breaking news
bus driver died
-
ఘోరం: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రన్నింగ్ బస్సులో డ్రైవర్ గుండె పోటుతో సీటులోనే కన్నుమూశాడు. ఆపై బస్సు పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జబల్పూర్లో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవర్ సీటులోనే కన్నుమూశాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. సిగ్నల్ ప్రాంతం కావడం, బస్సు వేగం తక్కువగా ఉండడం, సిగ్నల్ దగ్గర ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టడంతో బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది. బస్సు ప్రయాణికులతో పాటు ఈ-రిక్షా బోల్తా పడగా.. అందులోని ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సు ఢీ కొట్టడంతో ఓ పెద్దాయన గాయపడగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ హర్దేవ్ పటేల్ గత పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు సర్వీసుకు పని చేస్తున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. CAUGHT ON CAMERA - A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV — TIMES NOW (@TimesNow) December 2, 2022 VIDEO CREDITS: TIMES NOW -
తాను కరిగి.. స్టీరింగ్‌పై ఒరిగి..
సమయం సోమవారం వేకువజాము 2.50 గంటలు.. టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప ప్రాంతం.. ఒడిశా రాష్ట్రం డమన్‌జోడి నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్న కుదుపుతో ఆగింది.. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు.. బస్సు తుప్పల్లో ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు డ్రైవర్ వద్దకు వెళ్లిన వారు నిశ్చేష్టులయ్యారు. స్టీరింగ్‌పై తలపెట్టి డ్రైవర్ విగత జీవిగా ఉన్నాడు.. సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : కొవ్వొత్తి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది.. ఆ డ్రైవర్ గుండెపోటుతో ఒరిగిపోతున్నా 26మందిని రక్షించాడు.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా బస్సును నడుపుతూ ఎంతోమందిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేవాడతను. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా బాధ్యతను మరచిపోలేదు... బస్సును సురక్షితంగా పక్కన నిలిపాడు. ఆపద్బాంధవుడిలా 25మంది ప్రయాణికులను, తోటి డ్రైవర్‌ను కాపాడాడు. ఉలిక్కిపడి లేచి ఈ విషయం తెలుసుకున్న పాసింజర్లు కన్నీటిపర్యంతమయ్యారు. డమన్జోడిలో బస్సు ఆది వారం రాత్రి 10 గంటలకు బయలు దేరింది. ఇద్దరు డ్రైవర్లు ఉన్న ఈ బస్సును ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా కుంపుపొడ గ్రామానికి చెందిన జోగేందర్ శెట్టి (52) అనే డ్రైవర్ నడుపుతున్నారు. రాత్రి 2.50 గంటల సమయంలో టెక్కలి సమీపంలో అక్కవరం గ్రామ సమీపంలో గుండెపోటు రావడంతో.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగకూడదని భావించి బస్సును ఎంతో చాకచక్యంగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నిలిపివేశాడు. తుప్పల్లో హఠాత్తుగా బస్సు ఆగడంతో విషయం తెలియని పాసింజర్లు ఏం జరిగిందని అడిగేందుకు డ్రైవర్ వద్దకు వెళ్లగా.. స్టీరింగ్‌పై తలపెట్టి ప్రాణాలు కోల్పోయి ఉన్నా డు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడి తాను ప్రాణం విడిచాడని గుర్తించి హతాశులయ్యారు. జాతీయ రహదారి విభాగం హైవే పెట్రోలింగ్ అధికారులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.నిలయ్య, ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని గమనించి బస్సు యజమానికి సమాచారం చేరవేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న 25మంది ప్రయాణికులను అదే ట్రావెల్‌కు చెందిన మరో బస్సులో పంపించేశారు. డ్రైవర్ మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాలు పోతున్నా డ్రైవర్ చూపినచొరవ.. అతని అప్రమత్తత వల్ల తమం తా క్షేమంగా ఉండడం ప్రయాణికులను కదిలించింది. -
నిశ్చితార్థం ఇంట చావు మెతుకులు పెడతారా?
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సింహాచలం ఆర్టీసీ డిపో కార్మికుల ఆగ్రహావేశాలతో అట్టుడికింది. డిపో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సుమారు 110కి పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బాధిత కుటుం బం రోదనలు మిన్నంటాయి. నాగేశ్వరరావు ఆత్మహత్య సం ఘటన ఆయన కుటుంబంలోనే కాదు.. కార్మికుల్లో కల్లోలం రేపింది. ఇంటికి వెలుగుని కోల్పోయిన దుఃఖంలో కుటుంబం రోడ్డున పడితే.. ఆ కష్టం మరే కుటుంబానికీ రాకూడదని డిపో కార్మికులంతా ఆ గుండె పగిలే బాధ తామంతా పడుతున్నామని చెబుతూ శనివారం వేకువజాము నుంచి డిపో మొత్తంగా బస్సులు ఆపేశారు. నాగేశ్వరరావు భార్యాపిల్లలు, బంధువుల రోదనలు.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికుల ఆందోళనలతో డిపోలో వాతావరణం వేడిక్కింది. ఇలాంటి ఆందోళన ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా జరిగింది. డిపోలో మిన్నంటిన రోదనలు తెల్లారేసరికి బస్సుల హారన్లతో సందడిగా కనిపించాల్సిన సిం హాచలం ఆర్టీసీ డిపో రోదనలతో నిండిపోయింది. వేకువజా మున బస్సులు కదలాల్సిన సమయానికి నాగేశ్వరరావు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు, పెద్ద సంఖ్యలో బంధువులతో డిపోకు చేరుకుని గేటు వద్ద భైఠాయించారు. వారి రోదనలతో డిపో శోకసంద్రమైపోయింది. బస్సులతో వెళ్లాల్సిన డ్రైవర్లు, కండక్టర్ల గుండెలు బరువెక్కిపోయాయి. యూనియన్లు, వర్గాలకు అతీతంగా నిరసన చెబుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. నాగేశ్వరరావు భార్యా పిల్లలకు సంఘీభావంగా నిలిచారు. మూకుమ్మడి బంద్‌తో నివ్వెరపోయిన పోలీసులు అసలే శనివారం.. అందులోనూ యాత్రికుల తాకిడి.. ఇక్కడి నుంచి కదలాల్సిన బస్సులు 110 పైగానే. ఈ బస్సులన్నీ వేకువజాము నుంచే నిలిచిపోయాయని తెలిసి గోపాలపట్నం సీఐ పైడియ్య, ఎయిర్‌పోర్టు జోన్ సీఐ మళ్ల శేషు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ, ఎస్ఐలు తమ్మినాయుడు, జి.డి.బాబు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో సహాయ పోలీసు కమిషనర్ అర్జున్ చేరుకున్నారు. కార్మికులకు నచ్చజెప్పి గేటు నుంచి పంపే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు కుటుంబానికి న్యా యం జరిగే వరకూ ఇక్కడి నుంచి బస్సులను తీయలేమని డ్రైవర్లు, కండక్టర్లు భీష్మించారు. మూకుమ్మడి బంద్‌తో పోలీ సులు నివ్వెరపోయారు. దీంతో ఏసీపీ అర్జున్.. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కార్మికుల ఆందోళనతో సాయంత్రం 6 గంటల వరకూ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో సింహాచలం వెళ్లే యాత్రికులు, భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆటోలే దిక్కయ్యాయి. లిఖిత పూర్వక హామీ కోసం పట్టు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చి బస్సులను నడిపించాలని ఆర్ఎం సుధేష్‌కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీపీఎం నేత బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో కార్మికులంతా లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబట్టారు. మీడియా ముందు చెబుతున్నా నమ్మరా.. అంటూ ఆర్ఎం విజ్ఞప్తి చేస్తే.. మీరూ రాజకీయనేతలా హామీలిస్తే విలు వేముందంటూ కార్మికులు ప్రశ్నించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ చర్చలు జరిపి ఎట్టకేలకు ఆర్ఎం లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. నాగేశ్వరరావుకు రావాల్సిన పరిహారాలను మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తామని, ఆయన కుమారుని విద్యార్హతను బట్టి తాత్కాలికంగా అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తామని.. తదుపరి రెగ్యులర్ పోస్టు ఇప్పిస్తామని, పెన్షన్, బెనిఫిట్లు రెండు నెలల్లో సెటిల్ చేస్తామని ఆర్ఎం తన సంతకంతో ఉన్న లేఖ రాసిచ్చారు. నేతల నిర్వాకంపై కార్మికుల ఆగ్రహం సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో కొందరు నేతల వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎం డిపోకు వచ్చాక పలువురు తీరు మారిపోయింది. అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్ఎం కోరిక మేరకు వెళ్లిపోవాలని పలువురు చెబుతుంటే.. లిఖిత హామీ ఎందుకు.. మాటిచ్చారు కదా.. పదండిపోదాం.. అంటూ కదిలించే ప్రయత్నాలు చేయడంతో కార్మికులంతా గ్రహించి, ఆ నాయకులకు వారంతా చీవాట్లు పెట్టారు. మాకు దిక్కెవరు? ► నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదు ►నిశ్చితార్థం భోజనాలు తినాల్సిన ఇంట చావు మెతుకులు పెడతారా? ►రీజినల్ మేనేజర్, ఏసీపీల ఎదుట ►నాగేశ్వరరావు భార్య అమ్మాజీ రోదన ‘నా కుమారుడి నిశ్చితార్థం భోజనాలు శనివారం పెడతానని బంధులతో చెప్పి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిన తన భర్తను శవంగా పంపి.. తమకు చావుమెతుకులు పెడతారా?.. నా భర్త పది మందికి సాయపడే ధైర్యవంతుడు.. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు.. అన్యాయం జరిగిపోయిందయ్యా..’అంటూ ఏసీపీ అర్జున్, ఆర్టీసీ ఆర్ఎం సుధేష్కుమార్ల వద్ద చింతా నాగేశ్వరరావు భార్య అమ్మాజీ గుండెలవిసేలా రోదించింది. సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో తొలుత ఏసీపీ అర్జున్ ఆమెను పరామర్శించారు. తర్వాత వచ్చిన ఆర్ఎం ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది. రోజూ తన ఎదురుచూసుకునే డ్యూటీకి వెళ్లే భర్త రాత్రయినా రాకపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందానని.. కుటుంబానికి దిక్కయిన డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుమిలిపోయింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరని విలపించింది. నాగేశ్వరరావు చేసుకుంది ఆత్మహత్య కాదని.. మానసికంగా వేధించి మరణానికి కారణమయ్యారని బంధువులు, సీఐటీయూ నేత శీర రమణ ఆరోపించారు. దీనిపై ఆర్ఎం స్పందిస్తూ మంచి ఉద్యోగిని కోల్పోవడం తమకూ బాధగా ఉందని, తన వంతు బాధ్యతగా నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విచారణ జరుపుతాం : అర్జున్, ఏసీపీ ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతామని ఏసీపీ అర్జున్ తెలిపారు. ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జరిగిన ఘటనలో నాగేశ్వరరావు చేతిపై రాత, డిపోలో సంఘటన జరగడం వంటి పరిణామాలను పరిగణిస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్(డీఎం)ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు బంధువులు చేసిన డిమాండ్‌పై స్పందించారు. ఇక్కడ విచారణలో సందేహాలు వద్దని చెప్పడానికే మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసుకు సంబంధించిన ఏసీపీ ప్రవీణ్‌కుమార్ కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నారని తెలిపారు. డీఎం వేధింపులు భరించలేకపోతున్నాం.. సింహాచలం డిపో మేనేజర్, స్క్వాడ్ల తీరుపై ఆర్ఎంకు ఫిర్యాదు సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో అలా ఒత్తిడికి గురైన కండక్టర్లు, డ్రైవర్లు ఆర్ఎం సుధేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ దివ్య తీరును భరించలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. స్క్వాడ్ల పేరిట అధికారులు ప్రయాణికుల ఎదుట తీవ్రంగా అవమానిస్తున్నారని, మహిళా కండక్టర్లని కూడా చూడకుండా కుంగిపోయేలా వారి చర్యలు ఉంటున్నాయని ఆవేదన చెందారు. గతంలో ఇదే డిపోకు చెందిన డ్రైవర్ ఆర్పీ నాయుడు గాజువాకలో లారీ ట్రాలర్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇప్పుడు నాగేశ్వరరావు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఇలా అనేక మంది వారికి జరిగిన అవమానాలను ఆయనకు వివరించారు. పలువురి బాధితుల మాటల్లోనే.. మెడకు బోర్డు తగిలించి తిప్పారు నేను 28కే బస్ నడుపుతున్న సమయంలో 104 జంక్షన్ వద్ద రిక్వెస్టు స్టాప్‌లో విపరీతమైన రద్దీగా ఉండడం వల్ల ఆపలేదు. అక్కడ ఆ బస్సుకు స్టాప్ నిర్ణయించలేదు కూడా. బస్సు ఆపలేదని డీఎంకు ఎవరో ఫోన్ చేసి చెబితే నేను రెస్ట్ ఆఫ్‌లో ఉన్న రోజున డిపోకి పిలిచి మరీ నా మెడలో బోర్డు తగిలించారు. అలా ఎక్కడైతే బస్సు ఆపలేదో అక్కడ అందరినీ క్షమాపణ కోరుతూ డ్రైవర్లకు కనిపించేలా తిరగాలని ఆదేశించారు. ఆ రోజంతా అలా బోర్డు తగిలించుకుని అవమానంతో బాధపడ్డాను. – ఎం.ఎన్.రావు, డ్రైవర్ బస్సెక్కినా వేధింపులే.. బస్సులో ప్రయాణికులతో ఎంత జాగ్రత్తగా ఉండాలని అత్రుతగా ఉంటాం. అలాంటి తరుణంలో ఎవరో ప్రయాణికుల నుంచి వాట్సప్ ఫిర్యా దు వచ్చిందని డ్యూటీలో ఉండగానే ఫోన్ చేసి డీఎం వేధిస్తుంటారు. ఇలా ఒత్తిళ్ల వల్లే కేపీ నాయుడు, నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. – వల్లీ, కండక్టర్ ప్రయాణికుల ఇళ్లకు పంపుతున్నారు.. బస్సులో చిల్లర సమస్య అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో చిల్లర లేదని డ్యూ రాస్తే బస్సు దిగినప్పుడు ప్రయాణికులు మరచిపోయి డీఎంకు ఫోన్ చేస్తే వారి ఇళ్లకు వెళ్లి డ్యూ ఇచ్చేసి రమ్మని ఆదేశిస్తున్నారు. మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. ఇలా అయితే ఎలా?. – భవానీ, కండక్టర్ ఇంక్రిమెంట్ కట్ చేశారు.. నేవీ డే నాడు ట్రిప్‌లు పెంచారు. మరుసరి రోజు రాత్రి 12 గం టల వరకూ పని చేయలేనని చెబితే డీఎం అర్థం చేసుకోలేదు. ఓరోజు రెండు టికెట్లు మిస్సయ్యాయన్న కారణంతో మెమో ఇవ్వకుండా ఇంక్రిమెంట్ కట్ చేసేశారు. – బీవీ లక్ష్మి, కండక్టర్ బ్యాగులు చింపి మరీ తనిఖీలా.. స్క్వాడ్ అధికారులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కండక్టర్లేదో డబ్బులు వెనకేసుకుంటున్నారన్న అనుమానాలతో మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. చేతిలో ఉన్న బ్యాగుల అరలను చింపేసి మరీ ప్రయాణికుల ముందు తనిఖీలు చేస్తున్నారు. నేను అలా అవమాన భారం పడ్డాను. – బి.ఎస్.రత్నం, కండక్టర్ -
ఇదేనా శవ మర్యాద?
అన్నవరం (ప్రత్తిపాడు): అనాథ శవానికైనా నలుగురు ఖర్చులు భరించి అంత్యక్రియలు చేసే సంస్కృతి మనది. కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది. సత్యదేవుని ఆలయానికి భక్తులను తీసుకువచ్చిన ఓ టూరిస్ట్ బస్ డ్రైవర్ గుండెనొప్పితో చనిపోతే ఆ శవాన్ని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రిలో ఆరుబయట ఎండలో పడేశారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆ మృతదేహం ఎండకు ఎండుతూ ఉంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఇదేమి అన్యాయం? అని ప్రశ్నిస్తే అప్పుడు ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఆ శవాన్ని నీడకు తరలించారు. కొంత సేపటికి, మృతిచెందిన డైవర్ తరఫువారు అంబులెన్స్‌లో ఆ డ్రైవర్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండకు తీసుకువెళ్లారు. దేవస్థానం శానిటరీ, ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా నందవరం మండలం కనికివేడు పాడు, ఎమ్మిగనూర్ మండలానికి చెందిన 90 మంది భక్తులు రెండు టూరిస్ట్ బస్సులలో కాశీ తీర్థయాత్రకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. వీరందరూ రాత్రి బస్సులతో నిద్రించారు. అయితే ఏపీ02 టీబీ 9799 బస్ డ్రైవర్ జి.కృష్ణ (60) మాత్రం ఆరుబయట నిద్రించాడు. తెల్లవార జాము ఐదు గంటలకు అందరూ లేచి స్నానాలు చేసి స్వామి దర్శనానికి వెళ్లేందుకు సమాయత్తమవుతుండగా డ్రైవర్ మాత్రం లేవలేదు. కొందరు అతడిని లేపడానికి ప్రయత్నించగా చలనం లేకపోవడం, నోటినుంచి, మెడ నుంచి రక్తం వస్తుండడం గమనించి మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తం చేసి వెంటనే దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. సెక్యూరిటీ, ప్రైవేట్ శానిటరీ సిబ్బంది ఒక వ్యాన్‌లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని ఆసుపత్రి లోపలకు తీసుకురావద్దని, బయట ఉంచాలని ఆసుపత్రి నర్స్, అటెండర్ చెప్పడంతో ఆ మృతదేహాన్ని ఆసుపత్రి భవనం పక్కన గల ఖాళీస్థలంలో వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. అయితే తమను అడగలేదని, వ్యాన్‌లో మొక్కలు తెచ్చారేమో అని అనుకుని దూరంగా దింపమని చెప్పానని నర్స్ సరోజినీ తెలిపారు. ఏమైందో తెలియదు కాని ఆ మృతదేహం మ«ధ్యాçహ్నం 12.30 గంటల వరకు అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో నీడలోకి ఆ శవాన్ని మార్చారు. కొంతసేపటికి మృతి చెందిన డ్రైవర్ తాలుకు వారు వచ్చి అంబులెన్స్‌లో ఆ శవాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ తీసుకువెళ్లారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లా : డాక్టర్ రామారావు ‘‘నేను ఉదయం 9.30 గంటలకు ఆసుపత్రికి వచ్చేటప్పటికే ఆ శవం అక్కడ ఉంది. అలా బయట ఉండకూడదని చెప్పి నేను, ఫార్మసీ సూపర్వైజర్ మా«ధవి కలసి దేవస్థానం అధికారులకు, ఈఓ పేషీకి ఫోన్ చేసి చెప్పాం. తరువాత ఈఓను కొండమీద కలిసి వివరించాం. ఈఓ కూడా వెంటనే ఆ డ్రైవర్ స్వగ్రామానికి దేవస్థానం ఖర్చుతో ఆ శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అదే విషయం శవాన్ని తీసుకువచ్చిన వారికి చెప్పగా పోలీస్ క్లియరెన్స్ వచ్చాక తీసుకుపోతామని చెప్పారు.’’ అని డాక్టర్ రామారావు ‘సాక్షి’కివివరించారు. -
గుంటూరులో విషాదం.
-
రోడ్డుప్రమాదంలో కావేరి ట్రావెల్స్ డ్రైవర్ మృతి
ఉలవపాడు : ప్రకాశం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. విశాఖపట్టణం నుంచి తిరుపతికి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామ శివార్లలో ముందు వెళుతున్న గ్రానైట్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజు సీటులో ఇరుక్కుని గంటపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. బస్సులోని 31 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారం ద్వారా బయటికి దిగారు. ప్రయాణికులను మరో బస్సులో తిరుపతి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ రాజును ప్రాణాలతో బయటికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.