మనుషుల్ని చూడగానే...
కవిత్వం
మనుషుల్ని చూడగానే వారి కళ్లలో
కొలనులో చలించే ప్రతిబింబాల్లాంటి కలలు కనిపిస్తాయి
కలల వెనకాల ఉండీలేనట్లు మెరుస్తూ
జీవితం తన పట్ల తాను చూపే లాలస కనిపిస్తుంది
వారిని తాకబోయినపుడల్లా
వాళ్ల వ్యక్తిత్వాలని పట్టించుకోకుండా
వాటి లోపల వెలుగుతున్న జీవన సౌందర్యాన్ని చూస్తావు
‘ఏమిటలా చూస్తున్నావు ఆశ్చర్యంగా’ అని
వారు అన్నప్పుడల్లా
‘మన జీవితాలన్నీ ఒకే జీవితమై కనిపిస్తోంది
మీరూ ఇలా చూడగలిగితే ఎంత బావుండున’ని జవాబిస్తావు
విత్తనాన్ని నీ అరచేతులలోకి తీసుకొన్నపుడే
దాని చిటారుకొమ్మన వికసించే పూలపై తేలే పరిమళాలు
చిరుగాలితో చెప్పబోయే కబుర్లు నీకు వినిపిస్తాయి సరే కాని
కాస్త ఆగు, కాలాన్ని ప్రవహించనీ
ప్రతి అలనూ తానుగా సముద్రంలోకి మేలుకోనీ
ప్రతి జీవితాన్నీ ఏకైక మసాస్పందనలో కరగనీ అని
నీకు నువ్వు బోధించుకొంటూనే ఉంటావు కదూ
- బి.వి.వి.ప్రసాద్ 9032075415