breaking news
chenchu community
-
మన‘సారా’ ఒక్కటై.. అడవంతా ఆదర్శమై!
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇప్పటికీ వరకట్నం లేకపోవడం.. యువతీ యువకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం.. నిరాడంబరంగా తంతు ముగించడం విశేషం. ప్రకృతి ఒడిలో ఒక్కటై పచ్చని బంధానికి బలమైన పునాది వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – ఆత్మకూరు రూరల్కాలం మారుతోంది. కొన్ని కులాలు, మతాల్లో ఆచారాలు కనుమరుగు అవుతున్నా.. ఆదిమ గిరిజనులైన చెంచులు తమదైన నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి వివాహ పద్ధతి నాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరపడం విశేషం. చెంచు గిరిజన పెద్దలు తమ పిల్లల వివాహ విషయాల్లో వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతన్యత ఇస్తున్నారు. ఒకరినొకరు ఇష్ట పడి ఆ విషయాన్ని పెద్దలకు చెబితే చాలు.. వెంటనే వివాహ యత్నాలు మొదలవుతాయి. గూడెం పెద్దలతో కలిసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అబ్బాయి తరుఫు వాళ్లు తీసుకు వచ్చిన ఐదు సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే అమ్మాయి తరుఫు వారు మూడు సీసాల సారాను వరుడి వైపు వారు తెచ్చిన సారాయితో కలుపుతారు. ఇది రెండు కుటుంబాల కలయికకు, నూతన బంధానికి చిహ్నంగా భావిస్తారు. అలా ఒకటైన సారాయిని వచ్చిన పెద్దలకు తలా ఇంతా పంచుతారు. ఆ సమయంలోనే వివాహ దినాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. చెంచుల వివాహాల్లో వరకట్నం అన్న సాంఘిక దురాచారం కనపడదు. కొద్దిపాటి కన్యాశుల్కం ఉంటుంది. అది కూడా పూర్వపు రోజుల్లో అయితే అణాలలో ఉండేది. ఇప్పుడిప్పుడే రూ.11 దాకా పెరిగింది. ఈ మొత్తాన్ని వివాహ సమయంలో వరుడు వధువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కూతురింటిలో జరిగే తంతుకు కావాల్సినదంతా పెళ్లి కొడుకు తీసుకు రావాల్సిందే. పెళ్లి కూతురికి రెండు చీరలు, పెళ్లి కూతురికి తల్లికి ఒక చీరను తీసుకెళ్లాలి. వధువు తల్లిదండ్రులకు ఆరోజు పెట్టే పప్పన్నం మాత్రమే ఖర్చు. చెంచుల పురోహితుడు ‘కోలగాడు’ .. ఇరువురిని ఒకటి చేసి వారు దంపతులని సమాజానికి ప్రకటించే తంతే వివాహం. చెంచుల్లో వివాహం జరిపించేందుకు ప్రతి గూడెంలోనూ కోలగాడు అని పిలవబడే పురోహితుడుంటాడు. సగోత్రికులలో వివాహం నిషిద్ధమైన చెంచుల్లో పలు గోత్రనామాలు కలిగిన గుంపులుంటాయి. వాటిలో ఉత్తలూరు, పులిచర్ల, గుళ్ల, దాసరి, మాండ్ల, చిగుళ్ల, జళ్లి, భూమని, కుడుముల వంటి గోత్రాలు వాటిలో కొన్ని. వీటిలోని ఉత్తలూరు గోత్రానికి చెందిన వారిలో ఒకరిని ఆయా గూడేలలో పెళ్లి తంతు జరిపే పురోహితునిగా ఎంచుకుంటారు. చెంచు పురోహితున్ని ‘కోలగాడు’ అనిపిలుస్తారు. ప్రకృతి ఒడిలోనే ఏకాంతం.. పెళ్లయిన వధూవరులకు అనంతరం జరిగే శోభన కార్యక్రమం నాలుగు గోడల మధ్య జరగడానికి చెంచుల ఆచారాలు అనుమతించవు. పెళ్లయిన వధూవరులు ఆహార సేకరణ కోసం అడవుల్లోకి వెళతారు. అక్కడ ప్రకృతి ప్రసాదించిన ఏకాంతం, పచ్చటి పొదరింటి శయ్యాగృహమే నూతన వధూవరులకు శోభన వేదిక అవుతుంది. నూతన వధూవరులే కాదు.. ఏ చెంచు జంటకైనా రాత్రి శృంగారం నిషిద్ధం. విహారమైనా.. ఆహార సేకరణ అయినా.. శృంగారమైనా పగటి పూటే చెంచులకు ఆనవాయితీ. చెంచుల పెళ్లింట విశేషాలు..» వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు. » ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది. » గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు. » కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా తయారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది. » పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టి సంబరం జోరుగుంటుంది. » పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది. పాత ఆచారాలు మరచిపోలేం నాగరికతకు ఎంత దగ్గరైనా మా చెంచు వాళ్లు మాత్రం పాత పద్ధతులు ఆచారాలు వదలుకోలేదు. ఇప్పటికీ మా పెద్దోళ్లు చెప్పిన పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నాం. పద్ధతులు మారిస్తే మా పెద్దోళ్లు పైనుంచి కోపగించుకుంటారనే భయమూ ఉంది. పెళ్లంటే అన్ని ఖర్చులు మగపెళ్లి వాళ్లే పెట్టుకుంటారు. ఆడపెళ్లి వాళ్లకు ఎలాంటి ఖర్చు లేదు. – ఉత్తలూరి అంకన్న, కోలగాడు, నాగలూటి గూడెం పిల్లల ఇష్టాలతోనే మా గూడేల్లోకి చర్చీలు, ఆలయాలు వచ్చినా.. మా దేవుళ్లు అయిన ఈదన్న, గుగ్గిళ్ల బయ్యన్న, మంతనాలమ్మలను కొలవడంలో మాత్రం మార్పులేదు. అట్టాగే పెళ్లిళ్లు కూడా సంబరంగా జరుపుకుంటారు. పిల్లగాళ్ల ఇష్టాలతోనే పెద్దవాళ్లు జత కట్టిస్తారు. – వెంకటేశ్వర్లు, చెంచు దేవతల పూజారి, బైర్లూటి -
అడవే ఆధారం.. బతుకు భారం..
సంక్షేమ ఫలాలు దరి చేరవు. వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణే జీవనాధారం. ఇదీ నల్లమల అటవీ ప్రాంతంలోని వందలాది చెంచుల జీవనం. అటవీ ప్రాంతంలోని చెంచుల జీవనాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఆర్ఈ జీఎస్, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ.. సంక్షేమ ఫలాలు వారి దరి చేరడం లేదు. ఫలితంగా అటవీ ఉత్పత్తుల సేకరణతోనే కాలం వెళ్లదీస్తున్నారు.నల్లమల లోతట్టు ప్రాంతంలో..ఉమ్మడి రాష్ట్రంలోని సున్నిపెంట (శ్రీశైలం)లో మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని చెంచుల సంక్షేమం కోసం ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఐదు జిల్లాలోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలున్నాయి. మొత్తం 4,041 చెంచు కుటుంబాల్లో 14,194 మంది జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటలు ఉండగా.. 2,595 కుటుంబాల్లో 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలు ఉన్నారు.అభయారణ్యంలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలు ఉండగా.. 18 చెంచు పెంటలు ఉన్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజక వర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతలబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా తయారైంది.ఫలాల సేకరణలో హద్దులు..చెంచులు ప్రధానంగా దుంపలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. నల్లమలలోని పలు చెంచు పెంటలకు నేటికీ సరైన రహదారులు లేవు. సరైన జీవనశైలి లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే అటవీ ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకమేదీ?అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం, చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో... ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభ్యున్నతికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నది వాస్తవం. కనుమరుగవుతున్న పండ్ల చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో.. చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.క్రూరమృగాలతో ముప్పు..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, విప్పపువ్వు, విప్ప గింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురు వంటి వాటితో పాటు మరో పది రకాల అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజ సిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా అంతరిస్తున్నాయి. పెద్దపులులు, క్రూరమృగాలతో ముప్పును సైతం లెక్కచేయకుండా ఫలాల సేకరణ చేయక తప్పడం లేదు.అటవీ ఉత్పత్తులు సేకరించి.. గిరిజన కార్పొరేషన్ సంస్థ (జీసీసీ) కేంద్రాల్లో విక్రయిస్తారు. వారికి కావాల్సిన సరుకులను అక్కడి నుంచి తీసుకెళ్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనెతుట్టెలు కనిపించడం లేదు. ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే చెంచులు ఆధారపడి జీవిస్తున్నారు.ప్రత్యేక కార్యాచరణచెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. చెంచుల కోసం కేంద్ర ప్రభు త్వం ప్రధానమంత్రి జనజా తి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపడుతోంది. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్ కార్డులు అందజేశాం. ప్రత్యేకంగా మెడికల్ వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి పీవో, ఐటీడీఏబీమా సౌకర్యం కల్పించాలికొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయో గపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వ లేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. తేనె సేకరణకు ఆడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.– బయ్యన్న, మల్లాపూర్ చెంచుపెంటచదవండి: కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!గుడిసెల్లోనే కాపురం..లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచులు నేటికీ అనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక నేటికీ బొడ్డు గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు.– నిమ్మల శ్రీనివాసులు, అధ్యక్షుడు, రాష్ట్ర ఆదివాసీ చెంచు ఐక్యవేదిక -
అడవే చెంచులకు అమ్మ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలోనే నివసించే చెంచుల జీవనశైలి...బాహ్య ప్రపంచానికి కొంచెం వైవిధ్యంగానే ఉంటుంది. అంతరించిపోతున్న జాతుల్లో చెంచులు కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ సరైన ఆహారానికి నోచుకోవడం లేదు. కారం మెతుకులు, చింత పులుసు, ఎప్పుడోసారి పప్పు ఇదే వారి రోజువారీ మెనూ. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వారి జీవన ప్రమాణస్థాయిల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. పౌష్టికాహార లోపం, ఉపాధి సన్నగిల్లడం, సరైన వైద్యం అందకపోవడంతో సగటు చెంచుల ఆయుర్దాయం 50ఏళ్లకే పరిమితమవుతోందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న 120 చెంచు పెంటల్లో కలిపి చెంచుల జనాభా పదివేల లోపే. వీరి కుటుంబాల్లోని పిల్లలు కనీసం బడిచదువుకు కూడా నోచుకోవడం లేదు. నిత్యం ఒక్కటే..: చెంచు చిన్నారుల నుంచి పెద్దల వరకు పోషకాహారం కరువవుతోంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పరిసర ప్రాంతాల్లోని చెంచులు కూరగాయలు కావాలన్నా 30 కిలోమీటర్ల దూరంలోని మన్ననూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. పదిహేను, నెల రోజులకు ఒకసారి మన్ననూర్ వెళ్లి తెచ్చుకున్న సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏమీ దొరక్కపోతే పప్పులు, తొక్కులు, చింత పులుసుతోనే రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యమే వీరికి ప్రధాన ఆహారం. అడవిలో లభించే చెంచుగడ్డలు, చింతపులుసు, చింతచిగురు, నెమలినార, ఆకుకూరలు, యార్లగడ్డ, మూలగడ్డ, శాదగడ్డ తదితర గడ్డలు, కందమూలాలను చెంచులు ఆహారంగా తీసుకుంటారు. అయితే ఇవి సీజ¯న్లోనే లభిస్తాయి. చెంచుగడ్డలు, ఇతర గడ్డలను ఎండాకాలంలో గడ్డి ఎండిపోయాక మాత్రమే సేకరించేందుకు వీలుంటుంది. దీంతో మిగతా సమయాల్లో వీరికి పోషకాహారం దొరకడం లేదు. బడికి దూరం.... చెంచు చిన్నారులు బడికి దూరంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ గేటు నుంచి మల్లాపూర్, రాంపూర్, మేడిమల్కల, సంగిడిగుండాల తదితర చెంచు పెంటలకు అప్పాపూర్‌లోని ఒక్క గిరిజన పాఠశాలే దిక్కు. ఇందులో ఐదో తరగతి వరకు ఉండటంతో చిన్నారుల చదువు అక్కడికే పరిమితమవుతోంది. అడవి నుంచి బయటకు వెళ్లి విద్యాబోధన సాగించేందుకు చెంచులు ఇష్టపడడం లేదు. అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తే కనీసం పదోతరగతి వరకైనా చదువుతారు. ఇంటర్, డిగ్రీ వరకు చదివేవారు పదుల సంఖ్యలోనే ఉంది. ఉపాధి హామీ పథకమే ఆదాయ వనరు చెంచులు ప్రధానంగా తేనె, చింతకాయలు, చీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో ఉపాధి సైతం కరువైందని చెంచులు వాపోతున్నారు. ఉపాధి హామీ కూలీ డబ్బులే ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. గిరిపోషణ అంతంతే... చెంచు చిన్నారులు, మహిళలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం నివారించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన గిరిపోషణ తూతూమంత్రమే అయ్యింది. జొన్నలు, రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో పౌష్టికాషారాన్ని అందించేలా హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇక్రిశాట్ సంయుక్తంగా పోషకాహార ప్రణాళిక రూపొందించాయి. ఈ మేరకు మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో 3,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఐటీడీఏతో పాటు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ లేని చెంచు పెంటల్లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా తృణధాన్యాలతో ఉదయం, సాయంత్రం మలీ్టగ్రెయిన్ మీల్, స్వీట్ మీట్, రాగులు, జొన్నలతో చేసిన చిక్కీలు, పట్టీలు, జవార్ బైట్స్ వంటి బలవర్ధక ఆహారం అందజేశారు. కానీ ఈ కార్యక్రమం రెండు, మూడు నెలలకే పరిమితమైంది. ఐదో తరగతి వరకే... అప్పాపూర్‌లో ఐదోతరగతి వరకు బడి ఉంది. అంతవరకే చదువుకున్నా. తర్వాత పైచదువుల కోసం బయటకు వెళ్లలేదు. నాతో పాటు చాలామంది ఇక్కడితోనే ఆపేశారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. – తోకల గురువయ్య, చెంచు యువకుడు, అప్పాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా దెబ్బ తాకినా, చేయివిరిగినా నాటు వైద్యమే రెండు నెలల కిందట చెట్టు నుంచి జారి కింద పడ్డ. చేయి విరిగింది. డిండికి పోయి కట్టు కట్టించుకున్న. సుస్తీ అయితే ఆస్పత్రికి పోము. ఆస్పత్రికి వెళ్లాలంటే మన్ననూర్ లేకుంటే వటవర్లపల్లికి పోవాలి. అటు ఎటు పోవాలన్నా దూరం 50 కిలోమీటర్లు ఉంటది. అక్కడ మందులు మాత్రమే ఇస్తారు. మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లామంటారు. అటు 80 కిలోమీటర్ల బదులు డిండికి వెళ్లా. ఇక్కడ అందరికి నాటువైద్యమే. – నాగయ్య, అప్పాపూర్ సార్లు వస్తేనే సౌకర్యాలు గిరిపోషణ కింద ఇంతకు ముందు జొన్నలు, సజ్జలతో ఉదయం, సాయంత్రం ఉప్మా ఇచ్చారు. ఏడాది కాలంగా ఏమీ ఇవ్వడం లేదు. గవర్నర్ మేడం, సార్లు వస్తున్నప్పుడు మాత్రమే సౌకర్యాలు చేస్తున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – నాగమ్మ, మల్లాపూర్ పెంట, నాగర్‌కర్నూల్ -
అడవి ఒడి నుంచి విడదీసి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అమ్రాబాద్ అభయారణ్యం నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల అధికారులు తరచూ చెంచుపెంటలకు వస్తూ.. పక్కాఇళ్లు కట్టిస్తామని, భారీగా ప్యాకేజీ ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని చెంచులు చెప్తున్నారు. తాము అడవి బయట బతకలేమని చెప్తున్నా వినడం లేదని.. చెంచుపెంటల్లోని గిరిజనేతరులకు గాలమేసి, వారితో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ మధ్య చిచ్చుపెట్టి.. అడవి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. తమను బలవంతంగా మైదాన ప్రాంతాలకు తరలిస్తే బతకలేమని, చెంచుజాతి పూర్తిగా నశించిపోతుందని వాపోతున్నారు. ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా.. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఏర్పాటు చేశారు. పులులు, ఇతర అడవి జంతువుల ఆవాసాన్ని పెంచడం కోసం, సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి చిరుతలు, వివిధ రకాల జంతువులను తీసుకొచ్చి నల్లమల పరిధిలో వదిలిపెట్టారు. అప్పట్లోనే అడవి మధ్యలో ఉన్న చెంచులను బయటికి తరలించాలని చూశారు. కానీ చెంచులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పలుసార్లు ప్రయత్నాలు జరిగినా చెంచులతోపాటు ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయి. – తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర పరిధిలో (కృష్ణానదికి ఇవతల) మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా నామకరణం చేసింది. ఇటీవల అభయారణ్యం నుంచి చెంచులను తరలించేందుకు అటవీ శాఖ మళ్లీ సన్నాహాలు మొదలుపెట్టింది. కొద్దిరోజుల నుంచి కోర్ ఏరియాలోని చెంచుపెంటల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ మండలం కొల్లంపెంటకు చెందిన చెంచుల కోసం మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లను ఇటీవల ఎఫ్‌డీవో రోహిత్‌రెడ్డి పరిశీలించారు. దీనితో అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకీడుస్తున్న చెంచు కుటుంబాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. అటు గాలం.. ఇటు ఉచ్చు..! అటవీ అధికారులు కొద్దిరోజులుగా చెంచులపై ఒత్తిడి పెంచుతున్నారు. చెంచుపెంటల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. మైదాన ప్రాంతానికి తరలివెళ్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. 18ఏళ్లు నిండిన యువతను కూడా విడి కుటుంబంగా పరిగణిస్తామని.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) నుంచి రూ.15 లక్షల ప్యాకేజీని వర్తింపజేస్తామని గాలం వేస్తున్నారు. కొన్నిచోట్ల భూమి కూడా ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా చాలా వరకు చెంచులు అడవి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. – రెండు, మూడు చెంచుపెంటలు మినహా మిగతా చెంచు పెంటల్లో గిరిజనేతరులు సైతం జీవిస్తున్నారు. వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలులో ఎక్కువగా ఎస్సీ, బీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం పక్కా ఇల్లు, రూ.15 లక్షల ప్యాకేజీ ఇస్తామని అటవీ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో గిరిజనేతరుల్లో ఆశలు పెరిగాయి. అందులో కొందరు గిరిజనేతరులు అడవి బయటికి రావడానికి సుముఖత వ్యక్తం చేయగా.. దీన్ని ఆసరాగా చేసుకుని చెంచులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. చెంచులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టి ‘పని’ సాధించుకునే కుయుక్తులు పన్నుతున్నట్టుగా ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో రెండు ఊర్ల తరలింపు – తొలిదశలో అభయారణ్యంలోని ఫర్హాబాద్, కొల్లంపెంటలోని చెంచులను తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఈ రెండుచోట్ల 30 నుంచి 34 కుటుంబాలు జీవిస్తున్నాయి. – కొల్లంపెంటకు చెందిన చెంచులను మాచారంలో ఆర్డీటీ సంస్థ నిర్మించిన ఇళ్లలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఇళ్లతోపాటు భూమి కూడా ఇవ్వాలనే డిమాండ్ కొందరు చెంచుల నుంచి వ్యక్తమవుతోంది. మాచారం, దాని సమీపంలో ప్రభుత్వ భూముల్లేవు. ఇక్కడి మొల్కమామిడిలో ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన 29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు అటవీశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. – ఫర్హాబాద్ చెంచులను లింగాల మండలం బాచారానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్కడి చెంచులు ఇందుకు అంగీకరించారనీ చెప్తున్నారు. కానీ ఫర్హాబాద్ చెంచులు, సమీపంలోని ఇతర పెంటల్లోని చెంచులు మన్ననూర్‌కుగానీ, వేరే ఏజెన్సీ గ్రామాలకుగానీ పంపితేనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్యాకేజీ రూ.15 లక్షలతోపాటు ఉచితంగా ఐదెకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తరలించే యత్నం ఎప్పట్నుంచో.. – 1999లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు నల్లమలలోని కొన్ని చెంచు కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అమరగిరి వద్ద ప్రత్యేక పునారావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఇమడలేక ఇద్దరు చెంచులు మరణించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. – నల్లమలలో యురేనియం తవ్వకాలు, అభయారణ్యం పేరిట చెంచులను మరోసారి మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ క్రమంలో కుటుంబానికి రూ.10 లక్షల నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఇళ్లు నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పినా.. అడవి బిడ్డలు అంగీకరించలేదు. తర్వాత నగదుతోపాటు రంగారెడ్డి జిల్లా బాచారం దగ్గర ఇళ్ల నిర్మాణం, నగదు కాదనుకుంటే మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగదు ప్యాకేజీని రూ.15 లక్షలకు పెంచారు. – నల్లమలలోని వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంటల్లో 175 చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో 80శాతం కుటుంబాలతో అంగీకార పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో చెంచుల వివరాలివీ.. చెంచు పెంటలు 112 కుటుంబాలు 2,630 జనాభా 9,514 కోర్ ఏరియాలోని చెంచుపెంటలు: నల్లమల పరిధిలోని అమ్రాబాద్, వటువర్లపల్లి, సార్లపల్లి, పులిచింతలబైలు, కొమ్మనపెంట, కొల్లంపెంట, మల్లాపూర్, లింగాల మండలం అప్పాపూర్, బౌరాపూర్, రాంపూర్, సంగిడిగుండాల, మేడిమొల్కల, ఈర్లపెంట. మా జాతి నశించిపోతుంది ఎంతోకాలంగా ఇక్కడే జీవిస్తున్నాం. ప్రభుత్వం మా చెంచులకు ఏవేవో ఆశలు కల్పించి అడవి నుంచి దూరం చేయాలని చూడటం భావ్యం కాదు. అడవి, వన్యప్రాణులతో కలిసి బతికే మా చెంచులను గ్రామాల్లోకి తీసుకుపోతే బతకలేరు. చెంచుపెంటల్లో ఉన్న చెంచులు సాగు చేసుకుంటున్న భూములకు ఎఫ్ఆర్సీ పట్టాలతోపాటు రైతుబంధు ఇచ్చి వ్యవసాయం చేసుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం బలవంతంగా అడవుల నుంచి తరలిస్తే మా చెంచు జాతి పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి. – దాసరి నాగయ్య, చెంచు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు అధికారుల మాటలు నమ్మబోం మా చెంచులను ఎలాగైనా అడవి నుంచి తరలించాలని వివిధ సంస్థలతోపాటు ప్రభుత్వ అధికారులు కుట్ర చేస్తున్నారు. ప్యాకేజీ ఇస్తామంటూ ఆరేళ్లుగా ఉత్త మాటలు చెప్తున్నారు. నమ్మకం కలిగించే చర్యలేవీ తీసుకోవడం లేదు. చెంచు కుటుంబాలకు 5 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి, ఇల్లుతోపాటు పిల్లలకు పాఠశాల, ఆస్పత్రి తదితర సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాతే మాతో మాట్లాడాలి. – చిర్ర రాములు, చెంచు, సార్లపల్లి ఇబ్బంది బదులు.. దారి చూపిస్తే పోతాం.. అన్ని వసతులు కల్పిస్తే పోవడానికి మేం సిద్ధమే. ఆరేళ్లుగా ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారు. పొలాలు సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడో అడవిలో ఏ జంతువులు చనిపోయినా మాకు సంబంధం అంటూ కేసులు పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుకుంటూ ఉండేకంటే.. మాకు దారి చూపిస్తే వెళ్లిపోవడానికి సిద్ధమే. – సత్తయ్య, గిరిజనేతరుడు, సార్లపల్లి బయటికొస్తే బతికేదెలా? చెంచులు అడవిలో చెట్లుచేమలు, జంతువులతో కలిసి, అడవిపైనే ఆధారపడి బతుకుతున్నారు. అడవిలో సహజసిద్ధంగా దొరికే వాటితోనే కడుపు నింపుకొంటున్నారు. వారితో అడవికి ఎలాంటి నష్టం లేకపోగా.. మేలే జరుగుతోంది. ఆదివాసీలు లేకుంటే మాఫియా పెట్రేగిపోవడం ఖాయం. దానివల్ల జీవ, పర్యావరణానికి విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. అసలు చెంచులు మైదాన ప్రాంతాల్లో జీవించగలరా? అడవిలో ఏళ్లకేళ్లుగా బతుకుతున్నవారు ఇప్పటికిప్పుడే అలవాట్లు మార్చుకోగలరా.. మైదాన ప్రాంతాల్లో మానసిక స్థితి, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోగలిగే శక్తి చెంచులకు లేదు. ఏ ప్రభుత్వాలు కూడా వారి ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వలేవు. ముందుగా పక్కా ప్రణాళికతో వారిని విద్యావంతులుగా చేయాలి. కనీసం 7, 10 తరగతులు చదివినవారికి తగిన ఉద్యోగ అవకాశాలివ్వాలి. విద్యావంతులు పెరిగితే.. అడవిలో ఉండాలా? ఇంకెక్కడైనా ఉండాలా అన్నది చెంచులే నిర్ణయించుకుంటారు. సమాజంలో వివక్ష నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారు. అంతేగానీ నిర్బంధంగా తరలిస్తే కొన్నాళ్లలో చెంచు జాతి కనుమరుగవుతుంది. పల్లెల్లో ఉన్నవారిని పట్టణాల్లో జీవించాలని ఏ ప్రభుత్వమైనా చెప్తుందా? అదే అడవిలో నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం ఎంత వరకు కరెక్టు. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఈ ఫొటోలో ఉన్న చెంచు కుటుంబం.. చిగుర్ల చిట్టెమ్మ, ఆమె భర్త ఈదయ్య, వారి ముగ్గురు కూతుళ్లు. తాతల కాలం నుంచీ వీరు సార్లపల్లిలో బతుకుతున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు బడికి పోతే.. తల్లిదండ్రులు, పెద్దబిడ్డ కలిసి అటవీ ఉత్పత్తుల సేకరణ, కూలీ పనులకు వెళ్తారు. చెంచులను అడవి నుంచి బయటికి తరలించేందుకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలను వారు తిరస్కరించారు. అయితే అధికారులు ఇక్కడి గిరిజనేతరులు కొందరిని రూ.15లక్షల ప్యాకేజీకి ఒప్పించి సంతకం చేయించారు. మిగతావారితోనూ సంతకం చేయించాలని.. అప్పుడే తరలింపు పని మొదలవుతుందని, డబ్బులు చేతికి అందుతాయని మెలికపెట్టారు. దీంతో సదరు గిరిజనేతరులు.. చెంచు కుటుంబాలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. చిట్టెమ్మ దంపతులనూ ఒప్పించేందుకు ప్రయత్నించారు. దీనిపై మండిపడ్డ చిట్టెమ్మ కుటుంబం.. ‘‘ఎవరు ఎటైనా పోండి.. మాకు అవసరం లేదు. అడవిని వదిలి ఎక్కడో కాని రాజ్యంలో పోయి మేం బతకలేం. బలవంతంగా తీసుకుపోతే మా చావులే కళ్లజూస్తరు’’అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో చెంచుల ఆందోళన
-
ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు
సాక్షి, పెద్దేముల్: చెంచు కుటుంబాలు వలస వెళొద్దని గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటయ్య, పీఓ ఐటీడీఏ (శ్రీశైలం), పీఓ డాక్టర్ వెంకటయ్యతో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఇటీవల గ్రామంలో నుంచి చెంచు కుటుంబాలు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు బతుకు దెరువుకోసం వెళ్లారు. శివ అనే నాలుగు సంవత్సరాల బాబు చదువుకోవడం లేదని బీజాపూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆయా కుటుంబాలను గ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆయేషా గ్రామంలోని చెంచు కుటుంబాలను కలిశారు. చైతన్యనగర్ గ్రామంలో చెంచుకుటుంబాలు ఎన్ని ఉన్నాయనే విషయమై ఆర్డీఓ వేణుమాధవరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్లల వివరాలను సేకరించి పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోనుంచి చెంచు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లవద్దని కోరారు. తల్లిదండ్రులు గ్రామంలోనుంచి ఉపాధి కోసం వలస వెళితే పిల్లల చదువులు సాగవని అన్నారు. గ్రామంలో వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్న భూములను ప్రభుత్వం చదును చేస్తుందని అన్నారు. బడీడు పిల్లలకు ఎలాంటి పనులు చెప్పరాదని అన్నారు. పిల్లలను చదివిస్తేనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయని అన్నారు. గ్రామం లోని కుటుంబాలకు ఉపాధిహమీ పథకం ద్వారా 180 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తామని అన్నారు. గతంలో గ్రామానికి అధిక సంఖ్యలో నిధులు మంజూరయ్యాయని అయితే గ్రామ ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో గ్రామాభివృద్ధి జరగడం లేదన్నారు. మహిళలకు, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామంలో 20 కుటుంబాలకు భూములను పంపిణీ చేసి పాసుబుక్‌లను సైతం జారీచేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ చైతన్యనగర్‌లో చైతన్యం మాత్రం రావడం లేదన్నారు. గ్రామంలో నుంచి ప్రజలు వలసలు వెళ్లడం తగ్గించుకుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. చెంచు కుటుంబాలకు గిరివికాసం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించనుందన్నారు. బాండేడ్ లేబర్ యాక్టు ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం గ్రామంలో ఎన్సీఎల్పీ కేంద్రం నిర్వహించి విద్యార్థులు చదువుకునేలా చేస్తామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామంలో చెంచు కుటుంబాలకు విద్యుత్ సరఫరా 100 యూనిట్లలోపు వినియోగిస్తే ఉచితంగా విద్యుత్ సరఫరా ఉంటుందని బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని తెలిపారు. కార్మిక శాఖ అధికారులు త్వరలో గ్రామానికి వచ్చి లేబర్ కార్డులను జారీచేస్తారని ఈ కార్డులు పొందినవారికి పిల్లల పెళ్లిళ్లకు రూ.30 వేలు, కాన్పుల సమయంలో మరో రూ.30 వేల చొప్పున అందించడం జరుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తే రూ.లక్ష అందుతోందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరా>రు. గ్రామంలోనే ఉపాధి పొందేందుకు గేదెలు, ఆవులు అందించాలి. స్వయం ఉపాధి కోసం రుణాలను అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి ఆర్డీఓ వేణుమాధవరావు, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు అధికారి హ్మన్మంత్‌రావు, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రత్నమ్మ,సర్పంచ్ లలిత, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. -
'వజ్రాలు కొల్లగొట్టేందుకే వెళ్లగొడుతున్నారు'
అభయారణ్యం, అభివృద్ధి తదితర కారణాలు చెప్పి నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి చెంచులను వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడి నేలలో విలువైన వజ్రాలున్నాయని, వాటిని కొల్లగొట్టేందుకే సీఎం కేసీఆర్ ఈ విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలో సమర్థులైన నాయకులు లేరని, అందుకే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని మంత్రిపదవులు కట్టబెట్టారని విమర్శించారు. సచివాలయం తలరింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి రాములు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.