breaking news
central minister gadkari
-
గడ్కరీ నోట ‘యూజ్ అండ్ త్రో’ వ్యాఖ్యలు.. బీజేపీ అధిష్ఠానానికి గురి?
ముంబై: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయన్ని తప్పించిన తర్వాత రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో.. అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ శనివారం నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమం వేదికగా గడ్కరీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పుడు కాదని, తాను పూర్తిగా వదిలేసినప్పుడే అంతమవుతాడని పేర్కొన్నారు. ‘బిజినెస్, సామాజిక పనులు, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలం. అయితే, ఎవరూ వాడుకుని వదిలేసే మనస్తత్వంతో వ్యవహరించకూడదు. మంచి, చెడు రెండు సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదు. ఎల్లప్పుడూ పట్టుకునే ఉండాలి. ఉదయించే సూర్యుడిని(ఎదిగే వ్యక్తులను) పూజించొద్దు.’ అని పేర్కొన్నారు గడ్కరీ. స్టూడెంట్ నాయకుడిగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు గడ్కరీ. ఆ సమయంలో మంచి భవిష్యత్తు కోసం తనను కాంగ్రెస్‌లో చేరాలని శ్రీకాంత్ జిక్కర్ కోరినట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చదని, పార్టీలో చేరటం కంటే బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని చెప్పినట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలు తమ ఆశలను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు. ఇదీ చదవండి: ప్రభుత్వంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు.. మరోసారి దుమారం! -
బహిరంగ చర్చకు రండి...
భూ బిల్లుపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధం విపక్షాలకు గడ్కారీ సవాలు; సోనియా, హాజరే, విపక్ష నేతలకు లేఖలు న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై చర్చకు రావాలని, బిల్లులోని ఏ అంశంపైనైనా, ఏ వేదిక మీదైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని విపక్షానికి ప్రభుత్వం సవాలు విసిరింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే సహా పలువురు విపక్ష నేతలకు గురువారం లేఖలు రాశారు. రాజకీయ కారణాలతోనే భూ బిల్లును విమర్శిస్తున్నారని, అందులో రైతు వ్యతిరేక ప్రతిపాదనలేవీ లేవని, అది పూర్తిగా రైతు అనుకూల బిల్లేనని ఆయన అందులో స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగపడే ప్రతిపాదనలేమైనా చేస్తే బిల్లులో చేర్చేందుకు సిద్ధమేనన్నారు. రైతు ప్రయోజనాలను కాలరాసేలా ఉందంటూ విపక్షం అంతా ఐక్యంగా భూ బిల్లును వ్యతిరేకిస్తూ, ఆ బిల్లును అడ్డుకోవాలంటూ రాష్ట్రపతికి సైతం వినతిపత్రం అందించిన నేపథ్యంలో గడ్కారీ ఈ లేఖలు రాయడం విశేషం. రైతులకు పరిహారం విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, నిజానికి ఈ బిల్లులో రైతులు, గ్రామాలు సుసంపన్నం అయ్యే ప్రతిపాదనలే ఉన్నాయని ఆ లేఖల్లో గడ్కారీ పేర్కొన్నారు. రైతుల తప్పనిసరి ఆమోదం, సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబంధనల్లో 13 ముఖ్యమైన చట్టాలను యూపీఏ ప్రభుత్వమే పొందుపర్చలేదన్నారు. ప్రతిపక్షంతో సంప్రదించకుండా బిల్లును రూపొందించారన్న ప్రచారం జరుగుతోందని, నిజానికి అన్ని రాష్ట్రాలతో చర్చించి, వారి సూచనలను బిల్లులో పొందుపర్చామని గడ్కారీ వివరించారు. శరద్‌యాదవ్(జేడీయూ), శరద్ పవార్(ఎన్సీపీ), ప్రకాశ్ కారత్(సీపీఎం), ములాయం సింగ్ యాదవ్(ఎస్పీ), మాయావతి(బీఎస్పీ), దేవెగౌడ(జేడీఎస్), అరవింద్ కేజ్రీవాల్(ఆప్) తదితరులకు గడ్కారీ లేఖలు రాశారు. అకస్మాత్తుగా ఇంత జ్ఞానమేంటి? భూబిల్లుపై చర్చకు ఆహ్వానిస్తూ గడ్కారీ రాసిన లేఖపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ‘ఇంత అకస్మాత్తుగా ఈ జ్ఞానమెలా వచ్చింది? బీజేపీ భయపడుతోందా?’ అంటూ ఎద్దేవా చేసింది. గడ్కారీ లేఖ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇంకా చేరలేదని, చేరాల్సినవారికి తప్ప మిగతా అందరికీ చేరిందని ఆ పార్టీ నేత అజయ్ కుమార్ అన్నారు.