తెలుగు పద్యం, పాట అజరామరం
అనంతపురం కల్చరల్: సాహిత్యంలో తెలుగు పద్యం, పాట అజరామరమని సినీ గాయకుడు చంద్రతేజ అన్నారు. త్యాగరాజ సంగీత సభ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘అనంత కళాకారులతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని సినీ నేపథ్యంగా సాగిన అనేక విశేషాలను పంచుకున్నారు. బుధవారం స్థానిక త్యాగరాజ సంగీత సభ ఆడిటోరియంలో సభ అధ్యక్షుడు జ్ఞానేశ్వరరావు ఉత్తార్కర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో చంద్రతేజ మాట్లాడుతూ తిరుపతి సంగీత కళాశాలలో తర్ఫీదు పొందిన తాను దేశ విదేశాల్లో కీర్తిగడించడానికి ఘంటసాల పాటే కారణమన్నారు.
ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి విల్సన్ హెరాల్డ్గా ఉన్న తన పేరును చంద్రతేజగా మార్చడంతో కొత్త జీవితం ప్రారంభమైందన్నారు. జిల్లా గాయనీ గాయకులు పాలసముద్రం నాగరాజారావు, లతాశ్యామ్, నాట్యాచార్యులు కృష్ణమూర్తిరాజు సినీరంగంలోని పలు ఆసక్తికరమైన విషయాలను చంద్రతేజతో ముఖాముఖి ద్వారా అభిమానులకు వివరించారు. చంద్రతేజగా సుప్రసిద్ధులైన విల్సన్ హెరాల్డ్ అనంతకు రావడం ఇక్కడి వారితో అద్భుతమైన సంగీత విషయాలను చర్చించడం ఆనందకరమని కళాకారులన్నారు. అనంతరం త్యాగరాజ సంగీత సభ కళాకారులు చంద్రతేజను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభావతి, రఘునాథ్, భరత్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.