
బైక్‌పై వస్తుండగా మాజీ ఎంపీటీసీపై దుండగుల ఘాతుకం.. మినరల్ వాటర్ కోసం వెళ్తుండగా కాపుకాసి దాడి
తలపై బండరాయితో విచక్షణారహితంగా మోది హత్య.. ఘటనా స్థలంలోనే మృతి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఘటన
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు రమేష్‌నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్‌పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్‌ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్‌నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్‌నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్‌నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు.
తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.
రాజకీయ నేపథ్యం..
రమేష్‌నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్‌నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.