడం ⇒కేవలం లాభాపేక్షతోనే పాఠశాల నిర్వహణ సాగడం ⇒అధ్యాపకుల బోధన సరిగా లేకపోవడం ⇒బోధన ఆసక్తికరంగా లేకపోవడం ⇒స్వీయ అభ్యసనం అలవాటు చేయకపోవడం ⇒ విద్యతో పాటు సహకార్యక్రమాలు, క్రీడలకు అవకాశం లేకపోవడం ఇలా ఉండాలి.. ⇒విద్యార్థుల మనసెరిగి, ఆసక్తికి అనుగుణంగా బోధన ఉండాలి ⇒ఉపకరణాలతో ఆసక్తికరంగా బోధన జరపాలి ⇒ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదు ⇒ప్రేమతో మసలే ఉపాధ్యాయులు ఉండాలి ⇒విద్యార్థి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుని మార్గదర్శకత్వం అందించాలి ⇒తరగతిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉండాలి ⇒ క్రీడలు, సాంసృతిక కార్యక్రమాలకు సమయం కేటాయించాలి ⇒వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించాలి ⇒ప్రవర్తనా సమస్యలు గుర్తించి నివారించే ప్రయత్నం జరపాలి కౌన్సెలర్లను ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఉత్తర్వులను అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతీ పాఠశాలలో తప్పనిసరిగా సైకోమెట్రిక్ సైకాలజిస్ట్, కౌన్సెలర్లు ఏర్పాటు కావాలి. ప్రతీ సంవత్సరం విద్యార్థుల మానసిక పరిస్థితులను వీరు గమనించాలి. విద్యార్థుల సమస్యలు గుర్తించి తగిన మార్గదర్శకత్వం నెరపాలి. కుటుంబంలో పెద్దలలో పిల్లలకు సాన్నిహిత్యం పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవితకు తోడ్పడే విధంగా ఆశావాద దృక్పథం అలవరచాలి. – ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి