breaking news
Child protection officers
-
కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు
సరదాగా సాగిపోవాల్సిన బాల్యం మూడు ముళ్లతో బంధీ అవుతోంది.ఆటపాటలతో స్నేహితుల మధ్య కేరింతలు కొట్టాల్సిన చిన్నారులు పెళ్లి పీటలెక్కుతున్నారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు రకాల పథకాలను ప్రవేశపెట్టడంతో గణనీయంగా తగ్గిన బాల్యవివాహాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం బాల్య వివాహాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. వీటిని ఎప్పటికప్పుడూ ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు అడ్డుకొని తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. సాక్షి,మెదక్: జిల్లాలో 2020లో అధికారిక లెక్కల ప్రకారం 42 బాల్యవివాహాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రొటక్షన్ ద్వారా అధికారులు అడ్డుకోగా, రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. 2021లో కేవలం మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ 1098 చైల్డ్ లైన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి తదితర ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా.. కరోనా ప్రభావంతో పాఠశాలలు, కళాశాలలను మూసివేయడంతో బాలికలు ఇంటివద్దనే ఉంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తూ బాల్య వివాహాలు జరిపిస్తున్నాయి. ఆర్థిక స్థోమత, మంచి సంబంధం, ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు, ప్రేమ వ్యవహారం వల్ల పరువు పోతుందనే తదితర కారణాలతో మైనర్లకు తల్లిదండ్రులు గట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాల్య వివాహాలతో అనర్థాలు.. ► చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను మోయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవాల్సి వస్తుంది. ►పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విషయాలకే మనస్పర్థలు వస్తాయి. దీంతో కుటుంబ కలహాలు ఏర్పడి విడిపోయేందుకు దారి తీస్తాయి. ►చిన్నతనంలో గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో సమస్యలు ఎదురవడంతో పాటు తల్లీబిడ్డలకు ప్రాణహాని ఉంటుంది. అధికారులకు ఫిర్యాదు చేయాలి ►ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, సర్పంచ్, మండల స్థాయిలో తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్వైజర్, ఎంపీడీఓ, సీడీపీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వొచ్చు. అలాగే 1098, 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. బాల్య వివాహాలు నేరం.. ►బాల్య వివాహాలు చేయడం చట్టప్రకారం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం బాల్యవివాహాలు జరిపిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. -
అమ్మకానికి బంగారుతల్లి
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: మూడవ కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టిందని పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయానికి పెట్టిన సంఘటన మండల పరిధిలోని రాజీపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన లకావత్ పీర్యా, విజ్యా దంపతులకు ఎస్న ఐదేళ్లు, అరుణ మూడేళ్ల ఇద్దరు ఆడబిడ్డలున్నారు. కాగా కుమారుడు కావాలని కోరుతున్న ఆ దంపతులకు మూడు రోజుల క్రితం జరిగిన కాన్పులోనూ మళ్లీ ఆడ బిడ్డేపుట్టింది. దీంతో ఆ దంపతులు తమకు పోషించే శక్తి లేదని, కాన్పునకు అయిన ఖర్చు రూ. 6 వేలు ఇచ్చి తీసుకు పోవచ్చని తండాలో పలువురికి తెలిపారు. ఈ విషయం కప్రాయిపల్లి అంగన్వాడీ టీచర్ దృష్టికి రావటంతో ఆమె ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించింది. దీంతో విషయం తెలుసుకున్న శిశుసంరక్షణ జిల్లా అధికారి రత్నం, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ వింధ్యావాహినిలు తండాకు చేరుకుని శిశువు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారు మాట్లాడారు. తమకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మూడో కుమార్తెను పోషించే శక్తి లేదని తేల్చి చెప్పారు. పోషించే స్తోమత లేనప్పడు కు.ని ఆపరేషన్ చేయించుకోవచ్చ కదా అధికారులు ప్రశ్నించగా.. కుమారుడు కోసం ఎదురు చూశాం అని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు మాట్లాడుతూ కనీసం వారం రోజులైనా తల్లి పాలు ఇవ్వండని, పొత్తిళ్ల పాపకు గేదె పాలు, డబ్బా పాలు పడితే ఆరోగ్యం క్షీణిస్తుందని, వారం తర్వాత వచ్చి తీసుకెళతామన్నారు. ఇందుకు వారు ససేమీరా అన్నారు. దీంతో చేసేది లేక అధికారుల ఆ పసిగుడ్డును సంగారెడ్డి శిశువిహార్‌కు తరలించారు. ఆడశిశువులు.. అంగడి సరుకులు పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువులు అంగడి సరుకులవుతున్నారు. మండల పరిధిలోని వాడి పంచాయతీ మెట్టు తండాకు చెందిన లంబాడి రవి, అనితలకు మూడో కాన్పులోను ఆడ బిడ్డే పుట్టిందని మూడు నెలల క్రితం టేక్మాల్‌లోని ఓ తండాలో విక్రయించిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అధికారులు స్పందించి ఆ తరువాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గిరిజనులు మగబిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు తండాల్లో కోకొల్లలు. ఒక వేళ ఆడపిల్లలు పుడితే ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.