breaking news
In the case
-
ఆటో బోల్తా... ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో శుక్రవారం ఆటో బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చౌడూరుకు చెందిన మమత, రామాంజనేయులు, కాకిరేనిపల్లె ఖాసిం జమ్మలమడుగు వైపు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆటోను ఎక్కారు. ఆ వాహనం దొరసానిపల్లె సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మమత, రామాంజనేయులు, ఖాసిం గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మమతను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తిపై కొడవలితో దాడి
కొండాపురం: మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన లింగేశ్వర్‌రెడ్డిపై సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి చేసినట్లు కొండాపురం ఎస్ఐ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల నుంచి వర్షం కురవడంతో ఇళ్ల మధ్య బురదమయమైందన్నారు. అక్కడే పశువులు కూడా కట్టేయడంతో మరింత రొచ్చుగా తయారైందన్నారు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందన్నారు. దీంతో లింగేశ్వర్రెడ్డి తలపై మచ్చుకొడవలితో సుధాకర్‌రెడ్డి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే అతన్ని అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
చెల్లని చెక్కు కేసులో ఆర్నెల్ల జైలు
ఖమ్మం లీగల్ : స్థానిక ద్వారకానగర్‌కు చెందిన జి.రవికుమార్‌కు చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సతీష్‌కుమార్ ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి రూ.1.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కవిరాజ్‌నగర్‌కు చెందిన గాజా రమేష్‌కుమార్ వద్ద రవికుమార్ తన కుటుంబ అవసరాల కోసం జనవరి 5, 2012న రూ.1.50 లక్షలు తీసుకుని ప్రాంసరీ నోటు రాసిచ్చాడు. అప్పు తీర్చమని అనేకసార్లు అడగ్గా.. జనవరి 20, 2013న రూ.1.50 లక్షలకు చెక్ ఇచ్చాడు. ఫిర్యాది ఆ చెక్కును తన ఖాతాలో జమ చేయగా.. అకౌంట్లో సరిపడినంత నగదు లేక చెక్కు నిరాదరణకు గురైంది. ఫిర్యాది చట్ట ప్రకారం లీగల్ నోటీసు పంపి.. కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైందని భావించి ముద్దాయికి 6 నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి నష్టపరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. ఫిర్యాదిదారు తరఫు న్యాయవాదిగా మందడపు శ్రీనివాసరావు వ్యవహరించారు. -
లాఫింగ్ క్రైమ్స్
చెవి కొరికి జైలుకెళ్లింది ఒకరు ‘కుక్కకూ’ పోస్టుమార్టం తప్పని వైనం హైటెక్ సిటీలోనూ పశువుల దొంగలు ‘జుట్టు కత్తిరింపు’ పైనా కేసు నమోదు ‘‘కుక్క మనిషిని కరిస్తే విషయం... మనిషి కుక్కను కరిస్తే విశేషం’’ రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం కూడా. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ క్రైమ్ కూడా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు పోలీసులక ఉత్పన్నమవుతుంటాయి. విధుల్లో భాగమనుకుంటూ ఇష్టంతో చేసినా... ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్ని ఒక్కసారి పరిశీలిస్తే... - సాక్షి, సిటీబ్యూరో కుక్కల కట్టడీ తప్పలేదు.. బోనాలు, గణేష్ వంటి పండుగలు వస్తున్నాయంటే పోలీసులు రౌడీషీటర్లు, అసాంఘికశక్తులతో పాటు అనుమానితుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. అయితే ఈసారి బక్రీద్ పండుగ నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు వీరితో పాటు గ్రామసింహాల (శునకాలు) పైనా కన్నేసి ఉంచారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పడే జంతు వ్యర్థాలను కుక్కలు తింటాయి. కొన్ని శునకాలు వాటిని లాక్కువెళ్లి కొంత భాగం తిని, మిగిలింది వదిలేస్తుంటాయి. అదే సమయంలో గణేష్ ఉత్సవాలు సైతం జరుగుతుండటంతో ఇలా శునకాలు జంతు వ్యర్థాలను ఆ మండపాల వద్దకు తీసుకువెళ్లి వదిలేసే ప్రమాదం ఉందని పోలీసులు భావించారు. అదే జరిగితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో కుక్కల్నీ కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పగబట్టి జుట్టు కత్తిరించింది... వ్యక్తిగత కక్షలు, పగలు, ప్రతీకారాల కోసం కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలతో పాటు ఆస్తుల ధ్వంసం, దగ్ధం తదితరాలు చేయడం నిత్యం జరుగుతూనే ఉంటాయి. సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్‌కు చెందిన పార్వతి మాత్రం... వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సినీ ఫక్కీలో దాడి చేసి శ్రీవల్లి అనే మహిళ జుట్టు కత్తిరించేసింది. పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి బైక్‌లపై శ్రీవల్లి ఇంటిపై దాడి చేసింది. పథకం ప్రకారం ముగ్గురు మహిళలూ ఆమె చేతులు గట్టిగా పట్టుకోగా... పార్వతి తన వెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుట్టు కత్తిరించేసింది. ‘పని’ పూర్తయ్యాక అంతే వేగంగా బైక్‌లపై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు దాడి, జుట్టు కత్తిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరుడికి పోలీసుల ‘ట్రీట్మెంట్’... అనేక కేసుల దర్యాప్తులో పోలీసులు అనుమానితులు, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటారు. నిజం చెప్పించడంతో పాటు రికవరీల కోసమూ వీరికి తమదైన శైలిలో ‘ట్రీట్మెంట్’ ఇస్తుంటారు. చిలకలగూడ పోలీసులకు మాత్రం ఓ చోరుడికి తమ పర్యవేక్షణలో ‘ఎనిమా ట్రీట్మెంట్’ ఇప్పించాల్సిన పరిస్థితి దాపురించింది. మైలార్‌గడ్డకు చెందిన ప్రమీల సీతాఫల్మండి రైల్వే ట్రాక్ పక్కన వాకింగ్ చేస్తుండగా వికాస్ అనే చోరుడు ఆమె మెడలోని గొలుసు స్నాచింగ్ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కిన అతగాడు ఆ గొలుసును మింగేశాడు. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు తమ పర్యవేక్షణలో ఎనిమా చికిత్స చేయించారు. ఎట్టకేలకు గొలుసు ‘బయటకు రావడం’తో ఊపిరిపీల్చుకుని నిందితుడిని జైలుకు పంపారు. ఇదో ‘భారీ’ దొంగల ముఠా... కేజీల బంగారం ఎత్తుకుపోలేదు... వందల సంఖ్యలో వజ్రాలూ దోచేయలేదు... రూ.కోట్లలో నగదునూ కొల్లగొట్టలేదు... అయినప్పటికీ ఆ గ్యాంగ్‌లోని వారు మాత్రం ‘భారీ’ చోరులుగానే రికార్డులకెక్కారు. షేక్ అబ్దుల్ కరీం, మహ్మద్ ముజాహిద్ ఏకంగా క్రేన్లు వినియోగించి భూగర్భంలో వేసే కేబుళ్లను చోరీ చేస్తూ సైదాబాద్ పోలీసులకు చిక్కారు. చార్మినార్, బంజారాహిల్స్, మాదాపూర్, సైదాబాద్ ప్రాంతాల్లో డీసీఎం వ్యాన్లలో సంచరిస్తూ కనిపించిన కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎంపిక చేసుకునే వారు. అదును చూసుకుని క్రేన్‌తో సహా వచ్చి వాటిని తస్కరించుకుపోయేవారు. సైదాబాద్ లక్మీనగర్ సబ్-స్టేషన్ పరిధిలో ఏకంగా 13 టన్నుల కేబుల్ వైర్ డ్రమ్ముల్ని ఎత్తుకుపోయారు. ఎట్టకేలకు సైదాబాద్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. పోలీసులు వీరి వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు అందుకు వినియోగించిన హైడ్రాలిక్ క్రేన్నూ స్వాధీనం చేసుకున్నారు. రెండో‘సారీ’... చోరీ... పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదనే విషయం ఆ దొంగకు బాగా తలకెక్కినట్లుంది. అయితే అతడి పశ్చాత్తాపంలోనూ ఓ చిన్న మెలిక ఉంది. నేరాలు మానడానికి బదులు ఆ ఇంటి వారికి ‘లిఖితపూర్వకంగా’ క్షమాపణలు చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బీఎన్‌రెడ్డి కాలనీలో వ్యాపారి ప్రదీప్ దంపతులు ఉంటున్నారు. అక్టోబర్‌లో వీరింట్లోకి జోరబడిన దొంగ బీరువాలోని విలువైన వస్తువులు ‘సర్దేశాడు’. వెళ్తూ వెళ్తూ గోడపై ‘సారీ’ అంటూ రాసిపోయాడు. నవంబర్‌లో మళ్లీ అదే ఇంట్లో చేతివాటం చూపించిన నేరగాడు మొదటిసారి రాసిన చోటే మళ్లీ ‘సారీ’ రాసి ఉడాయించాడు. చేతి రాతను సరిచూసిన పోలీసులు రెండు చోరీలు ఒకే దొంగ పనిగా తేల్చారు. ‘లైక్స్’ కోసం యత్నించి జైల్లో ‘ల్యాండ్’... పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి... అంటే ఇదేనేమో. ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన ఫజల్ షేక్ జూకు వెళ్లి, జంతువులకు అతి దగ్గరగా ఫొటోలు దిగాలని ఆశపడ్డాడు. వీటిని ఫేస్బుక్లో పెట్టి ఎక్కువ లైక్స్ పొందాలని ప్రయత్నించాడు. ఇతడు అనుసరించిన పంథా బెడిసికొట్టడంతో నేరుగా జైల్లో ‘ల్యాండ్’ అయ్యాడు. ఇతగాడు జంతువులకు దగ్గర నుంచి ఫొటోలు దిగటంతో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి తాబేళ్ల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఓ తాబేలు పైకి ఎక్కి నిల్చుని మరీ ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలతో గుర్తింపు పొందేందుకు వాటిని ఫేస్‌బుక్‌లోని అప్లోడ్ చేసి ‘బుక్కైపోయాడు’. ఇవి ఫేస్‌బుక్‌తో ఆగకుండా ఇతర సోషల్‌మీడియాలతో పాటు మీడియాలోనూ హల్చల్ చేయడంతో జూ అధికారులు బహదూర్‌పుర ఠాణా తలుపుతట్టారు. సీన్ కట్ చేస్తే ఫజల్ షేక్ జైలుకు చేరాడు. వేధింపుల కోసం ‘చోరీలు’... డబ్బు సంపాదించడానికో, అవసరాలు తీర్చుకోవడానికో సెల్ఫోన్లు చోరీ చేసే వాళ్లను తరచుగా చూస్తూనే ఉంటాం. బాలానగర్‌కు చెందిన బ్రహ్మయ్య నైజం దీనికి విరుద్ధం. భార్యపై ఉన్న కోపంతో మహిళల్ని వేధించడానికే ఇతడు సెల్ఫోన్లు చేరీ చేస్తూ చిక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇతగాడు ఫిరోజ్‌గూడలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలి మహిళలపై కక్ష కట్టాడు. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ... ఇళ్లల్లో సెల్ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించాడు. ఆ ఫోన్లలో ఉన్న మహిళల నెంబర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు. ఇలా రెచ్చిపోతున్న ఈ బ్రహ్మయ్య ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. -
ప్రేమ పేరుతో మోసగించిన ఒకరికి ఆర్నెళ్ల జైలు
నర్సంపేట : నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడినట్లు కొత్తగూడ ఎస్సై అరాఫత్ బుధవారం తెలిపారు. కొత్తగూడ వుండలం గాంధీనగర్‌కు చెందిన వుల్లెల కళావతిని నెల్లికుదురుకు చెందిన ఎర్రబోరుున మురళి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో సదరు మహిళ అప్పటి ఎస్సై సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయుగా 2012లో 417, 406, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అప్పటి ఎస్సై నర్సంపేట కోర్టులో చార్జిషీటు వేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కోర్టు కానిస్టేబుల్ స్వామినాయుక్ సకాలంలో ప్రవేశపెట్టగా పిటిషనర్ తరఫున ఏపీపీ వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న జడ్జి శ్రీదేవి వుురళీకి ఆరు నెలల జైలు శిక్ష లేదా 5 వేల జరివూనా విధించినట్లు తెలిపారు.