breaking news
chevella mp
-
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్‌కు లేఖ పంపించిన రజింత్‌రెడ్డి.. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
TS: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ?
సాక్షి,చేవెళ్ల: ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్న ఈ ఎంపీ సీటుపై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అందుకే ఈ పార్లమెంట్ సీటు మీద పట్టు సాధించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న చేవెళ్ళ పార్లమెంటరీ స్థానాన్ని 2009లో ఏర్పాటు చేశారు. ఒకవైపు అర్బన్, మరోవైపు రూరల్ నియోజకవర్గాలు కలగలసి ఉన్న చేవెళ్ళలో పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గులాబీ పార్టీ తరపున రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. 2014లో గులాబీ పార్టీ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓడిపోయారు. కొండా ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా చేవెళ్లలో పాగా వేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేవెళ్ళ మీద పట్టు బిగించాలని చూస్తోంది. అదేవిధంగా గత రెండుసార్లు గెలిచిన చేవెళ్ళను మూడోసారి గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ ఆశిస్తోంది. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కమలం పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రై యాంగిల్ పైట్ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది. ఇక ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఆ కీలక నేతనే చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ కనిపిస్తోంది. లేనిపక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇంఛార్జీగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్ గా తీసుకుంటే బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరపున బరిలో దించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు.. స్థానికంగా పట్టు ఉండటం.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండటం.. మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా ? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చివరకు ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి. ఇదీచదవండి.. గులాబీ బాస్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ -
వృద్ధ గోవులకు పింఛను
పూడూరు: గోమాత రక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామ గుండం రామలింగేశ్వరాలయాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం పూడూరుకు చెందిన 20 వృద్ధ గోవులకు రూ.500 చొప్పున పింఛను అందజేశారు. అమృంతగమయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యానందస్వామి సౌజన్యంతో గోవుల రక్షణ కోసం యజమానికి ప్రతినెలా500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.375తో బీమా చేయించామని, ఆ గోవు మరణిస్తే రైతుకు రూ.35 వేల బీమా అందుతుందని స్పష్టం చేశారు. -
ఆయన ఎంపీగా గెలవడం మా దౌర్భాగ్యం
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి): కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందడం ఆ ప్రాంత వాసుల దౌర్భాగ్యమని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శనివారం స్థానిక తెలంగాణ చౌరస్తా నుంచి ఎంపీ శవయాత్ర నిర్వహించి బీజేఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలని అక్కడి ప్రజలంతా ఎదురు చూస్తుంటే కమీషన్ల కోసం ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ చెప్పడం దుర్మార్గమన్నారు. కేవలం వారి స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల బాగోగుల గురించి ఏమి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత చేవెళ్లను కాదని ప్రస్తుతం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారన్నారు. జిల్లా వాసులకు అన్యాయం జరిగే పనులు చేస్తే తెలంగాణ ఉద్యమం తరహాలోనే.. ప్రాణహిత చేవెళ్ల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరించారు.