breaking news
cheating in the name of love
-
ఇన్స్టాగ్రామ్ పరిచయమే కొంప ముంచింది! క్లాస్‌రూంలోనే బీటెక్ విద్యార్థిని
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రేమ ఆ విద్యార్థిని పాలిట యమపాశమైంది. నయవంచకుడి మాటలకు మోసపోయిన ఆమె గర్భం ధరించింది. తర్వాత ప్రేమికుడు ముఖం చాటేశాడు. పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాననే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడింది. హాస్టల్ గదిలోనే స్వీయ గర్భస్రావానికి ఒడిగట్టి అపస్మారక స్థితికి చేరుకోగా.. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కక చివరకు ప్రాణాలొదిలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మధు దంపతుల ఏకైక కుమార్తె కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అధిక రక్తస్రావం కావడంతో.. కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో ఆ విద్యార్థిని తరగతులకు హాజరుకాకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. అదేమని అడిగితే ఆరోగ్యం బాగాలేదని సహచర విద్యార్థినులకు చెప్పింది. 8వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో అదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థిని భోజనం తీసుకు వెళ్లగా.. ఆమె తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో పడి ఉంది. గది నిండా రక్తం ఉండటం, డస్ట్‌బిన్‌లో పిండం పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థిని కేకలు వేయడంతో మరికొందరు గదిలోకి వెళ్లారు. వెంటనే అధ్యాపకులకు తెలియజేయడంతో వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే ఆమె మరణించింది. స్వీయ గర్భస్రావానికి ప్రయతి్నంచిన విద్యార్థిని అధిక రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. సీఐ పి.శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో ఎస్ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలికి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ శశికుమార్‌తో పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం శశికుమార్‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారితీసిందని తెలిసింది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగి చివరకు ఆమె గర్భం దాల్చిందని సమాచారం. పరువు పోతుందన్న భయంతోనే ఆ విద్యార్థిని స్వీయ గర్భస్రావానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుందని వైద్యులు, పోలీస్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని గర్భవతి అయిన విషయంలో ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతోంది. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్టు సమాచారం. లేకలేక పుట్టిన సంతానం మృతురాలి తల్లి పోలియో బాధితురాలు కాగా.. తండ్రి వ్యవసాయ కూలీ. పెళ్లయిన పదేళ్ల తర్వాత పుట్టిన ఏకైక గారాలపట్టి కావడంతో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఆ విద్యార్థిని చదువుల్లో రాణిస్తోంది. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడుతుందని భావిస్తున్న తమ కలల్ని కల్లలుగా మార్చి ఒక్కగానొక్క కుమార్తె తమకు గర్భశోకం మిగిల్చిందని తల్లిదండ్రులు బావురుమంటున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. నా భార్యతోనే చనువుగా ఉంటావా అంటూ.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఇంటికి వచ్చిందని.. బంధుమిత్రులతో సందడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. చివరకు ఆమె విగతజీవిగా గ్రామానికి రావడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ప్రేమ పేరుతో యువతిని వంచించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. -
పెళ్లి అంటే.. బ్రోతల్ కేసు పెడతా..
ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానన్నాడు... శారీరకంగా ఒక్కటయ్యారు.. గర్భం దాల్చితే ట్యాబ్లెట్లు ఇచ్చి అబార్షన్ చేయించాడు.. జర్మనీలో పీజీ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. తీరా పెళ్లెప్పుడని నిలదీస్తే.. రూ.8 కోట్లు కట్నం ఇస్తేనే తాళి కడతానంటూ షరతు పెట్టాడు. అంతటితో ఆగలేదు... పెళ్లీగిళ్లీ అంటూ వెంటపడ్డావంటే బ్రోతల్ కేసులో ఇరికిస్తా.. అంటూ బెదిరించాడు.. ఇదీ ప్రేమించిన అమ్మాయికి ఓ యువవైద్యుడి నుంచి ఎదురైన 'ట్రీట్మెంట్'.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. దిల్‌సుక్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్.రణధీర్‌రెడ్డి(27) ఎంబీబీఎస్ పూర్తిచేసి నగరంలోని ఆక్సిజన్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం యూసుఫ్‌గూడ జవహర్ నగర్‌కు చెందిన యువతి(25)తో 'వీ-చాట్' లో పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత నేరుగా యువతి ఇంటికి వచ్చి ప్రేమిస్తున్నానని, ఒకే కులం కావడంతో పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మించాడు. దాంతో శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో యువతి గర్భం దాల్చగా పీజీ చేసేందుకు జర్మనీ వెళ్లివచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ అబార్షన్ చేయించాడు. కాగా పెళ్లి గురించి మాట్లాడేందుకు ఈ నెల 1న దేవర కొండ తీసుకెళ్లిన రణథీర్.. పెళ్లి కావాలంటే రూ.8 కోట్లు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రణథీర్ తల్లి రత్నమ్మ, సోదరుడు సుధీర్ రెడ్డి పెళ్లికి ఒప్పుకోలేదటూ.. యువతిని యూసఫ్ గూడలో వదిలేసి వెళ్లాడు. తర్వాత పెళ్లి మాటెత్తితే కుటుంబాన్ని అంతం చేస్తాం.. బ్రోతల్ కేసులో ఇరికిస్తా అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 417, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి డా.రణధీర్‌ను రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.