breaking news
carporetor
-
మొన్న స్కూటర్ల మీద.. నేడు ఆడి కార్లలో..
విజయవాడ: నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే కార్పొరేటర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టడం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మొన్నటిదాకా స్కూటర్లలో తిరిగిన కార్పొరేటర్లు ఇప్పుడు ఆడికార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన చంద్రబాబు.. పరిశ్రమలు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మోదీ నాలుగేళ్లుగా అన్యాయం చేస్తుంటే నోరుమెదపని సీఎం చంద్రబాబు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోదీని విమర్శిస్తూ, ధర్మపోరాటాలంటూ కొత్తనాటకాలకు తెరతీశారని విమర్శించారు. జనసేన కొత్త పార్టీ కాబట్టే ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. -
బరంపురంలో అలజడి
► కార్పొరేటర్ కొడుకు అరెస్ట్ ► నగరంలో సంచలనం సృష్టించిన సంఘటన బరంపురం: అర్ధరాత్రి ఆంధ్రా పోలీసులు బరంపురం వచ్చి మున్సిపాలిటీ కార్పొరేషన్ (బీఎంసీ) 36వ నంబర్ వార్డు కార్పొరేటర్ సీహెచ్. గంగాధర్ పాత్రో ఇంటిపై దాడి చేసి ఆయన కొడుకు సీహెచ్ అనమ్ పాత్రోను అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో కలకలం రేగింది. గురువారం అర్ధరాత్రి బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల లంజిపల్లికి హఠాత్తుగా రెండు వాహనాల్లో ఆంధ్ర పోలీసు బృందాలు వచ్చి కార్పొరేటర్ గంగాధర్ పాత్రో ఇంటిపై దాడి చేశాయి. ఆయన కొడుకు అనమ్ పాత్రోను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ గంగాధర్ పాత్రో పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో ఆయన తప్పుకున్నారు. అవసరం ఉన్నప్పుడు విచారణకు రావాలని కార్పొరేటర్ గంగాధర్ పాత్రోకు స్పష్టం చేసి అనమ్ పాత్రోను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అనమ్ పాత్రోను ఆంధ్ర పోలీసులు అరెస్టు చేసిన విషయంపై బరంపురం ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్‌ను ప్రశ్నించగా ఆంధ్ర పోలీసులు బరంపురం వచ్చినట్లు తమ దగ్గర సమాచారం లేదని చెప్పారు. అరెస్టు చేసిన ఆంధ్ర పోలీసు అధికారి ఒకరు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హత్యకేసు దర్యాప్తులో భాగంగా అరెస్ట్? కొద్ది నెలల క్రితం బరంపురం కళ్లికోట్ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతూ ఛత్రపూర్, పోలీస్ కాలనీలో నివాసం ఉంటున్న వివేకానంద పండా కుమార్తె తృప్తిమయి పండా కిడ్నాప్ అనంతరం హత్యకు గురైన కేసులో అనమ్ పాత్రోను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది అగస్టు 25వ తేదీన తృప్తిమయి పండా హత్యకు గురైన కేసుపై దర్యాప్తు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సోంపేట–బారువా మధ్య రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన మెట్టు భూమిలో హత్యకు గురైన గుర్తు తెలియని యువతిగా ఆంధ్ర పోలీసులు అప్పట్లో మృతదేహాన్ని స్వాధీన పర్చుకున్నారు. ఛత్రపూర్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు సొంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మృతదేహాన్ని చూసి గుర్తించారు. బరంపురం బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్లో కిడ్నాప్ కేసుగా నమోదవడం, అనంతరం సోంపేట పోలీసు స్టేషన్లో హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఒడిశా, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా తృప్తి మయి పండా పండా హత్య కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. నత్తనడకన దర్యాప్తు కానీ 8 నెలల తరువాత అర్ధరాత్రి ఆంధ్ర పోలీసులు బరంపురం వచ్చి గంగాధర్ పాత్రో ఇంటిపై దాడి చేసి అనమ్ పాత్రోతో పాటు కారు డ్రైవర్ కన్ను బాహ్మ, ఛత్రపూర్‌కు చెందిన మరో వ్యక్తిని తీసుకువెళ్లి శ్రీకాకుళం జిల్లా బారువ పోలీసు స్టేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం డ్రైవర్ కన్ను బ్రహ్మ, ఛత్రపూర్‌కు చెందిన మరో వ్యక్తిని విడిచిపెట్టి అనమ్ పాత్రోను అదుపులో ఉంచినట్లు సమాచారం. ఈ విషయంపై బారువ సీఐని ప్రశ్నించగా తాను సెలవులో ఉన్నట్లు బదులిచ్చారు. మరో ఎస్ఐ తనకేమీ తెలియదన్నారు. తృప్తిమయి పండా అపహరణ ఆపై హత్య జరిగిన 8 నెలలు కావస్తున్నా కేసు మిస్టరీ ఇంకా స్పష్టంగా వీడనట్లు తెలుస్తోంది. ఒక వైపు ఆంధ్ర పోలీసులు మరో వైపు ఒడిశా పోలీసులు చేస్తున్న తృప్తిమయి పండా అపహరణ, హత్య కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతున్నట్లు స్థానికంగా చర్చలు సాగుతున్నాయి.