breaking news
call off strike
-
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లు దిగివచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, కన్వినర్ రవీందర్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సమక్షంలో వెల్లడించారు. వచ్చే నెలలోగా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో.. డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు తదితర 22 డిమాండ్ల కోసం డీలర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో అదే నెల 22న మంత్రి కమలాకర్ డీలర్ల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. 22 డిమాండ్లలో 20 డిమాండ్లు పరిష్కరించేందుకు మంత్రి కమలాకర్ పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ సమక్షంలో హామీ ఇచ్చారు. ప్రధాన డిమాండ్లు అయిన కమీషన్ పెంపు, గౌరవ వేతనం అమలు అంశాలు ముఖ్యమంత్రి పరిధిలోనివని మంత్రి సర్ది చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్లు డీలర్ల సంఘం నాయకులు ప్రకటించారు. కానీ ఆకస్మికంగా సోమవారం నుంచి రాష్ట్రంలోని 17,284 రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల మంగళవారం డీలర్ల జేఏసీ నాయకులు నాయికోటి రాజు, రవీందర్, మల్లికార్జున్ గౌడ్, అనంతయ్య, పుస్తె శ్రీకాంత్ తదితరులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల తరువాత సమావేశం ముగియగా, చర్చలు సఫలమైనట్లు డీలర్లు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల డిమాండ్ల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి సూచనల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు మంత్రి కమలాకర్ సమక్షంలోనే ప్రకటించారు. జూలై లోపు తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని, గౌరవ వేతనం, ఇన్సూరెన్స్ అంశాలు ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సమ్మెను విరమించి, రేషన్ దుకాణాలు తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు. డీలర్లకు గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం: గంగుల గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. డీలర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, జాయింట్ కమిషనర్ ఉషారాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సిమాంధ్రుల భద్రతకు హామీ ఇస్తున్నాం-జానారెడ్డి
-
ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలి:జానారెడ్డి
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవో సంఘం చేపట్టిన సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట మంత్రి కే.జానారెడ్డి ఆ సంఘం నేతలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయనతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు మంత్రుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి ప్రసంగిస్తూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండు కుటుంబాలుగా విడిపోయి అభివృద్ది చెందుదామని ఆయన సీమాంధ్ర ప్రజలకు సూచించారు. కొత్త రాష్ట్రం అభివృద్దికి తాము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరంలో నివసించే సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలంగాణ ప్రజాప్రతినిధుల తరపున ఆయన హామీ ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా ఏటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకున్న ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట విభజనకు సహకరించాలని జానారెడ్డి ఈ సందర్భంగా సీమాంధ్ర నేతులను కోరారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీని కలసి వివరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డి.శ్రీధర్ బాబు, డీ.కే.అరుణ, సుదర్శనరెడ్డిలు ఆ సమావేశంలో పాల్గొన్నారు.