
కత్తులతో పొడిచి.. పెట్రోల్ పోసి కాల్చి చంపిన దుండగులు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో ఘటన
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... కంభం మండలం దరగ గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
బుధవారం రాత్రి 10గంటల సమయంలో బ్రహ్మయ్యకు ఫోన్ రావడంతో హడావుడిగా బయటకు వెళ్లాడు. అతను గురువారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామంలోని యువకులు చుట్టుపక్కల గాలించగా.. బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో బ్రహ్మయ్య చెప్పులు కనిపించాయి.
అక్కడే రక్తపు మరకలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని చిల్లచెట్ల పొదల్లో బ్రహ్మయ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అతడ్ని కత్తులతో పొడిచి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు స్థానికులు గుర్తించారు.
వినాయక నిమజ్జనం సమయంలో వివాదం వల్లే?
గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వివాదం జరిగిందని, దీనిపై కక్ష పెట్టుకుని బ్రహ్మయ్యను హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. గ్రామంలో ఒకరిపై తమకు అనుమానం ఉందని కంభం సీఐ మల్లికార్జున, ఎస్‌ఐ ఎస్‌వీ రవీంద్రారెడ్డికి చెప్పారు. కాగా, బ్రహ్మయ్య హత్య కేసులో రాజకీయ కోణం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.