breaking news
Brahmayya
-
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... కంభం మండలం దరగ గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. బుధవారం రాత్రి 10గంటల సమయంలో బ్రహ్మయ్యకు ఫోన్ రావడంతో హడావుడిగా బయటకు వెళ్లాడు. అతను గురువారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామంలోని యువకులు చుట్టుపక్కల గాలించగా.. బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో బ్రహ్మయ్య చెప్పులు కనిపించాయి. అక్కడే రక్తపు మరకలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని చిల్లచెట్ల పొదల్లో బ్రహ్మయ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అతడ్ని కత్తులతో పొడిచి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు స్థానికులు గుర్తించారు. వినాయక నిమజ్జనం సమయంలో వివాదం వల్లే?గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వివాదం జరిగిందని, దీనిపై కక్ష పెట్టుకుని బ్రహ్మయ్యను హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. గ్రామంలో ఒకరిపై తమకు అనుమానం ఉందని కంభం సీఐ మల్లికార్జున, ఎస్ఐ ఎస్వీ రవీంద్రారెడ్డికి చెప్పారు. కాగా, బ్రహ్మయ్య హత్య కేసులో రాజకీయ కోణం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
యువతిని ఆదుకున్న ‘దిశ’
కందుకూరు: దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళల పట్ల ఆపద్బాంధవునిగా మారింది. సోమవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూబగుంట గ్రామం వద్ద ఓ యువతి అనుమానాస్పదంగా తిరుగుతుందని బ్రహ్మయ్య అనే యువకుడు దిశ యాప్‌కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే రూరల్ పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ యువతిని ప్రశ్నించారు. తాను మదనపల్లి నుంచి విజయవాడ వెళ్తూ కందుకూరులో బస్సు దిగానని, ఎటువెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు.. ఆమెను ఒంగోలులోని సఖి సెంటర్‌కు తరలించి మదనపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
మాజీ మంత్రి బ్రహ్మయ్య కన్నుమూత
రాజంపేట : వైఎస్సార్ జిల్లా రాజంపేట మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పసుపు లేటి బ్రహ్మయ్య బుధ వారం ఆకస్మికంగా మరణించారు. బ్రహ్మయ్యకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కన్ను మూశారు. బ్రహ్మయ్య పార్థివదేహాన్ని కడప లోని ఆయన స్వగృహానికి తరలించారు. టీడీపీ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నందలూరు మండలంలోని పొత్తపికి చెందిన ఈయన సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
పెద్ద ఉద్యోగి..చిన్న బుద్ధులు
భాగ్యనగర్‌కాలనీ: ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఓ వ్యక్తి ఓ సంస్థలో చెక్కులు దొంగలించి కటకటాలపాలయ్యాడు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు... ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బెజవాడ బ్రహ్మయ్య (55) గతంలో ఐడీపీఎల్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా, ఎన్‌ఐఎఫ్‌ఎంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజింగ్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రొఫెసర్‌గా, ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ప్రస్తుతం మూసాపేటలోని సైబర్హోమ్స్లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సైబర్హోమ్స్లోని ఓ కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసుకుని అందుకు సంబంధించి రూ.11లక్షలకు చెక్కులను బ్రహ్మయ్యకు ఇచ్చాడు. అతను వాటిని సంస్థ అకౌంట్లో జమ చేయకుండా దొంగలించి యూసఫ్‌గూడలోని ఆంధ్రబ్యాంక్‌లో తన స్నేహితుడైన రవీందర్‌బాబు పేరుతో సైబర్ హోమ్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో జమ చేశాడు. వచ్చిన డబ్బును ఇద్దరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే చెక్కులు ఇచ్చిన రహీమోద్దీన్ ఫ్లాట్ కోసం సైబర్‌హోమ్స్ నిర్వాహకులను అడగగా తమకు డబ్బులు చెల్లించలేదనడంతో అతను అవాక్కయ్యాడు. దీనిపై అనుమానం వచ్చిన సంస్థ యాజమాన్యం బ్రహ్మయ్యపై ఫిర్యాదు చేయడం తో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా చేసిన నేరం అంగీకరించాడు. దీంతో అతని స్నేహితుడు రవీందర్బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకుని ఖాతాలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.