breaking news
Cannabis crop
-
గంజాయిపై శాటిలైట్!
సాక్షి, హైదరాబాద్: ‘నిషా ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గంజాయితోపాటు డ్రగ్స్‌కు చెక్ చెప్పడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తరహాలో ఎడ్రిన్ మ్యాప్స్, మ్యాప్ డ్రగ్ యాప్ టెక్నాలజీని వాడుతోంది. వీటికి సంబంధించి టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ విధానంలో నలుగురు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మండలాలు తెలిసినా ప్రాంతాలపై అస్పష్టత తెలంగాణతోపాటు ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులతో (ఏఓబీ) పాటు విశాఖ ఏజెన్సీ నుంచే వస్తోంది. అక్కడి వ్యాపారులు వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తూ రైతులను ప్రలోభాలకు గురి చేసి గంజాయి పంట పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ఏజెన్సీలోని ఏఏ మండలాల్లో గంజాయి సాగు జరుగుతోందో పోలీసులకు తెలుసు.. కానీ ఏ ప్రాంతంలో ఉందో కచి్చతంగా తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఏజెన్సీతోపాటు ఏఓబీలో సైతం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో గంజాయి పంటను గుర్తించేందుకు కూంబింగ్ తరహా ఆపరేషన్స్ చేపట్టడానికి పోలీసులు సాహసం చేయలేకపోతున్నారు. ఇదే అదనుగా ఈ పంట పండించే వాళ్లు నానాటికీ విస్తరిస్తున్నారు.ఉపగ్రహ ఛాయా చిత్రాలతో స్పష్టతకొన్నేళ్లుగా గంజాయిపై రాష్ట్ర పోలీసు విభాగాలతోపాటు ఎన్సీబీ సైతం దృష్టి పెట్టింది. తక్కువ ధరకు తేలిగ్గా లభిస్తూ వేగంగా విస్తరిస్తున్న ఈ మాదకద్రవ్యం పండించడం, విక్రయించడం, రవాణా, వినియోగం తదితరాలు లేకుండా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో గంజాయి పంటను గుర్తించేందుకు శాటిలైట్ సాంకేతికత వాడకం ప్రధానమైంది. దీనికోసం ఎన్సీబీ అధికారులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎడ్రిన్) సహాయం తీసుకుంటున్నారు.ఎడ్రిన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం... గంజాయి పండించే ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఎన్సీబీకి ఇస్తుంది. వీటిని విశ్లేషించే అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు, పరిపాలన విభాగాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీజీ ఏఎన్‌బీ కూడా ఇదే మాదిరిగా చేయడంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలో ప్రత్యేక సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుంది.మ్యాప్ డ్రగ్‌తో మరింత సమన్వయం మాదకద్రవ్యాలను ఓ ప్రాంతంలో తయారు చేయడం, పంపడం జరిగితే... అవి ఒక ప్రాంతం మీదుగా ఇంకోచోటుకు చేరి అక్కడ వినియోగం అవుతుంటాయి. ఏజెన్సీలో గంజాయి, హష్ ఆయిల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో నల్లమందు, మరికొన్ని చోట్ల ఎఫిడ్రిన్... ఇలా తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ విదేశాల నుంచి అక్రమ రవాణా అయి, గోవా, బెంగళూరు, ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి.ఈ నేపథ్యంలోనే గంజాయితోపాటు ఇతర డ్రగ్స్ కట్టడికి సమన్వయం చాలా కీలకం. ఏఏ ప్రాంతాల్లో ఏ డ్రగ్స్ ఉంటున్నాయి? ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఏ మార్గాల్లో రవాణా అవుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుంటేనే సమన్వయం సాధ్యం. దీనికోసం మ్యాప్ డ్రగ్ పేరుతో ఎన్సీబీ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్‌ను అధికారికంగా వినియోగించుకోవడానికి టీజీ ఏఎన్‌బీకి అనుమతి ఇచ్చింది. దీని వినియోగంపై అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది. -
గంజాయి పంట ధ్వంసం
కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్ గ్రామాల్లో గిరిజనులు బుధవారం 40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్ఐలు లోకేష్‌కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్‌కుమార్ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. -
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
రూ.కోటి విలువ చేసే గంజాయి పంట ధ్వంసం
మెదక్: మెదక్ జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును గురువారం పోలీసులు రట్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ కథనం ప్రకారం.. రేగోడ్ మండలం సిందోల్లో ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి తన ఎకరన్నర చేనులో గంజాయి పంటను సాగు చేస్తున్నాడు. పొలంలో ఐదువేల మొక్కల్లో కొంత పంటను కోసి ఆరబెట్టాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కోతకు వచ్చిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పంట విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.