breaking news
challengers trophy
-
ఫైనల్లో ఢిల్లీ
ఇండోర్: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్రికెటర్లు స్ఫూర్తిదాయక ఆటతీరుతో అదరగొట్టారు. ఇండియా రెడ్ జట్టును 112 పరుగుల తేడాతో చిత్తు చేసి చాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నారు. హోల్కర్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెడ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ (131 బంతుల్లో 119; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (55 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మిలింద్ కుమార్ (52 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలతో రాణించారు. గంభీర్ (20), సెహ్వాగ్ (8) విఫలమయ్యారు. చివర్లో రజత్ భాటియా (19 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. రెడ్ బౌలర్లలో మిథున్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఇండియా రెడ్ జట్టు 40.1 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ ముకుంద్ (87 బంతుల్లో 64; 5 ఫోర్లు), గుర్కీరత్ సింగ్ (51 బంతుల్లో 83; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే మెరుగ్గా రాణించారు. కెప్టెన్ యూసుఫ్ పఠాన్(0), ఉతప్ప (7) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో వరుణ్ సూద్ ఐదు, ఆశిష్ నెహ్రా నాలుగు వికెట్లు తీసుకున్నారు. -
ఆది నుంచీ వివాదాస్పదమే...
సాక్షి క్రీడావిభాగం జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. కేరళ తరఫున రంజీల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన శ్రీ అనవసరంగా ఉద్రేకపడే స్వభావంతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. 2005లో చాలెంజర్స్ ట్రోఫీలో దుమ్ము రేపడంతో తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికై ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు ధారాళంగా పరుగులు ఇచ్చినా వికెట్లు తీయగలడని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్‌కు ఆడిన సమయంలో ముంబై ఆటగాడు హర్భజన్ సింగ్‌తో చెంప దెబ్బ తిని వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత కెప్టెన్ ధోని, భజ్జీతో పొసకగపోవడం ఇతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అసలు స్పాట్ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించినప్పుడు దాదాపు ప్రతీ క్రీడాభిమాని ఆశ్చర్యపోయాడు. నేడు బీసీసీఐ ఈ 30 ఏళ్ల ఆటగాడిపై జీవిత కాలం వేటు వేయడంతో కెరీర్‌కు ఫుల్స్టాప్ పడింది.