breaking news
Brahmani wedding
-
మోగనున్న కల్యాణ వీణ
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుమార్తె వివాహం బుధవారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నగరం నడిబొడ్డున 36 ఎకరాల విస్తీర్ణంలోని ప్యాలెస్ మైదానంలో తిరుపతి, హంపి, బళ్లారి తరహాలో సినీ సెట్టింగ్లతో అత్యద్భుతంగా పెళ్లి వేదికను తీర్చిదిద్దారు. నాలుగు రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించేలా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి మెహందీ కార్యక్రమంలో భాగంగా పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి హాజరైన మహిళలందరికీ మెహందీ అలంకరించారు. ఈ సందర్భంగా సంగీత, నృత్య కార్యక్రమాల్లో పలువురు సినీ తారలు పాల్గొని తమ నృత్యాలతో అలరించడంతో పెళ్లికి కొత్త శోభ సంతరించుకుంది. కాగా ఈ రోజు ఉదయం జరుగనున్న వివాహ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఆహుతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రంగు రంగుల విద్యుద్దీపాలతో ప్యాలెస్ మైదానం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వివాహ వేడుకకు హాజరైన వారికి వడ్డించేందుకు దేశంలోని వివిధ రకాల వంటకాలను కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ వేడుకకు గాలి జనార్దనరెడ్డి స్వస్థలం బళ్లారితో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో ఇప్పటికే బెంగళూరు తరలివెళ్లారు. -
‘బ్రాహ్మణి పెళ్లికి పెద్దగా ఖర్చు చేసే ఉద్దేశం లేదు’
బళ్లారి : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ మహోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు అన్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణి తనకు కూడా కుమార్తెలాంటిదన్నారు. ఆమె పెళ్లికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ పెళ్లికి పార్టీలోని జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నామని, వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం అధునాత పరిజ్ఞానంతో తయారు చేశామన్నారు. తమ స్థాయికి తగ్గట్టుగా మధ్య తరగతి తరహాలోనే వివాహం జరుగుతందని శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి పెదనాన్న సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పెళ్లి ఏర్పాట్లు బళ్లారిలోనూ జరుగుతున్నాయన్నారు. జనార్దన్ రెడ్డి నవంబర్ 1న ఇక్కడికి వస్తారని, 10వ తేదీన పెళ్లికూతురిని చేసే కార్యక్రమం చేస్తామన్నారు. తదుపరి మిగిలిన అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే నిర్వహిస్తామన్నారు. బ్రాహ్మణి వివాహం నవంబర్ 16న రాజీవ్ రెడ్డితో బెంగళూరులో జరగనుంది. (చదవండి ...గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్)