breaking news
bramhaputra
-
అస్సాంలో వరదలు..104 మంది మృతి
గువహటి : అస్సాంలో వరదల ఉదృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ర్టంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 104కు చేరుకుంది. వీరిలో కొండచరియలు విరిగపడి 26 మంది చనిపోయారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ర్టంలోని 33 జిల్లాలకు గానూ 28 జిల్లాల్లో వరద భీభత్సం సృష్టిస్తోంది. దీంతో దాదాపు 40 లక్షలమంది నిరాశ్రయులు అయ్యారు. రోజురోజుకు పెరుగుతున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 1.3 లక్షల హెక్టార్ల పంట నాశనమైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉందని అస్సాం స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ)దృవీకరించింది. (శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...) ఇప్పటివరకు 303 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు సుమారు 50 వేల మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించి నిత్యవసరాలను అందిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మపుత్రా నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాలన్నీ నీటమునిగాయి. ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి . వరద బాధితుల కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 445 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (భారత్‌కు రూ.10 లక్షల కోట్ల నష్టం!) Assam: Villages in Dibrugarh flooded after the water level of Brahmaputra river rises following incessant rainfall in the region; normal life disrupted. pic.twitter.com/D0T53SkTk3 — ANI (@ANI) July 17, 2020 -
బ్రహ్మపుత్ర ఉగ్రరూపం
దేశంలో చాలా ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఈశాన్య భారతంలోని అస్సాం వరదనీటిలో తేలియాడుతోంది. 33 జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు వారంరోజులుగా ఇళ్లూ వాకిళ్లూ వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 50మంది పౌరులు మరణించారు. వందలాది పశువులు, వన్యప్రాణులు వరద తాకిడికి చనిపోయాయి. భారీయెత్తున పంటలు, జనావాసాలు నాశనమయ్యాయి. ఒకపక్క ఈ నెల 31తో గడువు ముగిసిపోయే జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) గురించి అక్కడి జనం ఆదుర్దా పడుతుంటే పులి మీద పుట్రలా ఈ వరద సమస్య వారిని చుట్టుముట్టింది. జనాభాలో 40లక్షలమందిని విదేశీయులుగా నిర్ధారించి నిర్బంధ శిబిరాలకు తరలించగా వారిలో అనేకులు ఈ వరదలు తెచ్చిన అంటువ్యాధుల బారినపడి తల్లడిల్లుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు ఇళ్లు వదిలి రావడానికి భయపడుతున్నారు. తమ గుర్తింపు పత్రాలతో పునరావాస కేంద్రాలకెళ్తే అక్కడ గల్లంతవుతాయన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. అవి పోగొట్టుకుంటే శాశ్వతంగా అస్సాం వదిలిపోవాల్సి వస్తుందన్నది వారి కలవరపాటుకు కారణం. ప్రపంచంలోని అయిదు పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొంది చైనా, భారత్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల మీదుగా ప్రవహించే బ్రహ్మపుత్ర సాధారణ సమయాల్లో ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి దాని ఉగ్రరూపం బయటపడుతుంది. ఏటా జూన్–అక్టోబర్ నెలల మధ్య ఒకసారి కాదు... మూడుసార్లు అస్సాంను అది ముంచెత్తుతుంది. ప్రతిసారీ విలయం సృష్టిస్తుంది. దేశంలో వేరేచోట్ల వరదలు ముంచెత్తినప్పుడు మీడియాతోసహా అందరూ వాటి గురించే చర్చిస్తారని, ఈశాన్య ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ పట్టదని మొదటినుంచీ విమర్శలున్నాయి. ఇప్పుడు అస్సాంను ముంచెత్తిన వరదల సందర్భంలోనూ అది బాహాటంగా బయటపడుతోంది. జనం పట్టించుకున్న సమస్యల విషయంలో వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా ఏదోమేరకు చర్యలుంటాయి. కానీ ఎవరికీ పట్టనప్పుడు ఏమవుతుందో చూడాలంటే అస్సాం వర్తమాన పరిస్థితులను గమనించాలి. టిబెట్ ప్రాంతంలోని కైలాస శిఖరాల్లో పుట్టి ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రాంతంలో ప్రవహించాక అస్సాంలోనే అది మైదాన ప్రాంతంలోకి అడుగుపెడుతుంది. పెను వేగంతో ప్రవహించే నదులన్నీ ఒండ్రుమట్టినీ, బురదనూ వెంటేసుకురావడం సర్వసాధారణం. కానీ బ్రహ్మపుత్ర మోసుకొచ్చే బురద నీరు, ఒండ్రుమట్టి పరిమాణం అసాధారణమైనది. అదంతా ఎక్కడిక్కడ మేట వేయడం వల్ల క్రమేపీ పూడిక పెరిగిపోయి ఆ నదికి, దాని కాల్వలకూ ఉండే గట్లు తెగిపడతాయి. ఆ ప్రాంతంలో తరచు వచ్చే భూకంపాల వల్ల కొండ చరియలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులేర్పడతాయి. ఈ కారణాలన్నిటివల్లా నదీ గమనమే మారుతుంటుంది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రహ్మపుత్రలో నౌకల రాకపోకలు సాగేవంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి దానికి భిన్నం. బ్రహ్మపుత్ర వల్ల భూమి కోతకు గురై 1954 తర్వాత 3,800 చదరపు కిలోమీటర్ల వ్యవసాయ క్షేత్రం నాశనమైందని నాలుగేళ్లక్రితం అస్సాం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక తెలిపింది. కరకట్టల నిర్మాణంతో ఈ వరదలను ఎంతో కొంత నివారించాలని, నష్టాన్ని పరిమితం చేయాలని అడపాదడపా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. ఆ కరకట్టల పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడెక్కడ గండ్లు పడే ప్రమాదం ఉందో సకాలంలో గుర్తించి సరిచేస్తేనే అవి నిలబడతాయి. గతంలో నిర్మించిన చాలా కరకట్టల స్థితిగతుల్ని సరిగా పట్టించుకోక పోవడం వల్లనే ఇంత నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారు. అడవులు విచ్చలవిడిగా నరకడం, కొండలు పిండి చేయడం, చిత్తడి నేలలు పూడ్చడం వంటి చర్యల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయంటున్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ప్రమాదకర పోకడల్ని అరికట్టే ప్రయత్నాలుండటం లేదు. బ్రహ్మపుత్ర నదిలో పూడిక తీసే పనులు భారీయెత్తున కొనసాగించి, దాన్నంతటినీ నదికి ఇరువైపులా గట్ల నిర్మాణానికి వినియోగిస్తామని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ రెండేళ్లక్రితం చెప్పారు. కానీ అందువల్ల కాస్తయినా ప్రయోజం చేకూరదు సరిగదా... భారీ వ్యయమవుతుందని నిపుణులు హెచ్చరించారు. ఏటా కోట్లాది రూపాయలు అందుకోసం వెచ్చించినా బ్రహ్మపుత్రలో పూడిక పెరగడాన్ని నిలువరించడం అసాధ్యమని వారి వాదన. నదిపై ఆనకట్టలు నిర్మిస్తే రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ చేయొచ్చునని మూడు దశాబ్దాలక్రితం కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలోని బ్రహ్మపుత్ర బోర్డు భావించింది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా రూపకల్పన చేస్తే అటు జలవిద్యుత్ ఉత్పత్తికి సైతం దోహదపడుతుందని అంచనా వేసింది. ఆ ప్రాజెక్టు పనులు మొదలైన కొన్నాళ్లకే అరుణాచల్ ప్రదేశ్ అభ్యంతరాలు లేవనెత్తడంతో విరమించుకుంది. తమ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో సహా విస్తారమైన ప్రాంతం దీనివల్ల ముంపునకు గురవుతుందని అరుణాచల్ వాదించింది. ప్రాజెక్టుల నిర్మాణం సరికాదనే పర్యావరణవేత్తల అభ్యంతరాల సంగతలా ఉంచి బ్రహ్మపుత్ర వంటి అతి పెద్ద నది భారీమొత్తంలో తీసుకొచ్చే ఒండ్రుమట్టి, బురదనీరు ఆ ప్రాజెక్టును దీర్ఘకాలం మన్నికగా ఉండనీయడం కూడా కష్టం. అందుకే సమస్య మూలం ఎక్కడుందో గమనించాలి. బ్రహ్మపుత్ర వరదల్ని అరికట్టడానికి మనం ఒక్కరం వ్యూహాలు పన్నడం వల్ల ప్రయోజనం లేదు. మనతోపాటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌వంటి నదీ పరివాహ ప్రాంత దేశాలన్నీ సమష్టిగా ఆలోచించి, పరస్పర సహకరించుకుంటేనే వరదల్ని ఏదో మేరకు అరికట్టడం సాధ్యమవుతుంది. ఈలోగా తీసుకునే చర్యలన్నీ తాత్కాలిక ఉప శమనం ఇస్తాయే తప్ప శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. మన వంతుగా చేయాల్సిందల్లా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడం. అది చేయనంతకాలమూ ఈ వరదల బెడద తప్పదు. -
బ్రహ్మపుత్రుల బంధువు..!
సామాజిక సేవ ఏటికి ఎదురీదడం అసాధ్యం అంటుంటారు. అలాంటిది రవీంద్రనాథ్ ఏకంగా వరదకే ఎదురీదవచ్చంటారు. గత 20 సంవత్సరాలుగా వరదల విషయంలో బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంత ప్రజల ను విజ్ఞానవంతులను చేస్తున్నాడాయన. ప్రపంచంలో నాలుగో పెద్ద నది బ్రహ్మపుత్ర. టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించే ఈ నదికి వరదలు రావడమనేది చాలా సాధారణమైన విషయం. గత వంద సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఏడాదీ వరదలు వచ్చిన దాఖలాలున్నాయి. పర్యవసనంగా తీవ్రస్థాయిలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. వరదలు వచ్చి వెళ్లడం ఒక ముప్పు అయితే... ఆ బీభత్సకాండ ముగిసిన తర్వాత ఏర్పడే భయంకరమైన పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అంటువ్యాధులతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు. హిమాలయ పర్వతసానువుల్లోని కైలాసగిరిలో జనించి, బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసే వరకూ బ్రహ్మపుత్ర నది కూడా వరద రూపంలో తన తీర ప్రాంతంలోని ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అలా బ్రహ్మపుత్ర వరదలతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో ఒకటి ...కొకరికటపబ్నా గ్రామం. అస్సాం పరిధిలో ఉండే ఈ గ్రామం... వరదలను ఎదుర్కొనడంలో ఇతర పరీవాహక ప్రాంతాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది! ఆ విషయంలో పూర్తి క్రెడిట్ దక్కాల్సింది రవీంద్రనాథ్‌కి. ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివిన ఆయనకి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. కానీ వాటి పట్ల ఆసక్తి చూపలేదు. తన చదువుతో తను ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, ఆస్తులను సంపాదించుకోవడం కంటే... తీర ప్రాంతంలో ఉండే అమాయక ప్రజల ధన, ప్రాణాలను కాపాడటమే మిన్నగా భావించాడు. వారి సమస్యల నుంచి గట్టెక్కించాలంటే వారిని విజ్ఞానవంతులను చేయడమే పరిష్కారమార్గమని భావించాడు. అందుకోసం రూరల్ వాలంటీర్ సెంటర్ (ఆర్వీసీ)ని ఏర్పాటు చేశాడు. కొంతమంది యువకులను కలుపుకొని వరదబాధిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించడం ఆరంభించాడు. బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలకు బంధువయ్యాడు. తాగే నీరు, శానిటేషన్ వ్యవస్థల మీద వరద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ రెండిటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే... వరద తర్వాత పర్యవసనాలను సులభంగా తట్టుకోవచ్చన్న తన ఆలోచనను అమల్లోపెట్టాడు రవీంద్రనాథ్. ప్రభుత్వ సహకారంతో శుద్ధమైన నీటిని పంపిణీ చేసే ఏర్పాట్లను చేశాడు. వరదలు సంభవించిన సమయాల్లో ఆర్వీసీ అందించే సహకారం బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంత ప్రజలకు వరప్రదంగా మారింది. అస్సాం ఎగువ ప్రాంతంలో వరద తాకిన ఆరున్నర గంటల తర్వాత వరదనీరు బంగ్లాదేశ్‌ను చేరుకొంటుంది. అంతలోపు ఎక్కడిక్కడ ప్రజలను అలర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశాడు రవీంద్రనాథ్. ఇంటర్నెట్, ఇ-మెయిల్, మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా సమాచారాన్ని అందరికీ చేరవేస్తారు. ప్రస్తుతం బ్రహ్మపుత్ర తీర ప్రాంతంలోని మొత్తం 800 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది ఆర్వీసీ వ్యవస్థ. దాని ద్వారా ఎంతో సేవ చేస్తోన్న రవీంద్రనాథ్ను యునిసెఫ్, యూరోపియన్ యూనియన్లు గుర్తించి, సాంకేతిక సహకారం అందించడానికి ముందుకొచ్చాయి!