
నల్లమల అడవుల్లో పొడసూడని ఆధునికత
గిరిజన సంప్రదాయాలను వీడని చెంచులు
యువతి, యువకుల ఇష్టాలే ప్రామాణికంగా పెళ్లిళ్లు
వరకట్నం ఊసులేని వివాహాలు
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇప్పటికీ వరకట్నం లేకపోవడం.. యువతీ యువకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం.. నిరాడంబరంగా తంతు ముగించడం విశేషం. ప్రకృతి ఒడిలో ఒక్కటై పచ్చని బంధానికి బలమైన పునాది వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. – ఆత్మకూరు రూరల్
కాలం మారుతోంది. కొన్ని కులాలు, మతాల్లో ఆచారాలు కనుమరుగు అవుతున్నా.. ఆదిమ గిరిజనులైన చెంచులు తమదైన నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి వివాహ పద్ధతి నాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరపడం విశేషం. చెంచు గిరిజన పెద్దలు తమ పిల్లల వివాహ విషయాల్లో వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతన్యత ఇస్తున్నారు. ఒకరినొకరు ఇష్ట పడి ఆ విషయాన్ని పెద్దలకు చెబితే చాలు.. వెంటనే వివాహ యత్నాలు మొదలవుతాయి.
గూడెం పెద్దలతో కలిసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అబ్బాయి తరుఫు వాళ్లు తీసుకు వచ్చిన ఐదు సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే అమ్మాయి తరుఫు వారు మూడు సీసాల సారాను వరుడి వైపు వారు తెచ్చిన సారాయితో కలుపుతారు. ఇది రెండు కుటుంబాల కలయికకు, నూతన బంధానికి చిహ్నంగా భావిస్తారు. అలా ఒకటైన సారాయిని వచ్చిన పెద్దలకు తలా ఇంతా పంచుతారు. ఆ సమయంలోనే వివాహ దినాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. చెంచుల వివాహాల్లో వరకట్నం అన్న సాంఘిక దురాచారం కనపడదు.
కొద్దిపాటి కన్యాశుల్కం ఉంటుంది. అది కూడా పూర్వపు రోజుల్లో అయితే అణాలలో ఉండేది. ఇప్పుడిప్పుడే రూ.11 దాకా పెరిగింది. ఈ మొత్తాన్ని వివాహ సమయంలో వరుడు వధువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కూతురింటిలో జరిగే తంతుకు కావాల్సినదంతా పెళ్లి కొడుకు తీసుకు రావాల్సిందే. పెళ్లి కూతురికి రెండు చీరలు, పెళ్లి కూతురికి తల్లికి ఒక చీరను తీసుకెళ్లాలి. వధువు తల్లిదండ్రులకు ఆరోజు పెట్టే పప్పన్నం మాత్రమే ఖర్చు.
చెంచుల పురోహితుడు ‘కోలగాడు’ ..
ఇరువురిని ఒకటి చేసి వారు దంపతులని సమాజానికి ప్రకటించే తంతే వివాహం. చెంచుల్లో వివాహం జరిపించేందుకు ప్రతి గూడెంలోనూ కోలగాడు అని పిలవబడే పురోహితుడుంటాడు. సగోత్రికులలో వివాహం నిషిద్ధమైన చెంచుల్లో పలు గోత్రనామాలు కలిగిన గుంపులుంటాయి. వాటిలో ఉత్తలూరు, పులిచర్ల, గుళ్ల, దాసరి, మాండ్ల, చిగుళ్ల, జళ్లి, భూమని, కుడుముల వంటి గోత్రాలు వాటిలో కొన్ని. వీటిలోని ఉత్తలూరు గోత్రానికి చెందిన వారిలో ఒకరిని ఆయా గూడేలలో పెళ్లి తంతు జరిపే పురోహితునిగా ఎంచుకుంటారు. చెంచు పురోహితున్ని ‘కోలగాడు’ అనిపిలుస్తారు.
ప్రకృతి ఒడిలోనే ఏకాంతం..
పెళ్లయిన వధూవరులకు అనంతరం జరిగే శోభన కార్యక్రమం నాలుగు గోడల మధ్య జరగడానికి చెంచుల ఆచారాలు అనుమతించవు. పెళ్లయిన వధూవరులు ఆహార సేకరణ కోసం అడవుల్లోకి వెళతారు. అక్కడ ప్రకృతి ప్రసాదించిన ఏకాంతం, పచ్చటి పొదరింటి శయ్యాగృహమే నూతన వధూవరులకు శోభన వేదిక అవుతుంది. నూతన వధూవరులే కాదు.. ఏ చెంచు జంటకైనా రాత్రి శృంగారం నిషిద్ధం. విహారమైనా.. ఆహార సేకరణ అయినా.. శృంగారమైనా పగటి పూటే చెంచులకు ఆనవాయితీ.
చెంచుల పెళ్లింట విశేషాలు..
» వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు.
» ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది.
» గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు.
» కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా తయారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది.
» పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టి సంబరం జోరుగుంటుంది.
» పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది.
పాత ఆచారాలు మరచిపోలేం నాగరికతకు ఎంత దగ్గరైనా మా చెంచు వాళ్లు మాత్రం పాత పద్ధతులు ఆచారాలు వదలుకోలేదు. ఇప్పటికీ మా పెద్దోళ్లు చెప్పిన పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నాం. పద్ధతులు మారిస్తే మా పెద్దోళ్లు పైనుంచి కోపగించుకుంటారనే భయమూ ఉంది. పెళ్లంటే అన్ని ఖర్చులు మగపెళ్లి వాళ్లే పెట్టుకుంటారు. ఆడపెళ్లి వాళ్లకు ఎలాంటి ఖర్చు లేదు.
– ఉత్తలూరి అంకన్న, కోలగాడు, నాగలూటి గూడెం
పిల్లల ఇష్టాలతోనే
మా గూడేల్లోకి చర్చీలు, ఆలయాలు వచ్చినా.. మా దేవుళ్లు అయిన ఈదన్న, గుగ్గిళ్ల బయ్యన్న, మంతనాలమ్మలను కొలవడంలో మాత్రం మార్పులేదు. అట్టాగే పెళ్లిళ్లు కూడా సంబరంగా జరుపుకుంటారు. పిల్లగాళ్ల ఇష్టాలతోనే పెద్దవాళ్లు జత కట్టిస్తారు.
– వెంకటేశ్వర్లు, చెంచు దేవతల పూజారి, బైర్లూటి