breaking news
Chief subrata roy
-
ఇది మీరు కోరి తెచ్చుకున్నదే..
సహారా సుబ్రతా జైలు జీవితంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కోట్ల ఆస్తులున్నా ఇన్వెస్టర్లకి ఇవ్వాల్సిన సొమ్ము తిరిగివ్వలేక సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైలు జీవితాన్ని కోరి తెచ్చుకున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆస్తులను వదులుకోకుండా తన స్వేచ్ఛను త్యాగం చేస్తున్నారంటూ పేర్కొంది. మానవతా కోణంలో తనకు బెయిలివ్వాలంటూ సుబ్రతా రాయ్ పెట్టుకున్న పిటీషన్‌పై సుప్రీం కోర్టు బెంచ్ ఈ విధంగా స్పందించింది. ‘ఒకవైపు ఆయన తనకు రూ. 1,85,000 కోట్ల ఆస్తులున్నాయని అంటారు. మరోవైపు అందులో అయిదో వంతు సొమ్మును కట్టలేకపోతున్నారు. అంత డబ్బు ఉన్న వ్యక్తి జైల్లో ఉంటూ తన స్వేచ్ఛనైనా వదులుకుంటున్నారు కానీ.. ఆస్తులను వదులుకోవడం లేదు. కాబట్టి జైల్లో ఉండటం మీరు కోరి తెచ్చుకున్నదే’నని సుబ్రతా రాయ్‌ని ఉద్దేశించి బెంచ్ వ్యాఖ్యానించింది. సహారా గ్రూప్ తన ఆస్తులను విక్రయించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నందున, ఆ పని చేసేందుకు రిసీవరును నియమించడంలో అభ్యంతరాలేమీ కనిపించడం లేదని పేర్కొంది. సహారా గ్రూప్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఒకవైపు రూ. 1,000 కోట్ల పైగా రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీల రుణాలను కూడా అయిదు, పదేళ్ల పాటు బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తుండగా.. తన క్లయింటుతో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని సిబల్ పేర్కొన్నారు. ఆయనపై కోర్టు ధిక్కారణ కేసులో విచారణ పూర్తి కాకుండానే జైల్లో ఉంచడం సముచితం కాదని విజ్ఞప్తి చేశారు. జైల్లో ఉంటూ బెయిల్ కోసం భారీ మొత్తం సమకూర్చుకోవడం కష్టం కాబట్టి రాయ్‌ని మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరారు. కానీ, దీనిపై గతంలో ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా తమకూ కొన్ని పరిమితులు ఉంటాయన్నది గుర్తెరగాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సెప్టెంబర్ 14కి వాయిదా వేసింది. సహారా గ్రూప్‌లో భాగమైన సంస్థలు.. ఇన్వెస్టర్ల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు సమీకరించిన కేసులో ఏడాదిన్నరగా సుబ్రతా రాయ్ జైల్లో ఉన్నారు. -
బెయిల్ కోసం విదేశీ రుణం!
సహారా విజ్ఞప్తికి సుప్రీం అనుమతి ఆర్బీఐ అనుమతి తప్పనిసరి న్యూఢిల్లీ: జైలు నుంచి తమ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌పై విడుదలకు కొంత మొత్తాన్ని విదేశీ రుణ రూపంలో సమీకరించుకోడానికి వీలు కల్పించాలని సహారా గ్రూప్ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నిధులు దేశంలోకి రావడానికి సంబంధించిన ఫెమా నిబంధనలన్నింటినీ పాటించాలని పేర్కొంది. ప్రత్యేకించి రిజర్వ్ బ్యాంక్ నుంచి తగిన అనుమతులు పొందాలని స్పష్టం చేసింది. ఈ రూలింగ్‌తో అమెరికా సంస్థ మిరేజ్ కేపిటల్ నుంచి 1050 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,510 కోట్లు) పొందేందుకు సహారా గ్రూప్‌కు వీలు కుదిరింది. గ్రూప్‌కు విదేశాల్లో ఉన్న మూడు హోటళ్లలో వాటా తనఖాగా ఈ నిధులను మిరేజ్ కేపిటల్ అందిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మిరేజ్ కేపిటల్ నుంచి సహారాకు 650 మిలియన్ డాలర్లు లోన్‌గా, 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ రూపంలో అందుతుంది. రెండు సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ.24 వేల కోట్ల నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల వైఫల్యం... కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో సహారా చీఫ్ రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. మొత్తం డబ్బు సమకూర్చడానికి వీలుగా మధ్యంతర బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీం గతంలో షరతు విధించిన సంగతి తెలిసిందే.